దాదాపు గత నాలుగైదేళ్లుగా ఆర్జీవీ తన అభిమానులను, తన సినిమాల ప్రమోషన్ ను నమ్మి వచ్చిన ప్రేక్షకులను నిలువునా నీరసానికి గురిచేస్తూనే వున్నాడు. దాదాపు డేట్ లు ఇచ్చిన చిన్న, పెద్ద ప్రతి హీరోనీ నిరాశకే గురిచేసాడు. నమ్మిన నిర్మాతలు అందరినీ నష్టాలపాలు చేసాడు. అది మంచు ఫ్యామిలీ కావచ్చు, దాసరి కిరణ్ కుమార్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఆఫీసర్ లాంటి మరిచిపోలేని డిజాస్టర్ ను నాగార్జునకు కానుకగా ఇచ్చాడు.
ఇంతటి ట్రాక్ రికార్డ్ మూటకట్టకున్న ఆర్జీవీ ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అందిస్తున్నారు. తొలి ట్రయిలర్ వచ్చిన తరువాత సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగాయి. బజ్ వచ్చింది. సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ రెండో ట్రయిలర్ వచ్చిన తరువాత, సినిమా సెన్సారు అయిన తరువాత మాత్రం ఇండస్ట్రీలో రకరకాల గుసగుసలు వినిపించడం ప్రారంభమైంది.
ఇది మళ్లీ మరో ఆర్జీవీ సినిమా తప్ప మరేంకాదు అన్న టాక్ ఇండస్ట్రీలో, బిజినెస్ సర్కిళ్లలో బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాను ఉత్తరాంధ్రకు ఏకంగా ఎనభై లక్షలకు నట్టి కుమార్ కొన్నారు. ఆయన గతంలో ఆర్జీవీతో సినిమా తీసినవారే. అలాగే నైజాంకు పాత బకాయిల కింద రెండుకోట్ల పైచిలుకు మొత్తానికి నిర్మాత అభిషేక్ నామాకు దఖలు పడింది. ఆయన కూడా గతంలో ఆర్జీవీతో సినిమా తీసి నష్టపోయిన వారే. ఇక సీడెడ్ ను లక్ష్మీస్ ఎన్టీఆర్ కు అడ్వాన్స్ ఇచ్చి, బ్యాక్ స్టెప్ వేసిన నిర్మాత, బయ్యర్ సురేష్ రెడ్డికి ఇచ్చారు.
ఇలా మోత్తంమీద ఎనిమిది కోట్ల వరకు నైజాం, ఆంధ్ర, సీడెడ్ ల్లో వసూలు చేయాల్సి వుంది లక్ష్మీస్ ఎన్టీఆర్. మరి ఏం చేస్తుందన్నది చూడాలి. ఎందుకంటే పోలిటికల్ సినిమాలు అయితే సూపర్ హిట్ లేకుంటే డిజాస్టర్ తప్ప మధ్యలో వుండడం అన్నది అరుదు. లక్ష్మీస్ ఎన్టీఆర్ హిట్ అయితేనే బయ్యర్లు సేఫ్ అవుతారు.
సినిమా మార్నింగ్ షో పడిన తరువాత వచ్చిన టాక్ మీదే బయ్యర్ల భవిష్యత్ ఆధారపడి వుంటుంది. ప్రస్తుతానికి ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుసగుసలు చూస్తే కాస్త అనుమానంగా వుంది. కానీ రాజకీయాలు, ఎన్నికలతో ముడిపడిన అంశం కాబట్టి, ఈ గుసగుసలను కూడా నమ్మడానికి లేదు.
కానీ ఏమైనా సెన్సారు తరువాత ఈ సినిమా మీద కాస్త బయ్యర్లలో అనుమానం బయలుదేరిందన్నది వాస్తవం. కానీ ఎన్నికల నేపథ్యంలో మంచి ఓపెనింగ్స్ వుంటాయని, ఈ రేట్లు కిట్టుబాటు అవుతాయని ధీమాగానే వున్నారన్నది కూడా అంతే వాస్తవం.