బిగ్ బాస్..బిగ్ బాస్..అంటూ తెగ ఊదర గొట్టారు. తీరా చూస్తే ఏనుగు సామెతలా మారిపోయింది. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ ను ఏంకర్ గా తీసుకోగానే, అబ్మో సూపర్ అనుకున్నారు. సూటేసుకుని, ఎన్టీఆర్ ప్రోమోలు చేస్తే, ఏదో వుంటుందిలే అనుకున్నారు. కానీ మొదటి నుంచీ షో సక్సెస్ అన్నది అందులో పాల్గొనే వాళ్ల పైనే ఆధారపడి వుంటుందని అందరూ అనుకుంటూ వచ్చారు. అయితే ఎవరు పాల్గొంటారు అన్నది ఇప్పటిదాకా సస్పెన్స్ గానే వుంది.
కానీ తీరా సస్పెన్స్ విడిపోయాక, బిగ్ బాస్ షో మీద ఆసక్తి సగానికి పడిపోయినట్లే అయింది. ఎందుకంటే టాలీవుడ్ లో బేరాల్లేని జనాలే అక్కడ కనిపించారు తప్ప, జనాలకు ఆసక్తి వున్న వాళ్లు ఎవరూ అక్కడ పెద్దగా కనిపించలేదు.
70 రోజుల పాటు ఆ షో చూడాలంటే ఏంకరింగ్ చేసే ఎన్టీఆర్ మాత్రమే ఆసక్తి కరం కాదు. పాల్గొనేవాళ్లు కీలకం. పాల్గొనే వాళ్ల చమక్కులు, సరదాలు, హుషారులు అవసరం. అవి ఏమేరకు వుంటే ఆ మేరకు షో క్లిక్ కావాల్సి వుంటుంది.
దీనికి తోడు ఫిమేల్ పార్టిసిపెంట్స్ అయినా కాస్త ఆసక్తి కరమైన వారిని ఎంచుకోవాల్సింది. వేద ఆల్వేజ్ డల్ గా వుంటుంది. ముమైత్ ఖాన్, జ్యోతి ఒకే. సి సెంటర్లలో టీవీ చూసేవారికి కాస్త ఆసక్తి కలిగించవచ్చు. మేల్ పార్టిస్టిపెంట్స్ లో ధనరాజ్, సంపూర్ణేష్ బాబు కాస్త బెటర్. మిగిలిన వారి పట్ల జనాలకు అంత ఆసక్తి వుండదు.
సో ఈ నలుగురే బండి లాగించుకు రావాలి. ఎందుకంటే నిత్యం ఎన్టీఆర్ షో లోకనిపించడు కదా? అందువల్ల డైలీ ఈ షో చూడాలంటే ఆసక్తి కరంగా ఎపిసోడ్ లు రన్ కావాలి. మరి ఈ నలుగురితో ఏ రేంజ్ ఆసక్తి వస్తుందా అన్న అనుమానం కలుగుతోంది.
వాస్తవానికి బిగ్ బాస్ షోకి అసలు సమస్య 70 రోజులు బాహ్య ప్రపంచానికి దూరంగా వుండడం. టాలీవుడ్ లో చాలా మందిని అడిగితే పెద్దగా ఎవ్వరూ ఇష్టపడలేదని తెలిసింది. దానికి కారణం బిజీగా వున్నవారంతా రోజుకు కనీసం 50 వేలు సంపాదిస్తారు. ఈ షో కోసం చూసుకుంటే ఇక్కడ సినిమా చాన్స్ లు పోతాయి. 70 రోజుల తర్వాత మళ్లీ టాలీవుడ్ కే రావాలి. అందువల్ల సమస్య అవుతుంది.
అందుకే టాలీవుడ్ లో బిజీగాలేని నటులను మాత్రమే తీసుకోగలిగారు. జ్యోతి, వేద, సంపూర్ణేష్ బాబు వీళ్లంతా ప్రస్తుతం చేతిలో పెద్దగా సినిమాలు లేని వారే. సో,మరి వీరంతా కలిసి బిగ్ బాస్ షోను ఏమేరకు రక్తి కట్టించగలరనే దానిపైనే టీఆర్పీ రేటింగ్ ఆధారపడి వుంటుంది.
మా కాస్తా స్టార్ మా గా మారిన తరువాత మీలో ఎవరు కోటీశ్వరుడు షో ఫ్లాప్ అయింది. ఆ తరువాత వస్తున్న రెండో పెద్ద షో ఇది. ఎలా వుంటుందో చూడాలి.