డైరక్టర్లను నిలదీయండి

బాపు కార్టూన్ ఒకటి వుంటుంది. జరుగు.. జరుగు ఇంకోడొస్తున్నాడు అని. అలాగ్గే తయారవుతోంది టాలీవుడ్ వ్యవహారం. నిర్మాతలు ఏదో అయిడియా వేసి, డైరక్టర్ల సాయంతొ, కష్టపడి మార్కెట్ ను పెంచుతుంటారు. హీరోలు ఆ మార్కెట్…

బాపు కార్టూన్ ఒకటి వుంటుంది. జరుగు.. జరుగు ఇంకోడొస్తున్నాడు అని. అలాగ్గే తయారవుతోంది టాలీవుడ్ వ్యవహారం. నిర్మాతలు ఏదో అయిడియా వేసి, డైరక్టర్ల సాయంతొ, కష్టపడి మార్కెట్ ను పెంచుతుంటారు. హీరోలు ఆ మార్కెట్ ను చూపించి, మరింత రెమ్యూనిరేషన్ లాగేస్తారు. మూడు కోట్ల నుంచి ముఫై కోట్ల వరకు తీసుకునే హీరోలు మనకున్నారు.

మూడు కోట్ల నుంచి నూట ముఫై కోట్ల మేర బడ్జెట్ తో సినిమాలు తయారవుతున్నాయి. కానీ లాభాల దగ్గరకు వస్తేనే కొంపలు కొల్లేరయిపోతున్నాయి. సగటుగా చూసుకుంటే రోజుకు కోటి రూపాయిల వంతున హుష్ కాకి అయిపోతున్నాయి. వారానికి కనీసం ఒక్క చిన్న సినిమా విడుదలవుతొంది. కోటి నుంచి రెండు కోట్ల కనీసపు ఖర్చు. వందకు ఒక్కటి డబ్బులు వెనక్కుతెచ్చుకుంటున్న దాఖలాలు లేవు. ఇక పెద్ద సినిమాలు తేడా వస్తే కోట్లకు కోట్లే గల్లంతు అవుతున్నాయి

ఏడాది ప్రారంభంలో ఓం నమో వెంకటేశాయ వల్ల నిర్మాత పెద్దగా లాస్ కాలేదు కానీ, బయ్యర్లు పోయారు. లక్కున్నోడు వల్ల నిర్మాతకు ఏడెనిమిది కోట్ల వరకు పోయింది. కానిస్టేబుల్ వెంకట్రామయ్యకు కు కూడా మూడు కోట్ల వరకు పోయిందని వినికిడి. విన్నర్ సినిమా వల్ల నిర్మాతలకు పెద్దగా పోలేదు కానీ, బయ్యర్లు లాస్ అయ్యారు. ద్వారక సినిమా వల్ల నిర్మాతకు అయిదు కోట్లకు పైగా పోయింది. గుంటూరోడు సినిమా పరిస్థితీ అంతే.

కాటమరాయుడు సినిమా వల్ల నిర్మాతకు లాస్ లేదు కానీ బయర్లు పోయారు. రోగ్ సినిమా నేరుగా విడుదల చేసుకున్నారు. మొత్తం ఫట్. సుమారు 15కోట్లకు పైగానే నష్టం వుంటుందని అంచనా. మిస్టర్ సినిమా నిర్మాతలకు పది కోట్ల వరకు కన్నం పెట్టేసింది. బాబు బాగా బిజీ జస్ట్ ఒకటి రెండు కోట్ల నష్టంతో సరిపెట్టింది. రాధ సినిమా పరిస్థితీ అంతే. ఫ్యాషన్ డిజైనర్ కేరాఫ్ లేడీస్ టైలర్ కూడా నష్టాలే మిగిల్చింది. జయదేవ్ సినిమా సుమారు 12కోట్ల వరకు నష్టాలు మిగిల్చింది.

గడచిన రెండు నెలల్లో లై సినిమా 10కోట్లు, జయ జానకీ నాయక 10కోట్లు, పైసా వసూల్ 15కోట్లు, పటేల్ సర్ రెండు కోట్లు, గౌతమ్ నందా 5కోట్లు (బయ్యర్లకు అంతకన్నా ఎక్కువ), దర్శకుడు (కేవలం బయ్యర్లకు మాత్రమే) అయిదు కోట్లు, నక్షత్రం 10కోట్లు, యద్ధం శరణం 10కోట్లు

అంటే గడచిన తొమ్మిది నెలల్లో సుమారు 100 నుంచి 120కోట్లు నిర్మాతలు లాస్ అయ్యారు. ఇక పెద్ద సినిమాలు అమ్మేసి, అవి ఢమాల్ మని, బయ్యర్లు లాస్ అయినది వేరే లెక్క. ఇవి కాక వారం వారం విడుదలయ్యే ఒకటీ అరా చిన్న సినిమాలు వేరు. అవి అన్నీ కలిసి కనీసం ఓ యాభై కోట్లు అన్నా వుంటాయి.

సినిమా వ్యాపారాన్ని హీరోలు శాసిస్తున్నారు. వాళ్ల మార్కెట్ శాసిస్తోంది. దాంతో ఇష్టం వచ్చినట్లు రెమ్యూనిరేషన్లు ఇవ్వాల్సి వస్తోంది. హీరో చాన్స్ ఇస్తే లాభాలు వస్తాయనుకుంటున్నారు. కానీ అలా జరగడం లేదు. ఓ సీనియర్ టాప్ హీరోకి అయిదు కోట్లకు పైగా రెమ్యూనిరేషన్ వుంటే పది కోట్లు ఇచ్చారు. కానీ వ్యాపారం జరగలేదు. గతంలో యాభై కోట్ల మార్కెట్ వున్నపుడు నలభై లో సినిమా తీసేవారు. ఇప్పుడు వంద కోట్ల మార్కెట్ వచ్చింది. కానీ ఖర్చు 90కోట్లకు చేరిపోయింది. ఇందులో సింహభాగం హీరోలకే పోతోంది.

హీరో ల డేట్ల కోసం టెంప్టింగ్ ఆఫర్లు ఇస్తున్నారు. వాళ్లు పుచ్చుకుంటున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబులు పాతిక కోట్ల రేంజ్ లో, ఎన్టీఆర్, బన్నీ లాంటి వాళ్లు 15 కోట్ల రేంజ్ లో తీసుకుంటున్నారు. త్రివిక్రమ్, కొరటాల శివ లాంటి డైరక్టర్లు కూడా హీరోలతో సమానంగా చార్జ్ చేస్తున్నారు. కానీ సినిమాలు ఆ క్వాలిటీతో వుండడం లేదు.

లై, పైసా వసూల్, యుద్ధం శరణం వంటి సినిమాలు పూర్తిగా దర్శకుల వైఫల్యాలే. దర్శకుల వైఫల్యం అని ఏకగ్రీవంగా తెలిసినపుడు కనీసం, నష్టాన్ని వాళ్లు భరించేలా ఓ పద్దతి అయినా వుండాలి. ముఖ్యంగా పెద్ద దర్శకుల విషయంలో పూరిజగన్నాధ్ లాంటి వాళ్ల సబ్జెక్ట్ నమ్మి సినిమాపై ముఫై నుంచి నలభై కోట్లు పెడతారు. హీరో కూడా డైరక్టర్ ను నమ్ముతాడు. మరి అలాంటపుడు సినిమాను డైరక్టర్ తన చిత్తానికి చుట్టేసి, చేతిలో పెడితే? నష్టం ఎవరు భరించాలి?

యుద్ధం శరణం సినిమాను హీరో తన ఫ్రెండ్ కదా అని నమ్మాడు. హీరో చెప్పాడని నిర్మాత నమ్మారు. మరి ఇప్పుడు ఆ సినిమాను డైరక్టర్ ఫెయిల్యూర్ అని అందరూ అంటున్నారు. మరి నష్టాన్ని డైరక్టర్ ను రికమెండ్ చేసిన హీరో భరిస్తాడా? లేదా డైరక్టర్ భరిస్తాడా? శ్రీనువైట్ల లాంటి దర్శకుడిని నమ్మి మిస్టర్ కోసం 20కోట్లకు పైగా పెట్టారు. మరి శ్రీను వైట్ల ఎంతొ కొంత భరించాలి కదా? లై సినిమా డైరక్టర్ ఫెయిల్యూర్ అని తేలిపోయింది. నిర్మాతల చేత ముఫై అయిదు కోట్లు పెట్టించేసాడు. ఎవరు భరించాలి నష్టాన్ని?

నిర్మాత అత్యాశకు పోతే అతని తప్పు. కానీ డైరక్టర్ ను నమ్మి మీడియం బడ్జెట్ లోనే వెళ్లినపుడు సినిమా అతని వల్లే ఢమాల్ అంటే భరించేలా నిర్మాతలు అంతా కలిసి రూల్స్ రాసుకోవడం అవసరం ఏమో ?