ఇండస్ట్రీలోని ఆ పన్నెండు మందే డ్రగ్స్ వాడుతున్నారా? అంటే.. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ అధికారుల నుంచి దాదాపుగా ఔను అనే సమాధానమే వస్తోంది! మరి చెప్పేవారికి కామెడీగా లేదేమో కానీ, వినేవాళ్లకు మాత్రం ఇందులోని హాస్యంపాళ్లు స్పష్టంగా అర్థం అవుతోంది. ఈ వ్యవహారంలో పట్టుబడ్డ కెల్విన్ అనే డ్రగ్ డీలర్ అనేక మందికి డ్రగ్స్ సరఫరాను చేశాడు.. ఇతడి లిస్టులో హైస్కూల్ పిల్లలు కూడా ఉన్నారని ఒకవైపు వార్తలు వస్తుండగా ఇండస్ట్రీలో మాత్రం ఇతడి కస్టమర్లు కేవలం పన్నెండు మందినే తేల్చారు. వారికి మాత్రమే నోటీసులు, వారిని మాత్రమే విచారణ చేస్తున్నారు.. ఇందుకు సంబంధించి హైడ్రామా నడుస్తోంది. మరి పట్టుబడ్డ వారిపట్ల ఎలాంటి సానుభూతి లేదు కానీ… కేవలం ఆ పన్నెండుమందికే నోటీసులు ఇవ్వడమే ఇక్కడ ప్రహసనం.
డ్రగ్స్ వ్యవహారంలో మొత్తం నలభైమంది సినీ సెలబ్రిటీల పేర్లు ఉన్నాయని తొలిరోజు వార్తలు వచ్చాయి. కానీ రెండోరోజుకు వారిలో పన్నెండు మంది పేర్లను ఇన్ డైరెక్టుగా బయటపెట్టారు. మూడో రోజుకు ఆ పన్నెండు మంది పేర్లనూ డైరెక్టుగానే బయటపెట్టారు, వారికి నోటీసులూ జారీ చేశారు. హైడ్రామా మధ్యన వారి విచారణ కొనసాగుతోంది. మీడియాకు అయితే ఈ వ్యవహారం ద్వారా మంచి మేతే అందుతోంది కానీ, ఈ సందడిలో కొన్నిపేర్లు తెరపైకి వచ్చినట్టుగానే వచ్చి.. మరుగయిపోయాయి. ఆ వైనం పూర్తిగా తెరమరుగు అయ్యింది.
ఓవరాల్‌గా డ్రగ్స్ వ్యవహారం విచారణ పూర్తిగా నీరు గారిపోయిందని చెప్పకతప్పదు. ఇండస్ట్రీలోని కొంతమంది ప్రముఖ నిర్మాతల తనయుల పేర్లు కూడా డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నాయని.. ఈ కేసు విచారణ మొదలుకాగానే వారిలో కొందరు అలర్ట్ అయ్యారని స్పష్టమైన వార్తలు వచ్చాయి. రాజకీయంగా తమకు, తమ కులానికి గల పలుకుబడిని ఉపయోగించుకుని వారంతా పేర్లు బయటపడకుండా చూసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అలా తప్పించుకున్నది ఎవరో కూడా మీడియాలో ఇన్‌డైరెక్టు వార్తలు వచ్చాయి. దానికి వారు సదరు సెలబ్రిటీలు భుజాలు తడుముకున్నారు కూడా. వారికి నోటీసులు జారీకాకున్నా.. వారు మాత్రం తమకేం సంబంధం లేదనేశారు.
దీంతోనే.. డ్రగ్స్ వ్యవహారం పూర్తిగా పక్కదారి పట్టడం మొదలైంది. మరి మొత్తం నలభైమంది ఆనవాళ్లు దొరికితే వారిలో కేవలం పన్నెండు మందికి మాత్రమే నోటీసులు జారీ అయ్యాయనే మాట వినిపిస్తున్న నేపథ్యంలో.. జరుగుతున్న విచారణకు సత్యసంధత ఉందంటే నమ్మడం ఎలా? ఎవరినీ వదలం.. అని ప్రభుత్వ పెద్దలు ప్రకటిస్తున్నారు కానీ, వదిలేయాల్సిన వాళ్లను ముందే వదిలేశారు.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్లనే పట్టుకున్నారనే ప్రతిపాదన వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు.. సినీ సెలబ్రిటీలతో చాలా సాన్నిహిత్యాన్ని ప్రదర్శిస్తున్న వైనం అందరికీ స్పష్టం అవుతూనే ఉంది. ప్రత్యేకించి రాష్ట్ర విభజన తర్వాత ఒకవర్గం సినిమా వాళ్లు కేసీఆర్‌కు బాగా క్లోజ్ అయ్యారు.
ఎంతగా క్లోజ్ అయ్యారంటే.. గతంలో ఇండస్ట్రీ మొత్తం తెలుగుదేశంపార్టీ తీర్థం పుచ్చుకున్న రోజుల్లో చంద్రబాబును ఆకాశానికి ఎత్తిన స్థాయికి మించి ఇండస్ట్రీలోని కొంతమంది కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అవసరం ఉన్నా, లేకపోయినా ఈ పొగడ్తలు, భజనలు చూస్తుంటే.. సదరు సినీ పెద్దలు.. మొహమాట పెట్టో, ప్రాధేయపెట్టో.. తమ వారిని కాపాడుకునేయత్నం చేసి ఉండవచ్చు. వారితో సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్న ప్రభుత్వ పెద్దలు కరుణించి ఉండవచ్చు.. అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది సామాన్యుడి నుంచి.
పూరీ జగన్నాథ్‌ను గట్టిగా విచారించారనో.. మరొకరికి నోటీసులు జారీ చేశారనో.. ప్రభుత్వం స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తోందని అనుకోవచ్చు. ఇది కొంతవరకూ మాత్రమే. కానీ అసలు వ్యక్తులు తప్పించుకున్నట్టైతే.. జరుగుతున్న విచారణను సమర్థించడం ఎలాగా? మొదట్లోనే బోలెడన్ని అనుమానాలకు తావిచ్చారు ఎక్సైజ్‌శాఖ అధికారులు. అసలు తీవ్ర ఉత్కంఠ రేపిన 'రెండోలిస్టు' వెలుగే చూడలేదు. నోటీసులు అందుకున్న పన్నెండు మంది పేర్లూ మొదటిరోజు ఆఫ్ ద రికార్డుగా బయటకు వచ్చాయి. వాటిని నమ్మేదెలా? అనుకున్నంతలోనే వారందరికీ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో.. మీడియా దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ ఉందని అనుకోవాల్సి వచ్చింది. కానీ అదేమీడియా రెండో రోజున మరికొన్ని పేర్లను ఇన్‌డైరెక్టుగా రాయగా.. ఆ జాబితాలోని వారికి మాత్రం నోటీసులూలేవు. దీంతో ఏదో జరిగింది.. అని సామాన్యుడు అనుకుంటున్నాడు.
ఇండస్ట్రీ పెద్దలే ఇరికించారా..?
ప్రస్తుతం డ్రగ్స్ జాబితాలో ఉన్న పన్నెండు మందిదీ దాదాపు ఒకే నేపథ్యం. వీరంతా ఒకరికి మరొకరు సన్నిహితులు. దాదాపు ఒకటే ఆటిట్యూడ్ కలిగిన వాళ్లు. తమ సినిమాలేవో తాము చేసుకొంటూ.. ఎవరితో సినిమాలు చేస్తుంటే వారితో మాత్రమే సాన్నిహిత్యాన్ని కనబరిచే టైపు. అలాగే వీరెవరూ వారసత్వ నేపథ్యం నుంచి వచ్చినవాళ్లు కాదు. ఆర్థికంగా అంత మరీ గొప్పస్థాయి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లు కాదు.. కులబలం కూడా అంతంత మాత్రమే. సొంతకులంలోని సినీ పెద్దలతో కూడా వీరికి కొన్ని విబేధాలున్నాయి. సాన్నిహిత్యం లేదు. ఇక చార్మి, ముమైత్‌ల విషయానికి వస్తే.. వాళ్లు నాన్‌లోకల్. మరి వెలుగులోకి వచ్చిన పన్నెండు పేర్లూ కూడా.. ఎవరూ కాపాడకపోవడంతో వెలుగులోకి వచ్చినట్టుగా ఉన్నాయి.. అనేది పరిశీలకులు చేస్తున్న వ్యాఖ్య. డ్రగ్స్ విషయంలో కొంతమంది ప్రముఖుల తనయుల పేర్లు వినిపించినా.. వారికి నోటీసులే జారీకాలేదు. దీంతో ఇదంతా ఒక వ్యూహాత్మకంగా జరిగినది.. అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పెద్దచేపలు తప్పించుకున్నాయి.. చిన్నచేపలు చిక్కి గిలగిలాడుతున్నాయి.. అనే వ్యాఖ్యానాలూ వినిపిస్తున్నాయి.
నోటీసులు అందుకున్న పన్నెండు మందిలో కొందరు సినీ ఇండస్ట్రీలోని పెద్దలపట్ల ధిక్కార ధోరణితో వ్యవహరించిన దాఖలాలు ఉన్నాయి. అప్పటి కసిని దాచిన పెద్దలు ఇప్పుడు వీళ్లను ఇరికించారనే.. వీళ్ల పేర్లను మాత్రమే బయటకు తీసుకొచ్చారనే మాట వినిపిస్తోంది. గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. సిట్ విచారణ మొదలు అయిన కొన్ని గంటల్లోనే కొంతమంది సినీ పెద్ద మనుషులు ప్రెస్‌మీట్ పెట్టారు. సినిమా వాళ్లకు సంబంధం ఉంది, లేదు.. అంటూ కన్య్ఫూజింగ్‌గా మాట్లాడారు. అప్పుడే అసలు గేమ్ మొదలైందని ఇండస్ట్రీలోనే ప్రచారం జరుగుతోంది. తాము కాపాడుకోవాల్సిన వాళ్లందరినీ వాళ్లు కాపాడుకున్నారని.. ఎవరికీ పట్టని వాళ్లు మాత్రం ఇప్పుడు వెక్కివెక్కి ఏడుస్తున్నారని.. టాక్.
సినిమా వాళ్లు తెరపైకి రావడమే వ్యూహాత్మకమా..!
అసలుకు ఈ వ్యవహారంలో సినిమా వాళ్ల పేర్లు వెలుగులోకి రావడమే వ్యూహాత్మకం అనే విశ్లేషణా వినిపిస్తోంది. భాగ్యనగరంలోని చాలా స్కూల్స్ డ్రగ్స్ కోరల్లో చిక్కుకున్నాయని తొలిరోజు సంచలన వార్తలు వచ్చాయి. హైస్కూల్ లెవల్లోని విద్యార్థులకే డ్రగ్స్ ఒంటపడుతున్నాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. దీంతో గగ్గోలు మొదలైంది. హైస్కూల్ లెవల్ పిల్లలకే డ్రగ్స్ అందే పరిస్థితి వచ్చిందంటే… ఎక్సైజ్‌శాఖ ఏం చేస్తోంది? భాగ్యనగరంలోని స్కూల్స్‌లో ఎలా కల్చర్ నడుస్తోంది? ప్రభుత్వం ఏం చేస్తోంది? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇవన్నీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇరకాటంలో పడేసేవే.. అందుకే డ్రగ్స్ వ్యవహారం సినిమా వాళ్లపై టర్న్ తీసుకుందని.. స్కూల్ పిల్లలపై వ్యవహారాన్ని నడిపిస్తే.. పోయేది ప్రభుత్వం పరువే.. కావడంతో.. ఆల్రెడీ జాబితాలో ఉన్న సినిమా వాళ్లతో వ్యవహారాన్ని స్పైసీగా మార్చి.. జనాలను అంతా అటువైపు టర్న్ చేశారు.. ఇదంతా ఒక గేమ్.. అని కూడా ఉన్నతస్థాయి వర్గాలు కొన్ని వ్యాఖ్యానిస్తున్నాయి, మీడియా సర్క్సిల్స్‌లో ఇదే చర్చ జరుగుతోంది. మరి లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక..!