ఎన్నికలకు ముందు రకరకాల ఛానెళ్లు పుట్టకువస్తున్నాయి. కొన్ని యూ ట్యూబ్ చానెళ్లు, కొన్ని శాటిలైట్ చానెళ్లు ఇలా రకరకాలుగా. ఎన్ని నిలదొక్కుకుంటాయో తెలియదు. అయితే యూ ట్యూబ్ చానెల్ గా స్టార్ట్ అయి, శాటిలైట్ చానెల్ గా మారుతున్న ఓ సంస్థ ఆఫర్ గురించి భలే చిత్రంగా తెలిసింది.
ఓ ఉత్తరాంధ్ర జిల్లాలో ఓ రెండు నియోజకవర్గాలకు రిపోర్టర్ కావాలట. అందుకోసం మీద నుంచి కిందకు అలా అలా వెళ్లింది వెదుకులాట. ఆఖరికి ఆ చానెల్ జిల్లా బాధ్యడు ఓ ఆశావహుడిని పట్టుకున్నాడు. రెండు నియోజకవర్గాలకు నువ్వే రిపోర్టర్ వి. రెడీ అయిపో అని. నిజానికి ఆ కుర్రాడికి జర్నలిజం తెలియదు. ఏమీ తెలియదు. బతుకుతెరవు కోసం చూస్తున్నాడు.
సరే, అలాగే చేరతాను, ఏం చేయాలి? అని అడిగాడట. ఏమీ చేయక్కరలేదు. కంపెనీకి 15 వేలు కట్టాలి. అప్పుడు నీకు లోగో ఇస్తారు. దాన్ని మైకుకు తగిలించకుని తిరగడమే. జీతం మాత్రం వుండదు అన్నారట. మరెలా అంటే? ఊళ్లలో గొడవలు అవుతాయి కదా? లేదా రియల్ ఎస్టేట్, బెల్ట్ షాపులు, ఇలా వ్యవహారాలు వుంటాయి కదా? వాళ్ల మీద స్టోరీలు వేస్తానంటే, వాళ్లే నెల నెలా ఇస్తారు. ఇలా ఏమన్నా దండుకోవమడమే అని పబ్లిక్ గా చెప్పేసారట.
బ్రాందీ షాపుల వాళ్లు, క్వారీల వాళ్లు, రాజకీయ నాయకులు ఇలా నెలనెలా ఎంతొ కొంత నీ శక్తి కొద్దీ సంపాదించుకోవడమే. మాకు మాత్రం ఏవైనా న్యూస్ లు పంపిస్తూ వుండడమే. అందుకు గాను లోగో ఇచ్చినందుకు 15వేలు ఫీజు అన్నారట. దాంతో చేరాలా వద్దా అని కిందా మీదా అయిపోతున్నాడట పాపం, జర్నలిజం లో ఓనామాలు తెలియని కుర్రాడు.
ఇంతకీ జీతం ఇవ్వకపోవడం వరకు ఓకె. ఈ లోగో ఇవ్వాడానికి 15వేలు వసూలు అన్నది సదరు ఛానెల్ పెద్దలకు తెలుసో? లేక కింద స్థాయి జనాల నిర్వాకమో? ఎందుకంటే ఆ ఛానెల్ వెనుక పెద్ద తలకాయలే వున్నాయని టాక్. అందువల్ల మరీ ఇంత దిగజారుడుగా వుంటుందా? వ్యవహారం?