-తెరను ఏలబోయే ఛాన్స్ ఎవరిది?
-చిరంజీవి తర్వాత 'చిరంజీవి' ఎవరవుతారు?
-ఇదో అనధికార, అంతర్గత పోరాటం
-'నెక్ట్స్ మెగాస్టార్' ట్యాగ్ కోసం ఆరాటం
-పోటీలో ప్రముఖ హీరోలు, ఫ్యాన్స్ గ్రూప్‌ల హడావుడి!
ఏ క్షణాన కొణిదెల శివశంకర వరప్రసాద్‌కు 'చిరంజీవి' అనే స్క్రీన్‌నేమ్ ఇచ్చారో కానీ.. ఆయన తెలుగు తెరపై 'చిరంజీవి'గా నిలిచాడు. దశాబ్దాల పాటు మరోవాదన లేకుండా టాప్ హీరోగా నిలిచాడు. పదేళ్ల విరామానంతరం తిరిగి రీఎంట్రీ ఇచ్చాక కూడా చిరంజీవి తన సత్తా ఏమిటో నిరూపించారు. 'మెగాస్టార్' బిరుదుకు ఉన్న పవరేంటో చూపించాడు. అదెంత పవర్ ఫుల్‌ట్యాగో చాటి చెప్పాడు.
మరి చిరంజీవి ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీగానే ఉన్నా, ఇండస్ట్రీలో మళ్లీ తన స్థానాన్ని తనే సొంతం చేసుకున్నా.. 'నెక్ట్స్ మెగాస్టార్' అనే అంశంపై ఇప్పుడు తెరపైకి వచ్చింది. నెక్ట్స్ మెగాస్టార్ ఎవరు? అనేది ఒక ప్రశ్నగా, ఫజిల్‌గా మిగిలింది. మరి చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన నేఫథ్యంలో, రీఎంట్రీతో తన సత్తా అదే స్థాయిలో ఉందని నిరూపించుకున్న తరుణంలో.. రీఎంట్రీ తర్వాత సరికొత్త ఉత్సాహంతో మరిన్ని సినిమాలకు రెడీ అవుతున్న నేపథ్యంలో.. అవి కూడా భారీ సినిమాలుగా రూపొందుతున్నాయన్న ఊహాగానాల మధ్య.. 'నెక్ట్స్ మెగాస్టార్' అనే ఊసే అనవసరం. ఎందుకంటే.. మెగాస్టార్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు కదా..!
ఒకవేళ చిరంజీవి గనుక సినిమాలు చేయడాన్ని పూర్తిగా ఆపేసి ఉండుంటే, పదేళ్ల విరామాన్ని అలాగే కొనసాగించి ఉండుంటే.. నెక్ట్స్ మెగాస్టార్ ఎవరు? అనేది ఈ పాటికి ఒక పెద్ద ప్రశ్న అయ్యేది. కానీ.. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే, చిరంజీవి సినిమాలు చేస్తూన్నా, కూడా దీర్ఘకాలాన్నో, భవిష్యత్తును లెక్కేస్తూనో.. నెక్ట్స్ మెగాస్టార్ ఎవరు? అనే అంశంపై చర్చకు తెరలేపారు. టాలీవుడ్ హీరోలు, వారి అభిమానుల మధ్య నడుస్తున్న పోటీలు, రాజకీయాల నేపథ్యంలో ఈ ప్రశ్న ఆసక్తికరంగా మారింది.
'నెక్ట్స్ మెగాస్టార్' అనే ట్యాగ్‌ను అల్లుఅర్జున్ ఓన్ చేసుకుంటున్నాడు.. అనేది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. 'డీజే' వంటి అల్లాటప్పా సినిమాతోనే అల్లుఅర్జున్ భారీ కలెక్షన్లను రాబడుతున్నాడు.. అందుకే అతడు నెక్ట్స్ మెగాస్టార్ అనేది అతడి అభిమానుల ట్యాగ్. మరి అల్లుఅర్జున్ వైపు నుంచి, అతడి ఫ్యాన్స్ ట్రూపు నుంచి ఈ వాదన ఆరంభం అయ్యేసరికి.. అన్నివైపుల నుంచి ఫ్యాన్స్ అలర్ట్ అవుతున్నారు.
నెక్ట్స్ మెగాస్టార్ ఎవరు? అనే అంశంపై ఎవరికి వారు తమ తమ అభిమాన హీరోలను తెరపైకి తెస్తున్నారు. తమ ఫేవరెట్ హీరోనే నెక్ట్స్ మెగాస్టార్ అంటూ వీళ్లు వాదులాడుకుంటున్నారు. మరి ఈ క్రమంలో ఎవరి ప్లస్ పాయింట్లేమిటీ, ఎవరి నెగిటివ్స్ ఏమిటి? అనే అంశాన్ని కాస్త విపులంగా పరిశీలించి చూడాలి.
సీనియర్లు పోటీ నుంచి తప్పుకున్నట్టే…
చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్.. ఈ క్రమం నడించింది చాలాకాలం పాటు. చిరంజీవి తర్వాత బాలయ్యే, బాలయ్య తర్వాతి స్థానం నాగ్‌దే, నాగ్ తర్వాతి స్థానం వెంకీదే.. అన్నట్టుగా తెలుగు ప్రేక్షకులు చాలా కాలాన్ని గడిపేశారు. ఈ హీరోలు ఒకరు ఒక హిట్టును ఎక్కువ కొట్టినా, వరసగా కొన్ని ఫ్లాఫులనే ఎదుర్కొన్నా.. ఈ క్రమం మాత్రం మారలేదు.
మరి అలా సాగుతున్న ప్రస్థానం నుంచి చిరంజీవి కొంతకాలం తప్పుకున్నారు. మరి అలాంటి సమయంలో రెండో స్థానంలో ఉన్న బాలయ్యో, మూడో స్థానంలో ఉండిన నాగార్జునో, నాలుగో స్థానం అనుకున్న వెంకీనో తొలిస్థానం కోసం పోటీలోకి రాలేదు. చిరంజీవి హీరోగా నటించడం ఆపాడు.. ఇదే సమయంలో ఈ హీరోలు కూడా తమ ధోరణిలో చాలామార్పు తీసుకొచ్చారు.
హీరో ఇమేజ్‌కే వీళ్లంతా దూరం జరగడం గమనార్హం. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు.. బాలయ్య హీరోగా నటించడం కొనసాగించినా, పూర్తి రూటు మార్చాడు. క్యారెక్టర్ తరహా పాత్రల్లో నటించడానికి కూడా వెనుకాడను అనే సంకేతాలనిచ్చాడు. 'ఊ కొడతారా, ఉలిక్కి పడతారా' అనే సినిమాలో అలాంటి పాత్రే చేశాడు. ఇక నాగార్జున పూర్తిగా మారిపోయాడు.
'భాయ్' సినిమా నాగార్జుకు జ్ఞానోదయాన్ని కలిగించింది. హీరోగా నటించడం.. అనే మాటనే పక్కన పెట్టేసి, పూర్తి డిఫరెంట్ పాత్రలు చేస్తూ వస్తున్నాడు. ఇక వెంకీ సరేసరి. అంతకు ముందే ఇమేజ్‌కు పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వని వెంకీ మల్టీ స్టారర్లు, తండ్రి పాత్రలు గట్రా చేస్తూ.. రేసు నుంచి తప్పుకున్నాడు. కాబట్టి.. ఇకపై కూడా వీళ్లు మెగాస్టార్ అనే ట్యాగ్ కోసం పోటీలో లేనట్టే.
పవన్ కల్యాణ్ కూడా రేసులో లేనట్టే..
నెక్ట్స్ మెగాస్టార్ అనే ట్యాగ్ విషయంలో పవన్ కల్యాణ్ కూడా రేసులో లేనట్టే.. రాజకీయాలే అందుకు కారణం. జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ అడపాదడపా రాజకీయాల వైపు వెళ్లి వస్తున్నాడు. ఆ రాజకీయ పార్టీతో పవన్ కొందరివాడు అయిపోయాడు కూడా. అలాగే వచ్చే ఎన్నికల తర్వాత పవన్ రాజకీయాల వైపే వెళ్లిపోతాడో లేక ఇలాగే అడపాదడపా సినిమాలు చేస్తాడో ఇంకా క్లారిటీ లేదు.
ఎన్నికల తర్వాత సినిమాల్లో నటించను అని ప్రకటించాడు కానీ, తన అన్న చిరంజీవిలాగే అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తనకు జీవనాధారం సినిమాలే అని.. ఒకేమాటతో పవన్ మళ్లీ సినిమాల వైపు వచ్చేయగలడు.. కానీ రాజకీయ పార్టీని రద్దు చేయకపోవచ్చు. రెండు పడవల ప్రయాణాన్నే కొనసాగించవచ్చు. కాబట్టి.. సినిమాల్లో ఏదో ఉన్నత స్థానాన్ని అధిరోహించే అవకాశాలు ఇక లేనట్టే.
ఇక మిగిలింది వీళ్లే…
మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లుఅర్జున్, రామ్‌చరణ్.. వీళ్లు ఎలిజబుల్ హీరోలు. 'నెక్ట్స్ మెగాస్టార్' అనే ట్యాగ్ విషయంలో పోటీదారులు. ఏజ్‌లో ఒకరికీ మరొకరికీ కాస్తా తేడా ఉంది కానీ.. లుక్ విషయంలో దాదాపు ఒకే వయస్కులుగా కనిపిస్తారు, ఒకే తరహా పాత్రలు, ఒకరు కాదనుకున్న పాత్రలను మరొకరు చేస్తున్నారు. కాబట్టి వీళ్లను వేరు చేయలేం. ఈ ఐదు మందీ పోటీలో ఉన్నట్టే. మరి వీరిలో నెక్ట్స్ మెగాస్టార్ ట్యాగ్ ఎవరికి? అనేది శేష ప్రశ్న. విశేషం ఏమిటంటే.. ఇప్పటికే ఈ హీరోలందరికీ వాళ్ల వాళ్ల ట్యాగులున్నాయి.
మహేశ్‌ను ఇప్పటికీ ప్రిన్స్‌గానే వ్యవహరిస్తున్నారు అభిమానులు. ఇక ఎన్టీఆర్‌ను యంగ్ టైగర్ అని, అల్లుఅర్జున్‌ను స్టైలిష్ స్టార్ అని, ప్రభాస్‌ను యంగ్ రెబల్‌స్టార్‌అని, రామ్‌చరణ్‌ను మెగా పవర్ స్టార్ అని వ్యవహరిస్తున్నారు. ఈ హీరోల సినిమాల టైటిల్ కార్డ్స్‌లో కూడా ఈ బిరుదులే పడుతున్నాయి.
ఎవరి బిరుదుల వాళ్లకు ఉన్నప్పటికీ.. నెక్ట్స్ మెగాస్టార్ అనే అంశంలో అభిమానుల మధ్య, సినీ ప్రేక్షకుల మధ్య 'నెక్ట్స్ మెగాస్టార్' ట్యాగ్ మాత్రం చర్చనీయాంశంగా నిలుస్తోంది. ఈ హీరోలు ఈ విషయంలో స్పందించనప్పటికీ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో కొట్టుకుని చస్తున్నారు.
మహేశ్ ఏమన్నాడంటే…!
ఇప్పుడు కాదు.. దాదాపు దశాబ్దం క్రితమే 'నెక్ట్స్ మెగాస్టార్' అనేమాట చర్చలోకి వచ్చింది. దానికి కారణం 'పోకిరి' సినిమా. అప్పటి వరకూ టాలీవుడ్‌లో ఉండిన రికార్డులన్నింటినీ రిపేర్ చేసింది పోకిరి. అంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత మహేశ్‌ను మీడియా ఆకాశానికి ఎత్తేసింది.
ఎంతలా అంటే.. చిరంజీవి తర్వాత.. కాదు కాదు, చిరంజీవితో సమానమైన స్థాయి అనేమాటను వినిపించింది. చిరంజీవి రాజకీయాల్లోకి వెళతాడనే ఊహాగానాలు అప్పుడప్పుడే మొదలు కావడంతో.. ఇక టాలీవుడ్ నంబర్‌వన్ మహేశ్ బాబే.. అనే మాటను గట్టిగా చెప్పాయి మీడియా వర్గాలు.
దానిపై మహేశ్ అప్పట్లోనే స్పందించాడు కూడా. ఇంతకీ మహేశ్ ఏమన్నాడంటే.. 'చిరంజీవిగారు నంబర్ వన్. ఆయన ఆ స్థాయికి ఊరికే ఎదగలేదు. వరస బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. వరస విజయాలను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మేం సాధించింది ఒక్క పెద్ద విజయమే.. ఇలాంటివి మరిన్ని రావాలి..' అని ఆపేశాడు. తనే నంబర్ వన్ అని మహేశ్ అప్పుడు విర్రవీగలేదు. పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ వచ్చినప్పుడు మహేశ్ చాలా వినమ్రంగా మాట్లాడాడు.
చిరంజీవిని మించిపోయాడు.. అని చాలామంది వ్యాఖ్యానించినా.. వారి మాటలను ఓన్ చేసుకోలేదు మహేశ్. ఆ తర్వాత ఈ హీరో కొన్ని ఫ్లాఫులను ఎదుర్కొన్నాడు, మరికొన్ని హిట్లను సంపాదించుకున్నాడు.. ఈ పదేళ్లలో మహేశ్ సాధించింది ఏమిటంటే, స్థిరమైన అభిమానగణాన్ని సంపాదించుకోవడం. తన తండ్రి ఫ్యాన్ ఫాలోయింగ్ కొంతవరకూ మహేశ్‌కు క్యారీ అయ్యింది, దానికి అదనంగా అనేక రెట్ల అభిమానగణాన్ని మహేశ్ సంపాదించుకున్నాడు.
అటు అందంతో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను, ఇటు మంచి టైమింగ్‌తో కూడిన నటనతో తటస్థ సినీ ప్రేక్షకుడినీ ఆకట్టుకున్నాడు. అలాగే వివాదరహితుడిగా కొనసాగుతున్నాడు. ఇక తెలుగు హీరోల్లో మిగతా వారికి సాధ్యం కాని సమయంలోనే పక్కభాషల్లో అందరి కన్నా ముందే మహేశ్ బాబుకు మంచి గుర్తింపు దక్కింది.
ఎండార్స్‌మెంట్ ఒప్పందాలు వంటి వాటితో కూడా అదరగొట్టేశాడు. తనకంటూ ప్రత్యేకంగా మార్కెట్ వ్యాల్యూను సంపాదించుకున్న హీరోగా నిలిచాడు. ఇలాంటి పాయింట్స్‌ను బట్టిచూస్తే మహేశ్ నిస్సందేహంగా నెక్ట్స్ మెగాస్టార్ అనే రేసులో ముందుంటారు.
అయితే చిరంజీవి స్థాయిలో మాస్ ఇమేజ్ లేకపోవడమే పెద్ద డ్రాబ్యాక్. చిరంజీవిని ఓన్ చేసుకున్న రీతిలో మహేశ్‌ను మాస్ జనాలు ఓన్ చేసుకోలేదు. క్లాస్‌లో చిరంజీవికి మించిన స్థాయి అభిమానాన్ని సంపాదించుకున్నాడు కానీ, మాస్‌లో మాత్రం మహేశ్ అంతలా నాటుకోలేకపోయాడు.. ఈ రెండింటికీ కారణం మహేశ్ బాబు పర్సనాలిటీనేనేమో!
ఎన్టీఆర్ పరిస్థితి ఏమిటి?
టాలీవుడ్‌లో యంగ్‌గా పరిగణింపబడే టాప్ హీరోల్లో మహేశ్ తర్వాత సీనియర్ ఎన్టీఆరే. ముచ్చటగా మూడు సినిమాలైనా చేయకముందే ఎన్టీఆర్ టాప్ హీరోలకు పోటీ అనిపించుకున్నాడు. స్టూడెంట్ నంబర్ వన్, ఆది సినిమాల తర్వాత ఎన్టీఆర్ నాటి ఫ్యాబ్ ఫోర్ చిరు, బాలయ్య, వెంకీ, నాగ్‌లకు పోటీ అనేంత స్థాయికి వెళ్లిపోయాడు. అయితే ఆ వెంటనే సుబ్బు, నాగలు ఎన్టీఆర్‌ను దించాయి.
సింహాద్రి మళ్లీ పతాక స్థాయికి తీసుకెళ్లినా… ఆపై కొన్నేళ్ల పాటు ఎన్టీఆర్‌కు స్లంప్ పిరియడ్ నడిచింది. ఆ తర్వాత పడుతూలేస్తూ సాగుతోంది. ఇలా నడుస్తున్నా స్థిరమైన అభిమానగణాన్ని సంపాదించుకోవడంతో ఎన్టీఆర్ లీడ్‌లో ఉన్నాడు. ఆఖరికి నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్‌గా చెప్పుకునే వాళ్లలో కూడా చీలిక తెచ్చుకుని, వారిలో తన ఫ్యాన్స్ సెపరేటు అనేంత స్థాయికి చేరాడు తారక్.
సాదాసీదా సినిమా అయిన జనతా గ్యారేజ్‌తో ఎన్టీఆర్ భారీ వసూళ్లను రాబట్టుకోగలిగాడు.. మాస్ ఫాలోయింగ్ పుష్కలంగా ఉంది.. తాత వారసత్వం, సొంత ప్రతిభ.. ఎన్టీఆర్‌ను, కొన్ని ఎదురుదెబ్బలతో వచ్చని పరిణతి.. ఇవన్నీ ఎన్టీఆర్‌కు ప్లస్ పాయింట్లు. అయితే ప్రతిబంధకాలూ ఉన్నాయి.. ఎన్టీఆర్‌ను తొక్కేయడానికి నారా, నందమూరి కుటుంబాల నుంచే ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి.
ఆఖరికి ఎన్టీఆర్ సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితి కూడా అప్పుడప్పుడు ఏర్పడుతోంది. అలాగే.. ఎన్టీఆర్ కెరీర్‌లో ఎత్తుపల్లాలు తీవ్రంగా ఉంటున్నాయి. పూర్తి పీక్స్ లేకపోతే డిప్రెషన్ అన్నట్టుగా మారింది పరిస్థితి. విజయాల విషయంలో తారక్ స్థిరత్వాన్ని కొనసాగించాల్సి ఉంది. అదే జరిగితే ఎన్టీఆర్ నంబర్ వన్ అని తేల్చేయవచ్చు. కనీసం ఒక డికేడ్ పాటు ఫామ్‌ను చాటి.. బాలయ్యను పూర్తిగా మరిచిపోయేలా చేస్తే తప్ప.. ఎన్టీఆర్ నంబర్ వన్ కాలేడు.
రామ్‌చరణ్.. సిసలైన వారసుడు అయ్యేనా?
తండ్రిని అభిమానించిన వాళ్లంతా తనయుడిని అభిమానించాలని రూల్ లేదు. అందుకే రామ్‌చరణ్ కొన్ని సాలిడ్ హిట్స్‌ను ఇచ్చినా, మాస్‌లో మంచి ఇమేజ్‌నే సంపాదించినా.. ఇంకా నంబర్ వన్ రేసులో మాత్రమే ఉన్నాడు. నంబర్ వన్ కాలేదు, త్వరలోనే అయిపోతాడు అనే నమ్మకమూ లేదు. చిరంజీవి పోలికలు అయితే కొంత వరకూ వచ్చాయి కానీ.. ఆ టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్ రాలేదు చరణ్‌కు.
చిరంజీవి హార్డ్‌కోర్ ఫ్యాన్స్ చరణ్ వైపు ట్రాన్స్‌ఫర్ అయిపోవడం చరణ్‌కు ప్లస్ పాయింట్. అయితే చిరంజీవిని సినిమాల వరకూ అయినా అభిమానించే సగటు ప్రేక్షకుడు చరణ్‌ను అభిమానించే వైపురాలేదు. దానికి బోలెడన్ని కారణాలు. మరి రాబోయే సినిమాలతో గనుక ఈ పరిస్థితి మారితే చరణ్ రేసులో దూసుకురావొచ్చు. అయితే కొన్ని వివాదాలు చరణ్‌కు చాలా మందిని దూరం చేశాయి.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో రోడ్డున పోయే వారిపై చరణ్ ఆధ్వర్యంలో జరిగిన దాడి, తన సినిమా ఆరెంజ్‌పై నెగిటివ్ రివ్యూలు ఇచ్చారని మీడియాపై అనుచితంగా మాట్లాడటం, వంటివి చరణ్‌పై గర్విష్టి అనే ముద్రను వేశాయి. చరణ్‌ను సామాన్య దర్శకుడు, నిర్మాతలు కలవడమే కుదిరే పనికాదు.. అని బండ్లగణేష్ వంటి వ్యక్తి చెప్పాడు.
చరణ్‌ను పొగుడుతున్నాను అని ఆయన అనుకున్నాడు కానీ.. అలాంటి వ్యాఖ్యలు హీరోకీ, ప్రేక్షకుడికి కూడా దూరం పెంచుతాయి. ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పక్కన పెడితే.. నటన విషయంలో చిరంజీవి చాలా యోజనాల దూరంలో ఉన్నాడు చరణ్.. కాబట్టి ఈ రేసు చరణ్ ఎంతవరకూ రాణిస్తాడో ముందు ముందు తెలుస్తుంది.
ప్రభాస్.. ఏక్ ఫిల్మ్ కా సుల్తాన్?
బాహుబలి తర్వాత ప్రభాస్ ఏంటి? అనే దాన్ని బట్టి ప్రభాస్ భవితవ్యం ఆధారపడి ఉంది. మీడియా ఉచితంగా హైప్ ఇచ్చింది, భారీ బడ్జెట్, వసూళ్ల నంబర్లు ప్రభాస్‌ను దేశం మొత్తానికీపరిచయం చేశాయి. పరిచయం వరకూ బాగానే ఉంది.. మాస్‌లో కూడా బాహుబలి పుణ్యమాఅని బీభత్సమైన క్రేజ్ వచ్చింది. దాన్ని ఈ హీరో ఎంతవరకూ నిలుపుకుంటాడు? అనేది శేష ప్రశ్న. ఇప్పుడే ప్రభాస్ అసలైన ప్రయాణం మొదలైంది. అది ఒకేసారి వందమైళ్ల వేగంతో మొదలైంది.
ఇకపై దాన్ని పెంచాల్సి ఉంటుంది. అదంతా ఈజీకాదు. వందమైళ్ల వేగంతో మొదలైన ప్రయాణం పొరపాటున అరవై మీదకు వస్తే.. వెనుకబడిపోయినట్టే. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి ఆయనను అభిమానించే మాస్ జనం భారీగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆ ఎక్స్ పెక్టేషన్స్‌ను అందుకోవడంలో ఏ మాత్రం విఫలం అయినా.. ప్రభాస్ కథ మళ్లీ మొదటికి వస్తుంది. ఏక్ ఫిల్మ్ కా సుల్తాన్‌గా మిగిలిపోయే అవకాశాలుంటాయి. దాన్ని ప్రభాస్ ఎంత వరకూ నివారిస్తాడనేదాన్ని బట్టి ఈ హీరో ఫ్యూచర్ ఆధారపడి ఉంది.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అల్లుఅర్జున్..
ఈ నెక్ట్స్ మెగాస్టార్ అనే చర్చకు కారణమైన హీరోనే ఇతడు. సినీ నిర్మాతకు వారసుడిగా కెరీర్ మొదలుపెట్టి, 'ఆర్య' వంటి సినిమాతో ప్రేక్షకుల్లోకి చొచ్చుకుపోయిన హీరో ఇతడు. అందాన్ని, హైట్‌ను, బాడీని చూడకుండా సినిమాను బట్టి ప్రేక్షకుల ఆదరణను పొందాడు. ఆ తర్వాత తన ఫిజిక్‌ను చాలా వరకూ డెవలప్ చేసుకుని ఆకట్టుకునే యత్నమూ చేశాడు. ఇమేజ్‌ను పక్కన పెట్టి వేదం వంటి సినిమాలతో సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాడు.
ఆఖరికి మెగాస్టార్‌కు సిసలైన వారసుడు, నెక్ట్స్ మెగాస్టార్.. అనే ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. పవన్ కల్యాణ్ విషయంలో వ్యాఖ్యలతో, మెగా ఫ్యామిలీనే కానీ ప్రత్యేకం అనే ముద్రతో ముందుకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు ఈ హీరో. ఒకవేళ 'చెప్పను బ్రదర్' అనకపోయినా, నెక్ట్స్ మెగాస్టార్ ట్యాగ్ వాదన లేకపోయినా.. అల్లుఅర్జున్ మెగా ట్రూప్‌లోని అందరి హీరోల్లో ఒకడిగా మిగిలిపోయేవాడు.
నందమూరి ఫ్యాన్స్ మధ్య ఎన్టీఆర్‌తో ఎలాంటి చీలిక వచ్చిందో, మెగా ఫ్యాన్స్‌లో కూడా దాదాపు అలాంటి చీలికనే తెచ్చుకుంటున్నాడు అల్లుఅర్జున్. మర్రిచెట్టు నీడన ఎదగలేను అనుకున్నట్టుగా ఉన్నాడు.. మరి దాన్నుంచి బయటకు వచ్చి ఎంతవరకూ ఎదుగుతాడో చూడాలి.