కాలం కలిసి వచ్చినపుడు అంతంత మాత్రం చిత్రాలతోను విజయాలు అందుకోవచ్చు. రాజా ది గ్రేట్, ఎంసిఏ చిత్రాలతో కూడా పాస్ అయిపోయిన దిల్ రాజు పట్టిందల్లా బంగారమే అనుకున్నారు. కానీ క్యాలెండర్ మారడంతోనే దిల్ రాజు అదృష్టం కూడా రివర్స్ అయినట్టు కనిపిస్తోంది. రాజ్ తరుణ్‌తో తీసిన చిత్రం లవర్ అట్టర్‌ఫ్లాప్ అయింది.
రాజ్ తరుణ్ కష్ట కాలంలో వున్నాడని, ఆడియన్స్ అతడిని పట్టించుకోవడం లేదని సాకులు చెప్పవచ్చు కానీ దిల్ రాజు పేరు పోస్టర్ మీద వున్నా కానీ ప్రేక్షకులు పట్టించుకోలేదనేది కాదనలేని సత్యం. ఆ చిత్రాన్ని దిల్ రాజు ముందే త్యజించేసాడు కానీ 'శ్రీనివాస కల్యాణం' మాత్రం తనకి మరో 'బొమ్మరిల్లు' అవుతుందని చెబుతూ వచ్చాడు. నిత్యం సెట్స్‌లోనే వుంటూ దగ్గరుండి మరీ అన్నీ పర్యవేక్షించాడని కూడా చెప్పుకున్నారు.
అయితే దిల్ రాజు లెక్క మళ్లీ తప్పినట్టే కనిపిస్తోంది. శ్రీనివాస కళ్యాణం చిత్రానికి మొదటి రోజు టాక్ సరిగా రాలేదు. దానికి తోడు ఓపెనింగ్స్ కూడా వీక్‌గానే వచ్చాయి. దిల్ రాజు బ్యానర్ పేరు చూసి అయినా ఫ్యామిలీస్ బారులు తీరిపోతారని భావించారు. కానీ మరోసారి దిల్ రాజుకి షాకే తగిలింది. తదుపరి రాబోయే రామ్ సినిమా 'హలో గురూ ప్రేమ కోసమే' అయినా దిల్ రాజుని తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందా లేదా అనేది చూడాలి.