సాధారణంగా రామ్ చరణ్ తో సినిమా చేయాలంటే మెగాస్టార్ చిరంజీవి దగ్గర స్క్రిప్ట్ పాస్ కావాలి. అలాగే సినిమా ఫైనల్ కాపీ దగ్గర మెగా స్టాంప్ పడాలి. అది రివాజు. ఎంత పెద్ద డైరక్టర్ అయినా సరే. మెగాస్టార్ కన్నా పెద్ద కాదు కదా? కానీ రాజమౌళి వ్యవహారం వేరు. ఆయన ఏమనుకుంటారో ఆయనకే తెలియాలి. ఆయనే చేయాలి.ఆయన అనుకున్నదే చేయాలి.
లేటెస్ట్ గా రాజమౌళి ఓ సినిమాను మెగాస్టార్ తనయుడితో తలపెట్టారు. అయితే సోలో హీరో సినిమా కాదు. ఎన్టీఆర్ కూడా వున్నాడు రామ్ చరణ్ తో. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో రాజమౌళి చాలా గుంభనంగా వున్నట్లు తెలుస్తోంది. కేవలం జోనర్, లైన్ మాత్రమే చిరంజీవికి రాజమౌళి చెప్పారు తప్ప, వేరేమీ వివరించలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా ఏ డైరక్టర్ అయినా రామ్ చరణ్ తో సినిమా చేస్తే, ఫైనల్ స్క్రిప్ట్ చెప్పడం, మార్పులు చేర్పులు చేయడం వంటివి వుంటాయి. కానీ ఇక్కడ అస్సలు అలాంటి వ్యవహారాలే లేవని వినికిడి. ఎన్టీఆర్ పాత్ర ఏమేరకు, రామ్ చరణ్ పాత్ర ఏమేరకు అన్నీ రాజమౌళి నిర్ణయం మేరకే. ఆయనకు వ్యవహారాలు అన్నీ తెలుసు కాబట్టి, ఇక మరేం కలుగచేసుకోలేక, మెగాస్టార్ మౌనం వహించారని టాక్ వినిపిస్తోంది.