రెండేళ్లుగా నిర్మాణం జరుపుకుంటున్నా రాని హైప్ ఒక్క, టీజర్, ట్రయిలర్ తో వచ్చేసింది భాగమతి సినిమాకు. మరో వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ సినిమా అన్ని విధాలా రెడీ అయిపోయింది విడుదలకు. జస్ట్ 142నిమషాల రన్ టైమ్ తో రెడీ అయిన ఈ సినిమా మళ్లీ మరోసారి అరుంధతి లాంటి మ్యాజిక్ చేస్తుందని నిర్మాతలు బలంగా నమ్ముతున్నారు.
ఆర్ట్ డైరక్టర్ రవీందర్ రూపొందించిన కీలకమైన భవంతి సెట్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా వుంటుంది. బాహుబలి తరువాత అనుష్క నటించిన సినిమా కావడం, పైగా విజువల్ ఎఫెక్ట్స్, హర్రర్ జోనర్ కావడం, మాంచి థ్రిల్లింగ్ నెరేషన్ కావడం వంటివి భాగమతిపై అంచనాలు పెంచుతున్నాయి.
కానీ అదే సమయంలో దర్శకుడు అశోక్ ట్రాక్ రికార్డు భయపెడుతోంది. పిల్లజమీందార్ తరువాత హిట్ మాట దేవుడెరుగు, చెప్పుకోదగ్గ సినిమా అతని నుంచి రాలేదు. అయితే ఈ సినిమా కథ, అశోక్ ది అని, తెరవెనుక చాలా వరకు సినిమాటోగ్రాఫర్ మాధి వర్కవుట్ చేసారని వినిపిస్తోంది. అందువల్ల సినిమా మీద అశోక్ ప్రభావం తక్కువే కావచ్చు.
థమన్ రీరికార్డింగ్ ఓ ప్లస్ పాయింట్. అలాగే ఈసారి ఈ సినిమా కోసం ట్యూన్లు కూడా బాగా వైవిధ్యంగా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ మధ్య ఏ సినిమా మీదా అంచనాలు నిలబడడం లేదు. స్పైడర్, అజ్ఞాతవాసి ఇలా ఆశలు తుంచేసిన సినిమాలు చాలా వున్నాయి. భాగమతి ఆ కోవలోకి వెళ్లకుండా, అలరిస్తుందని ఆశించాలి.