చస్తే చావడమే..మేమెందుకు రావడం?

తెలుగు సినిమా రంగం అంత దరిద్ర గొట్టు రంగం మరొకటి వుండదేమో? ఇక్కడ విజయాలే కీలకం…కుల రాజకీయాలే అవసరం…మళ్లీ మాట్లాడితే ప్రాంతీయ రాజకీయాలు కూడా పరిగణనలోకి తీసుకుంటాం. పేరుకు వేదికలెక్కి ఎన్నో ప్రగల్భాలు పలికేస్తాం..…

తెలుగు సినిమా రంగం అంత దరిద్ర గొట్టు రంగం మరొకటి వుండదేమో? ఇక్కడ విజయాలే కీలకం…కుల రాజకీయాలే అవసరం…మళ్లీ మాట్లాడితే ప్రాంతీయ రాజకీయాలు కూడా పరిగణనలోకి తీసుకుంటాం. పేరుకు వేదికలెక్కి ఎన్నో ప్రగల్భాలు పలికేస్తాం.. అంతే తప్ప ఆచరణలో శూన్య హస్తాలు చూపిస్తాం. 

దర్శకుడు బాపు మరణించారు. చెన్నయ్ లో చనిపోవడం ఆయన చేసుకున్న ఖర్మ..ఎందుకు అక్కడ పోవాలి. అదే హైదరాబాద్ లో పోతే మన సినిమా జనం లైను కట్టి వెళ్లి చూసి వచ్చేవారేమో కదా..అదీ అనుమానమే…అక్కడ మళ్లీ ఆయన మనవాడా కాదా…మనవాడైతే ఓకె. లేదూ కనీసం మనం అందరూ మద్దతిచ్చే పార్టీలో ఏమన్నా వున్నాడా..లేకుంటే వదిలేయండి..

ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరణించాడు..బాపనోడు..పైగా వైకాపాలో వున్నవాడు. మనకెందుకు అట్నించి అటే వాళ్ల ఊరికి పట్టుకుపోతే పట్టుకుపొమ్మనండి. ఎవిఎస్ చనిపోయాడు. అమ్మో తెలుగుదేశంలో వున్నాడు. కాస్తయినా నివాళి ఇద్దాం. తెలంగాణ శకుంతల మరణించింది. అరె తెలంగాణ వాళ్లతో ఎందుకొచ్చిన తలకాయనొప్పి…చాంబర్ కు తీసుకురండి మృతదేహాన్ని..ఉదయ్ కిరణ్ పోయాడు..ఇండస్ట్రీ చిన్న చూపు చూసిందంటున్నారు. పెద్ద తలకాయ అన్యాయం చేసిందంటున్నారు..చాంబర్ కు తెచ్చేయండి..

ఏఎన్నార్ మరణించారు. మనవాడు. పైగా మనకు నాగార్జునతో బోలెడు అవసరాలుంటాయిు…పదండి పోదాం..చూసి రావడానికి సరే..కనిపించి రావడం ముఖ్యం. 
సావిత్రి పోతే నేనే అన్నీ చేసా..ఎవరూ పట్టించుకోలేదు..అన్నారు పెద్దాయిన దాసరి. మాట్లాడితే మాది దర్శకులం అంటారు ఆయన. కానీ ఏదీ చెన్నయ్ వెళ్లే తీరుబాటు లేదు. ఒక్క సీనియర్ దర్శకుడు తోటి వ్యక్తి పోయారని చెన్నయ్ వెళ్లగలిగారా..

ప్రతి ఒక్కరు మూతి ముందు గొట్టం పెడితే నాలుగు మాటలు చెప్పడం. లేదంటే, తమ పీర్వోకి చెప్పి ఓ ప్రకటన పంపించడం. అది కూడా ఆ పీఆర్వోనే రాయాలి మళ్లీ..లేదూ అంటూ ఆంధ్ర దేశంలో పట్టుమని ఒక్క శాతం జనాలకు కూడా తెలియని ట్విట్టర్ లో రెండు ముక్కలు గొణగడం. ట్విట్టర్ లో సంతాపం తెలియచేసాం చూడలేదా..కళ్లు దొబ్బాయా..అంతకన్నా సంతాపం చెప్పడానికి మాకున్న టైమ్ ఏపాటి అని నిలదీయగలరు కూడా. 

అంతే కానీ ఓ మహానుభావుడు..నరనరానా కళను జీర్ణించుకున్నవాడు…ప్రపంచపు చిత్రకళ, సంగీతం..సినిమా పోకడలు పుక్కిట పట్టినవాడు..తెలుగు సినిమా అద్భుతాల జాబితా తీస్తే అందులో ఆయన సినిమాలే రెండయినా వుంటాయి. అలాంటి దర్శకుడు మరణిస్తే, చిరంజీవి, బాలకృష్ణ హీరోలు..మిగిలిన చిన్నా పెద్దా జనాలు..ఇదేనా  ఓ దిగ్దర్శకుడు, అద్వితీయ కళాకారుడికి తెలుగు సినిమా పరిశ్రమ ఇచ్చే గౌరవం.?.పైగా మా…మేము..అని చెప్పుకోవడం కూడాను. 

ఇదంతా ఎవర్నో తిట్టడానికో, మరెందుకో కాదు. కళాకారుల చావులో కూడా కులాల, ప్రాంతాల, ఇంకా రకరకాల ఈక్వేషన్లు చూసుకునే తెలుగు సినిమా రంగం వ్యవహారాలు చూసి కలుగుతున్న ఆవేదన మాత్రమే. 

రేపు మరే మహానుభావుడైనా చనిపోయే ముందు చెన్నయ్ లో కాకుండా హైదరాబాద్ వచ్చి మరణిస్తే ఘన నివాళి దక్కుతుంది. లేకుంటే బాపు మాదిరిగానే వుంటుంది వ్యవహారం. చానెళ్లు పత్రికలు మాత్రం విలువలు తెలుసుకాబట్టి వాటి ధర్మం అవి నిర్వర్తిస్తాయి. కానీ మన సినిమా జనాలకు విలువ అంటే కులం, లేదా డబ్బు, లేదా రాజకీయం, ఇంకా కాకుంటే అవసరం. అంతే

చాణక్య

[email protected]