అదేమీ పెద్ద సినిమా కాదు. మీడియం రేంజ్ సినిమానే. కానీ అనేక విధాలుగా ప్రాధాన్యత వచ్చింది. ఇద్దరు డైరక్టర్లు సాయం పట్టడం, ఒక డైరక్టర్ వీలయినంత బ్యాకెండ్ లో వుండి వర్క్ చేయడం, పైగా నిర్మాణ సంస్థ ఎప్పటి నుంచో ఓ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూడడం, వీటన్నింటికి తోడు ఆ హీరో నటించిన దీని ముందు సినిమా నిర్మాతకు లాస్ నే తెచ్చింది. అందువల్ల ఈ సినిమా హిట్ అయి తీరాలి. అప్పుడే అందరికీ ఉపశమనం.
ఇంతకీ ఆ సినిమా…. కిరాక్ పార్టీ. అవును నిఖిల్ నటించిన కిరాక్ పార్టీ ప్రచారం ఫ్రారంభమైంది. మాస్ హీరో మాదిరిగా గోలుసులు లాగుతూ, చేతులకు పని చెప్పడం, భారీ షట్టర్ ను ఒంటి చేత్తో ఎత్తడం వంటి వ్యవహారాలతో ప్రీ టీజర్ ను విడుదల చేసారు. కన్నడంలో సూపర్ డూపర్ హిట్ అయిన కిర్రాక్ పార్టీకి తెలుగు రీమెక్ ఇది.
నిర్మాణ సంస్థ ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ ఎప్పటి నుంచో ఓ మాంచి బ్లాక్ బస్టర్ కోసం చూస్తోంది. ఈ సినిమాతో అది వస్తుందని ఆశతో వుంది. ఈ సినిమాకు మాటలు రాసింది చందు మొండేటి.
సినిమాకు ముందు అనుకున్న రాజు సుందరంను కాకుండా చందు మొండేటి అసిస్టెంట్ శరణ్ ను డైరక్టర్ ను చేసారు. మరో డైరక్టర్ సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే అందించారు. వీలయినంత వరకు షూటింగ్ తో ఆయన ప్రయాణించారు.
నిఖిల్ ముందు సినిమా కేశవ మాంచి ఫలితం తేలేకపోయింది. అందువల్ల ఇప్పుడు అన్ని విధాలా ఈ సినిమా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రచారం ముందుగానే స్టార్ట్ చేసిన ఈ సినిమా మాంచి టఫ్ కాంపిటీషన్ లో విడుదలవుతోంది.
మెగా హీరో వరుణ్ తేజ-రాశీఖన్నా ఫీల్ లవ్ సినిమా తొలిప్రేమ అదే రోజు విడుదలవుతోంది. సీనియర్ హీరో మోహన్ బాబు లేటెస్ట్ సెన్సేషన్ గాయత్రి కూడా అదే రోజు విడుదల కాబోతోంది. ఈ రెండింటిని తట్టుకుని నిలబడాలి.