వరుసగా మూడు నాలుగు వారాల నుంచి టాలీవుడ్ లో రిలీజ్ లే రిలీజ్ లు. తీసిన సినిమాను వదిలించేసుకుందాం, థియేటర్లోకి పంపేస్తే చాలు, ఆడినా ఆడకున్నా అనేతీరు కనిపిస్తోంది. డిసెంబర్ దాటితే మరి డేట్ దొరకదు. నవంబర్ వదిలేస్తే, మరో ఆరునెలల వరకు సినిమాను బీరువాలో పెట్టి దాచుకోవాలి తప్ప, మరెందుకు పనికిరాదు అనే విధమైన ఆలోచన కనిపిస్తోంది. కానీ మార్కెట్ లో సినిమాలకు కలెక్షన్లు చూస్తుంటే బాధగా వుంటోంది.
వందలు, వేలల్లో కలెక్షన్లు వుంటున్నాయి. కొన్ని సినిమాలకు థియేటర్ కు రోజుకు వందల్లో కలెక్షన్ వుంటే, మరి కొన్ని సినిమాలకు రోజుకు పదివేల లోపు కలెక్షన్లు వస్తున్నాయి. దీంతో థియేటర్ కు డబ్బులు ఇచ్చి సినిమాను ఆడించుకుంటున్నట్లు వుంది పరిస్థితి. ఎందుకు తీస్తున్నారో? ఎందుకు విడుదల చేస్తున్నారో అర్థం కావడంలేదు. సినిమా నిర్మాణం వేరు. ఆపైన విడుదల ఖర్చులు వేరు. క్యూబ్ చార్జెస్, థియేటర్ రెంట్లు, పబ్లిసిటీ ఇవన్నీ కలిసి మరింత ఖర్చు జోడిస్తున్నాయి.
చిన్న సినిమాల్లో కాస్త పెద్ద సినిమా అనుకునేవాటికి కూడా కలెక్షన్లు అంతంత మాత్రంగా వుంటున్నాయి. అయితే ఇలాంటి సినిమాలు శాటిలైట్ మీద నమ్మకంతో ముందుకు పోతున్నాయి. మంచి సినిమా అనిపించుకుని, ఏదో విధంగా కాస్త మంచి సమీక్షలు రప్పించుకుంటే, సోషల్ నెట్ వర్క్ లో కాస్త హడావుడి చేస్తే, మూడుకోట్లు శాటిలైట్ వచ్చేస్తుంది. సినిమాకు రెండుకోట్లు ఖర్చు పోగా కోటి మిగుల్తుంది. థియేటర్ల నుంచి డబ్బులు రాకపోయినా ఓకె. ఇదీ ఆలోచన.
ఇలాంటి స్ట్రాటజీ అన్ని సినిమాలకు సెట్ కాదు. వంద సినిమాల్లో ఒక్క దానికి సెట్ అవుతుంది. మిగిలిన 99 సినిమాలు చిత్తయిపోవడమే. ఈ నెలాఖరులో కూడా మూడు సినిమాలు పోటీ పడుతున్నాయి. గోపీచంద్ ఆక్సిజన్, సాయిధరమ్ జవాన్, విజయ్ ఆంటోనీ ఇంద్రసేన సినిమాలు పోటీ పడుతున్నాయి. వీటిలో రెండింటి విజయాలు ఆయా సినిమాలకు చాలాకీలకం. గోపీచంద్ కు ఆక్సిజన్, సాయిధరమ్ కు జవాన్. మరి ఆ సినిమాలు ఏమవుతాయో? జనం ఏం చేస్తారో చూడాలి.