ఎన్ని రోజులు ఇలాగే కన్వీన్స్ చేస్తావు పూరీ..!

తన సినిమాల్లో వైవిధ్యం ఉండదని మరోసారి నిరూపించుకున్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. 'లోఫర్' తో అది మరోసారి రుజువైంది. అయితే ఎటొచ్చీ ఒక ఇంటెలిజెంట్ స్క్రిప్ట్ తో పూరీ పని కానిచ్చేస్తున్నాడు! 'హార్ట్ ఎటాక్'…

తన సినిమాల్లో వైవిధ్యం ఉండదని మరోసారి నిరూపించుకున్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. 'లోఫర్' తో అది మరోసారి రుజువైంది. అయితే ఎటొచ్చీ ఒక ఇంటెలిజెంట్ స్క్రిప్ట్ తో పూరీ పని కానిచ్చేస్తున్నాడు! 'హార్ట్ ఎటాక్' , 'లోఫర్' లు ఇందుకు సరైన ఉదాహరణలు. అప్పుడే పూరీ సినిమాలను చూస్తున్న వారికి ఇవి బాగానే అనిపిస్తాయి కానీ… వరసగా ఈ దర్శకుడి సినిమాలన్నింటినీ చూస్తున్న పూరీ అభిమానులు, సినిమాల అభిమానులను మాత్రం ఈ సినిమాలు తీవ్రంగా నిరాశ పరుస్తున్నాయి. 

అయితేనేం… 'హార్ట్ ఎటాక్' వంటి సినిమా ఐదారు కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెట్టింది. ఇక 'లోఫర్' కూడా మంచి ఓపెనింగ్సే వచ్చాయి కాబట్టి.. మెగా ఫ్యామిలీ హీరో కాబట్టి.. లాభాలకు లోటేమీ లేకపోవచ్చు. అయితే ఎన్ని రోజులిలా…? అనేది అర్థం కాని విషయం. రెండు వారాల్లో ఒక స్క్రిప్ట్ ను రాసేస్తాను అని ప్రకటించిన పూరీ.. ఇలాంటి స్కిప్ట్ లలో ఒకదానికీ మరోదానికీ పోలికలు ఎక్కువవుతున్నాయి. ఆఖరికి 'లోఫర్' సినిమాలో తను బద్రిలో రాసుకున్న సీన్లను రిపీట్ చేశాడు. ఆ సినిమాలో పవన్ – రేణూదేశాయ్  ల మధ్య ఉండే రొమాంట్ సీన్..(పైకేమో గొడవపడుతున్నట్టుగా కనిపిస్తూ.. తల్లిదండ్రులు బయట ఉండగా.. రూమ్ లో హీరోహీరోయిన్లు రొమాన్స్ చేసే సీన్) ను లోఫర్ లో రిపీట్ చేశాడు పూరీ.

హీరోలను తన స్క్రిప్ట్ లతో కన్వీన్స్ చేయడం వల్లనే తను ఇండస్ట్రీలో మనుగడ సాగించగలుగుతున్నానని పూరీ కూడా పైకే చెప్పేస్తున్నాడు. హీరోలను కన్వీన్స్ చేస్తే పూరీ ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయేమో కానీ, వరసగా ఇలాగే ప్రేక్షకులను కన్వీన్స్ చేయాలని చూస్తే మాత్రం… తిరస్కరణలు తప్పకపోవచ్చు. జాగ్రత్త పూరీ!