సినిమా రంగంలో కనీసం పదిమంది స్టార్స్ మత్తుమందుల బారిన పడ్డారని నిర్మాత, పంపిణీ దారుడు అల్లు అరవింద్ చెప్పడం కలకలం రేపుతోంది. మత్తు మందు బారినపడిన ఆ పదిమంది, వాటిని వీడి, మామూలు ప్రపంచంలోకి రావాలని ఆయన పిలుపు నిచ్చారు. ఇటీవల హైదరాబాద్ లో డ్రగ్స్ కలకల రేగిన సంగతి తెలిసిందే. ఓ నిర్మాతకు కూడా ప్రమేయం వుందని వార్తలు వినవచ్చాయి. కానీ ఆ తరువాత ఏమయిందీ తెలియలేదు. ఆ నిర్మాత పేరును గోప్యంగా వుంచారు.
ఇలాంటి నేపథ్యంలో సినిమా ప్రముఖులు అల్లు అరవింద్, సురేష్ బాబు తదితరులు సడెన్ గా ప్రెస్ మీట్ పెట్టిమరీ ఇలా పిలుపునివ్వడం అంటే తెరవెనుక ఏదో జరిగిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తొలివార్నింగ్ గా పోలీసులు సినిమా జనాలను హెచ్చరించి వుంటారని, ఎవరు మత్తుమందు బానిసలు అన్నది వాళ్లకు క్లియర్ గా తెలిసి వుంటుందని టాక్ వినిపిస్తోంది.
టాలీవుడ్ పరువుపోకుండా, అనవసరంగా రచ్చకాకుండా ముందుగా అరవింద్, సురేష్ తదితరులు ఈ ప్రకటన చేసి వుంటారని భావిస్తున్నారు. దీంతో సదరు హీరోలు జాగ్రత్తపడితే ఫరవాలేదు. అయినా ఇంకా అలాగే ముందుకు వెళ్తే, కష్టాలు కొని తెచ్చుకుంటారు. రేవ్ పార్టీలు, మత్తు మందులు అంటూ అరవింద్ వివరంగా మాట్లాడారు అంటే, ఆయనకు పోలీసులు ఫుల్ గా ఫీడ్ బ్యాక్ ఇచ్చే వుంటారని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.