బిగ్ బాస్ అనగానేమి? దాని వైనమేమి? అనేలాంటి చచ్చుపుచ్చు అనుమానాలు ఇప్పుడు తెలుగునాట ఎవరికీ లేవు. ఇంటింటికీ అంతలా పరిచయం అయిపోయింది బిగ్ బాస్ షో. ఎన్టీఆర్ హోస్టింగ్ టాలెంట్ తో ఆ షోను ఓ రేంజ్ కు తీసుకెళ్లాడు. 70రోజుల పాటు సాగిన ఈ షో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఎంత మందినో సెలబ్రిటీలుగా మార్చేసింది.
బిగ్ బాస్ సెకెండ్ సీజన్ జూన్ నుంచి ప్రారంభించడానికి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయింది. తొలి సీజన్ ను ఎలా వుంటుందో అని పది వారాలకు కుదించారు. కానీ ఈసెకెండ్ సీజన్ ను 14వారాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి బిగ్ బాస్ షో పధ్నాలుగు వారాలే. తొలిసారి మాత్రం అలా పది వారాలు చేసారు.
మళ్లీ ఎన్టీఆరే
బిగ్ బాస్ సెకెండ్ సీజన్ కు కూడా ఎన్టీఆర్ హోస్ట్. అప్పట్లో జైలవకుశ సినిమా షూటింగ్, బిగ్ బాస్ షో రెండూ సమాంతరంగా ఎలా మేనేజ్ చేసాడో, ఈసారి త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా, బిగ్ బాస్ షో అలా మేనేజ్ చేయబోతున్నాడు. మార్చిలో మొదలయ్యే త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా ఏకబిగిన షూట్ జరుపుకుని, జూన్ నాటికి దాదాపు ఒక కొలిక్కి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. కొద్దిగా వర్క్ వున్నా ఎన్టీఆర్ రెండింటినీ కలిపి మేనేజ్ చేస్తారు.
హెవీ డిమాండ్
తొలి బిగ్ బాస్ షో పట్ల చాలా మంది పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ ఈసారి మాత్రం సినిమా జనాలు, జర్నలిస్టులు తెగ ఉబలాటపడిపోతున్నారు. మమ్మల్ని తీసుకోండి.. మమల్ని తీసుకోండి అని సీనియర్ జర్నలిస్ట్ లు కొందరు నిర్వాహకుల వెంట పడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ షో ద్వారా సెలబ్రిటీలు అయిపోవచ్చు అన్నది ఒకటి, మంచి పారితోషికం రావడం మరొకటి. అందుకే సరైన చాన్స్ లు లేని సినిమా జనాలు, ఏదో అలా కాలక్షేపం చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ లు కొందరు ఈ షో లో జాయిన్ కావడానికి తెగ ట్రయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే ఈసారి బిగ్ బాస్ షో సెట్ ను హైదరాబాద్ లోనే వేయించడానికి మా టీవీ మేనేజ్ మెంట్ ప్రయత్నిస్తోంది. స్టార్ యాజమాన్యం నుంచి అనుమతి వస్తే, బిగ్ బాస్ షో ఇక్కడే షూటింగ్ కూడా జరుపుకుంటుంది.