Advertisement


Home > Movies - Movie Gossip
దిలీప్‌కు తెలుగు తెరకు ఉన్న అనుబంధం ఇదే..!

మొన్నటి వరకూ ఒక పెద్దమనిషి. ఇప్పుడు జైల్లో ఖైదీ. మరో రకమైన తప్పు చేసి జైలుకు వెళ్లి ఉంటే.. దిలీప్‌ మరీ ఇంత చెడ్డవాడు అయ్యేవాడు కాదేమో. ఒక అమ్మాయి, తన సాటి నటిపై కక్షకట్టి ఆమెపై కసితో ఆమె జీవితాన్ని నాశనం చేయించే కుట్రపన్నాడు ఈ హీరో. సినిమాల్లో హీరోగా.. చాలామంది అమ్మాయిల జీవితాలను నిలబెట్టే పాత్రలు, అమ్మాయిల మానాన్ని ప్రాణాలను కాపాడే పాత్రలు చేసిన దిలీప్‌.. నిజజీవితంలో మాత్రం సినిమాల్లో విలన్‌ కన్నా దారుణంగా వ్యవహరించాడు.

తనకు వ్యతిరేకంగా గళం విప్పుతుందనే కారణం చేత భావనపై దాడి చేయించాడు. దాడి అనే మాటతోనే ఆపేయాలి. ఎందుకంటే.. దిలీప్‌ చేయించిన దరిద్రపు గొట్టు, నీఛమైన, దారుణమైన పనిని విశదీకరించడం భావన మనోభావాలను దెబ్బతీయడమే అవుతుంది. అంతదారుణంగా వ్యవహరించాడు దిలీప్‌ అలియాస్‌ గోపాలక్రిష్ణన్‌ పద్మనాభన్‌ పిళ్లై.

మొన్నటి వరకూ దిలీప్‌ గురించి చెప్పమని(భావన ఇన్సిడెంట్‌కు ముందు) అడిగితే.. మొదట చెప్పేమాట స్వయం కషితో ఎదిగాడు అనేది. సినీ వారసత్వం లేకుండా ఎదిగిన అనామకుల్లో దిలీప్‌ కూడా ఒకరు. సినీ ఇండస్ట్రీలో ఎవరైనా సొంతంగా ఎదిగి వస్తే వారిపై.. మరింత అభిమానం ఉంటుంది కదా.. వారసత్వంతో ఎదిగిన వారితో పోలిస్తే.. ఇలాంటి వారిపై అభిమానం పాళ్లు ఎక్కువ ఉంటాయి కదా.. దిలీప్‌ కూడా అలాంటి అభిమానాన్నే సొంతం చేసుకున్నాడు. 

చాలామంది మలయాళీ కళాకారుల జీవితాలు 'కళాభవన్‌'తోనే మొదలవుతాయి. ఈ కల్చరల్‌ హౌసే దిలీప్‌కు కూడా జీవితం ఇచ్చింది. అనామక నేపథ్యం నుంచి వచ్చిన దిలీప్‌ కళాభవన్‌లో మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్‌ను ఆరంభించాడు. అదే సమయంలో మొదలైన టెలివిజన్ల ద్వారా కెరీర్‌ను మలుచుకున్నాడు. ఏసియానెట్‌ నెట్‌వర్క్‌లో సీరియల్స్‌లో నటించడం ద్వారా దిలీప్‌ తొలుత బహుళ గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత సినిమాల వైపు వెళ్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ప్రస్థానం ప్రారంభించాడు. అలా తెరవెనుక నుంచి చోటామోటా పాత్రలతో తెర ముందుకు వచ్చాడు దిలీప్‌.

మలయాళీ ఇండస్ట్రీని మోహన్‌లాల్‌, మమ్ముట్టీ వంటి స్టార్‌ హీరోలు శాశిస్తున్న వేళ, మరోవైపు యాక్షన్‌ ఎంటర్‌ టైనర్లు, సెమీపోర్న్‌ సినిమాలు ఊపేస్తున్న సమయంలో.. అనామకుడిగా దిలీప్‌ ప్రస్థానం మొదలైంది. వ్యక్తిగతంగా ప్రతిభ, దొరికిన మంచి మంచి పాత్రలు, కలిసివచ్చిన లక్‌.. దిలీప్‌ను ఇండస్ట్రీలో సెటిల్‌ చేసింది.

మలయాళీ స్టార్‌ హీరోల సినిమాల్లో కమేడియన్‌కు ఎక్కువ.. హీరో స్థాయికి తక్కువ.. తరహా పాత్రలు చేస్తూ దిలీప్‌ తన ప్రత్యేకతను నిరూపించుకుంటూ వచ్చాడు. దిలీప్‌ వంటి వాళ్ల లక్‌ ఏమిటంటే.. మాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ తరహా సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. ప్రొఫెషనల్‌గా అపోజిట్‌ అనిపించుకున్న హీరోలు కూడా కలిసి నటించే సంప్రదాయం ఉన్న ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే మలయాళ చిత్ర పరిశ్రమ మాత్రమే. 

అలా పెద్ద హీరోల పాత్రల్లో కాస్తంత ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ వచ్చిన దిలీప్‌కు స్టార్‌ డైరెక్టర్లు కూడా మంచి మంచి అవకాశాలు ఇస్తూ వచ్చారు. ఇమేజ్‌లు ఏమీలేవు, ఎలాంటి పాత్రలు చేసినా అడిగేవారు లేరు.. దీంతో దిలీప్‌కు ప్రయోగాలకు అవకాశం దక్కింది. కథాబలం ఉన్న సినిమాల్లో హీరోగా కూడా నటిస్తూ దిలీప్‌ దూసుకుపోయాడు. నెమ్మదినెమ్మదిగా స్టార్‌ అయ్యాడు. తన సినిమాలతో కోట్లరూపాయల వ్యాపారం చేసే దశకు వచ్చాడు.

ఎక్కడా ఆగకుండా, వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా.. ఇండస్ట్రీలో నంబర్‌ త్రీ! అనిపించుకున్నాడు. మోహన్‌లాల్‌, మమ్ముట్టీల తర్వాత.. దిలీపే. ఇదీ దిలీప్‌ పాతికేళ్ల ప్రస్థానం. 1992లో నటుడిగా ఆరంభించిన ఇతడు 2017లో మలయాళీ ఆర్టిస్టు అసోసియేషన్‌ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యాడు. భావనపై దాడి కేసులో దిలీప్‌ ప్రమేయం గురించి పక్కా ఆధారాలున్నాయని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

దాదాపు ఇరవైరకాల ఆధారాలను సమీకరించుకున్నాకే దిలీప్‌ను అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. మరి భావనపై జరిగిన దాడిరీత్యా చూస్తే.. అభియోగాలను పోలీసులు రుజువు చేస్తే.. దిలీప్‌కు నిర్భయ యాక్ట్‌ కింద గట్టి శిక్షేపడే అవకాశం ఉంది. దీంతో నటుడిగా దిలీప్‌ కెరీర్‌ దారుణంగా దెబ్బతినే అవకాశం ఉంది.

తెలుగు సినిమాతో బోలెడంత అనుబంధం!

కేవలం మలయాళీ చిత్రాల్లోనే గాక.. తమిళ, కన్నడ సినిమాల్లో కూడా దిలీప్‌ నటించాడు. అయితే అలా చేసింది కేవలం నాలుగు సినిమాల్లో మాత్రమే. తెలుగులో అయితే దిలీప్‌ ఎప్పుడూ డైరెక్టు సినిమాలు చేయలేదు. కానీ.. దిలీప్‌ సినిమాలు తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన దాఖలాలున్నాయి. అవి అనువాదాలుగా కూడా కాదు కానీ.. రీమేక్‌ అయ్యి విజయం సాధించాయి. ప్రత్యేకంగా నిలిచాయి. మలయాళంలో దిలీప్‌ చేయగా.. అక్కడ సూపర్‌ హిట్‌ కావడంతో మనోళ్లు వాటిని రీమేక్‌ చేశారు.

ఈ జాబితాలోని కొన్ని ప్రముఖమైన సినిమాలను ప్రస్తావిస్తే.. రవితేజ హీరోగా నటించిన 'దొంగోడు' సినిమా అసలు హీరో దిలీపే. మలయాళంలో 'మీసా మాధవన్‌' పేరుతో రూపొందిన ఈసినిమా సంచలన విజయం సాధించింది. దిలీప్‌ను అక్కడ స్టార్‌ను చేసిన సినిమా ఇదే. ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ అయిన ఈ సబ్జెక్ట్‌ను దిలీప్‌ చక్కగా పడించాడు. తెలుగులో మాత్రం మలయాళంలో అయినంత హిట్‌ కాలేదు.

తెలుగులో విజయం సాధించిన 'హనుమాన్‌ జంక్షన్‌' ఒరిజినల్‌లో కూడా దిలీప్‌ నటించాడు. మలయాళంలో 'తెన్‌ కాశీపట్టణం' పేరుతో రూపొంది సూపర్‌ హిట్‌ అయిన సబ్జెక్టునే తెలుగులో హనుమాన్‌ జంక్షన్‌ పేరుతో రూపొందించారు. తెలుగులో వేణూ చేసిన పాత్రను మలయాళంలో పోషించింది దిలీపే. ప్రత్యేకించి దిలీప్‌ మలయాళంలో చేసిన సినిమాలు తెలుగులో వేణూకు బాగా సెట్‌ అయినట్టుగా ఉన్నాయి.

'కల్యాణరామన్‌' మలయాళంలో సంచలన విజయం సాధించిన మరో సినిమా. దీన్నే తెలుగులో 'కల్యాణ రాముడు' పేరుతో రీమేక్‌ చేశారు. వేణూ హీరోగా నటించిన ఈ సినిమా ఫర్వాలేదనిపించుకుంది. 'కుంజికూనన్‌' ఈ సినిమాలో దిలీప్‌ అష్టావక్రుడి పాత్రతో అదరగొట్టేశాడు. ఈ సినిమానే తమిళంలో సూర్య రీమేక్‌ చేశాడు. ఆపై ఆ సినిమా 'సుందరాంగుడు' పేరుతో తెలుగులోకి అనువాదం అయ్యింది.

దిలీప్‌ హీరోగా మలయాళంలో హిట్టైన 'సీఐడీ మూస' అనే సినిమా తెలుగులో వేణూ హీరోగా 'రామాచారి-వీడు పెద్ద గూఢాచారి' పేరుతో రీమక్‌ అయ్యింది. వీటన్నింటి కన్నా ముందు మలయాళంలో 'పంజాబీహౌస్‌' అనే సూపర్‌ హిట్‌ సినిమా వచ్చింది. దిలీప్‌ హీరోగా నటించిన ఈ సినిమానే తెలుగులో 'మా బాలాజీ' పేరుతో రూపొందింది నవీన్‌ వడ్డే హీరోగా నటించాడు. చక్కని ఎంటర్‌ టైనర్‌ అయిన ఈ సినిమా తెలుగులో అంతగా ఆడలేదు.

హిందీలో ఆ మధ్య ఈ సినిమానే 'చుప్‌ చుప్‌ కే ' పేరుతో రూపొంది హిట్‌ అయ్యింది. ఇక దిలీప్‌ కెరీర్‌లో పెద్ద సూపర్‌ హిట్‌ 'బాడీగార్డ్‌' ఈ సినిమాను కేవలం తెలుగులో మాత్రమేగాక తమిళం, కన్నడ, హిందీ, బెంగాళీ వంటి భాషల్లో కూడా రీమేక్‌ చేశారు. తెలుగులో వెంకటేష్‌, హిందీలో సల్మాన్‌లు హీరోలుగా నటించారు. తెలుగులో పెద్దగా ఆడలేదు కానీ.. హిందీలో మాత్రం భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నటించింది.

ఇలా దిలీప్‌ నటించిన పలు వైవిధ్యభరితమైన సినిమాలు ఇతర భాషల్లో కూడా రీమేక్‌ అయ్యాయి. అక్కడా ప్రత్యేకంగా నిలిచాయి. కొసమెరుపు ఏమిటంటే.. ఆ మధ్య దిలీప్‌ ఒక డైరెక్ట్‌ తెలుగు సినిమాలో నటించే ప్రతిపాదన వినిపించింది. కోడి రామక్రిష్ణ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందుతుందని ప్రచారం జరిగింది.

పుట్టపర్తి సత్యసాయి బాబా బయోపిక్‌ అది. సాయిబాబా మరణించాకా.. ఆయన జీవిత కథ ఆధారంగా సినిమా రూపొందిస్తానని కోడి ప్రకటించగా, టైటిల్‌ రోల్‌లో దిలీప్‌ పాత్రపేరు వినిపించింది. మరి అలాంటి పాత్ర చేయాల్సిన దిలీప్‌ ఇంత నీఛమైన మనస్తత్వంతో కేసులను ఎదుర్కొంటూ.. జైలుకు వెళ్లడం గమనార్హం.