తానేదో అద్భుతకళాఖండం తీసానని భ్రమలో వున్నారు దర్శకుడు ఇంద్రసేన. నిజానికి సినిమా విడుదలకు ముందే హీరో సుధీర్ బాబు సినిమా చూసి, క్వాలిటీ చాలా దారుణంగా వుందని చెప్పి, డబ్బింగ్ కూడా చెప్పనన్నాడని గ్యాసిప్ లు వచ్చేసాయి. అయినా కిందామీదా పడి విడుదల చేసారు.
సినిమా విడుదలకు ముందు సదరు దర్శకుడు ఓపెన్ గా చాలా అద్భుతాలు మాట్లాడేసాడు వేదిక మీదే. దర్శకుడు సుకుమార్ తో తానే ఆయనకు పోటీ వస్తానని చెప్పేసాడు. సరే, కుర్రాడు ఏదో అత్యుత్సాహం అని సరిపెట్టుకున్నారు. సినిమా విడుదల అయిన తరువాత కూడా సుకుమార్ పాజిటివ్ గా ప్రశంసిస్తూ మెసేజ్ పెట్టారని కూడా తెలుస్తోంది.
కానీ సినిమా బయటకు వచ్చింది. సినిమా దారుణంగా వుండడం సంగతి అలా వుంచితే, హీరోలు ముగ్గురు, హీరోయిన్ కూడా యాక్టింగ్ మరిచిపోయినట్లు నటించారని కామెంట్ లు వచ్చాయి. మిగిలన యాక్టర్లు అయితే మరీనూ. కేవలం డైరక్టర్ వాళ్ల దగ్గర నుంచి సరైన నటన తీసుకోలేకపోయాడని వినిపించింది. ఇక సినిమా సంగతి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
ఈలోగా తన ఇష్టానికి సమీక్షలను తిడుతూ స్లోగన్ లు పెట్టి, రెండు డిజైన్లు కూడా చేయించి వదలేసాడు దర్శకుడు. ట్విట్టర్ లో సినిమా సమీక్షకుల మీద తన చిత్తానికి కామెంట్లు చేసాడు. అదిచూసి ప్రతి స్పందించిన వారిపై కూడా విరుచుకుపడ్డాడు.
ఇదంతా చాలా డ్యామేజ్ చేస్తోందని అర్థం అయింది హీరో శ్రీవిష్ణుకు. అతగాడి కామెంట్లతో తమకు సంబంధం లేదని ఓ ట్వీటు వేసి జాగ్రత్తపడ్డారు. కళాఖండాలు తీయడం, ఆడకపోతే సమీక్షకుల మీద పడడం ఈ మధ్య చాలామంది యంగ్ డైరక్టర్లకు అలవాటైపోయింది.
ఆ తరువాత నిర్మాతో, హీరోనో ఓ క్లాసు పీకితే సైలంట్ కావడం. కానీ ఇలా కళాఖండాలు తీసి, సమీక్షకుల మీదపడిన వారికి మళ్లీ మరో సినిమా రావడం అన్నది అరుదు. ఎందుకంటే వాళ్ల అసలు సత్తా, ఇండస్ట్రీ జనాలకు ఎలాగూ తెలుస్తుంది. అవకాశం ఇవ్వడానికి జంకుతారు. ఈ ఫ్రస్టేషన్ అంతా ఇలా ట్విట్టర్లో జనాల మీదకు వస్తుంది. అంతే.
జూనియర్ ఎన్ఠీఆర్ స్పెషల్ ఈ వారం గ్రేట్ ఆంధ్ర పేపర్ కోసం క్లిక్ చేయండి