షారుక్ ఖాన్ నాలుగేళ్లు తపించి, తపించి సాధించిన ఇండస్ట్రీ రికార్డుని నాలుగే నెలల్లో తుడిచి పారేసాడు ఆమీర్ ఖాన్. ధూమ్ 3తో ఆమీర్ మళ్లీ తిరిగి సింహాసనం అధిష్టించడంతో ఈసారి ఆ చిత్రం వసూళ్లని దాటి మరింత పెద్ద బెంచ్ మార్క్ సెట్ చేయాలని షారుక్ చూస్తున్నాడు. దీపావళికి విడుదలయ్యే హ్యాపీ న్యూ ఇయర్‌తోనే ఈ ఫీట్ చేయాలని షారుక్ ట్రై చేస్తున్నాడు.
ఈ చిత్రానికి తన పబ్లిసిటీ ట్రిక్కులు, గిమ్మిక్కులు అన్నీ వాడేసి విపరీతమైన హైప్ సృష్టిస్తున్నాడు. దాంతో ఈ చిత్రానికి సంబంధించి ట్రెయిలర్ రిలీజ్ అయినా, సాంగ్ రిలీజ్ అయినా కానీ జనం విపరీతంగా ఎదురు చూస్తున్నారు. కమర్షియల్ సినిమాలు తీయడంలో స్పెషలిస్టు అనిపించుకున్న ఫరా ఖాన్ ఈ చిత్రాన్ని ఆర్టిస్టులతో నింపి పారేసింది.
ఈ చిత్రంతో మరి షారుక్ టార్గెట్ చేస్తున్న మూడొందల కోట్లు సొంతమవుతాయా లేక ఇది కూడా రెండు వందల కోట్ల క్లబ్‌లో చేరి అంతటితో సరిపెడుతుందా? అసలే ఈ చిత్రం ఎంత వసూలు చేసినా కానీ ఆ రికార్డు సేఫ్‌గా ఉండడానికి అవకాశాల్లేవు. ఎందుకంటే మరోసారి ఏడాది చివర్లో ఆమీర్‌ఖాన్ వచ్చేస్తున్నాడు. ఈసారి అతని ‘పీకే’ అవతారం ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో అని ట్రేడ్ వర్గాలు ఇప్పట్నుంచే చర్చించుకుంటున్నాయి. కనుక షారుక్‌పై పెద్ద టార్గెట్ సెట్ చేయాల్సిన ప్రెజర్ బాగా ఉంది.