తనకు తెలియకుండానే తన సినిమా విడుదల అయిపోవడంపై ఫైర్ అవుతున్నాడు సందీప్ కిషన్. బహుశా ఇతడు నటించిన ‘ప్రాజెక్ట్ జెడ్’ అనే సినిమా విడుదల అయ్యిందని చాలా మందికి తెలియకపోవచ్చు కూడా. ఈ సినిమా నిన్న విడుదల అయినట్టుగా పత్రికా ప్రకటనలు వచ్చాయి. ఎంతైనా సందీప్ కిషన్.. ప్రతిభావంతుడు అనిపించుకున్న కుర్ర హీరో. ఇప్పటికే విజయాలను కలిగిన హీరో.
ఇతడి సినిమా వస్తోందంటే కాస్తైనా హంగామా ఉంటుంది, ప్రచారం ఉంటుంది కదా.. అలాంటి వాటికి అతీతంగా విడుదల అయిపోయింది ‘ప్రాజెక్ట్ జెడ్’. ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి బోలెడు ఆకర్షణలున్నాయి. లావణ్య త్రిపాఠి హీరోయిన్, జాకీష్రాఫ్ నటించాడు, గిబ్రాన్ మ్యూజిక్ ఇచ్చాడు. ఒక సినిమాను మార్కెట్ చేసుకోవడానికి ఇంతకన్నా పాజిటివ్ పాయింట్లు అవసరం లేదేమో.
అంతా ఓకే కానీ.. ఈ సినిమా విడుదల అవుతున్నట్టుగా సందీప్ కిషన్ కే సమాచారం లేదట. మాయవన్ అని తమిళంలో రూపొందించిన సినిమాకు అనువాదమే ఈ ప్రాజెక్ట్ జెడ్. వివిధ అవాంతరాల అనంతరం ఈ డిసెంబర్ 14న తమిళంలో విడుదల అయ్యింది మాయవన్. ఇంతలోనే తెలుగులోకి అనువదించి విడుదల చేశారు. ఈ సినిమా ముచ్చట్లు చాలానే ఉన్నాయి. కనీసం సందీప్ కిషన్ సొంత డబ్బింగ్ చెప్పుకోలేదట.. ఎవరితోనో డబ్బింగ్ చెప్పించి లాగించేశారట.
దీంతో ఈ హీరో ఫైర్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. తెలుగునాట ఇప్పటికే వరస పరాజయాలతో ఉన్నాడితను. ఇలాంటి సమయంలో.. ఇలాంటి డబ్బింగులు వచ్చి వెళ్లిపోతూ.. తన మార్కెట్ ను, కెరీర్ ను దెబ్బతీస్తాయనేది ఈ హీరోభయం. ఇది వరకూ శర్వానంద్ ‘రాజాధిరాజా’ విషయంలోనూ ఇలాంటి లొల్లే జరిగింది. తమిళంలో ఈ కుర్ర హీరోల చేస్తున్న సినిమాలు అనువాదం అంటూ అనామకుల చేతుల్లో పడటం ఇలా ఇబ్బందికరంగా మారుతోంది.