ఎవరికీ పట్టని ఎన్టీఆర్ బయోపిక్?

ఎన్టీఆర్ బయోపిక్ మీద అప్పుడప్పుడు ఏదో వార్త కనిపిస్తుంటుంది. అది కూడా ఆ సినిమాలో వీళ్లు వుండొచ్చు. వాళ్లు వుండొచ్చు. అంతేకానీ, అసలు సినిమా వర్క్ అది ప్రీ ప్రొడక్షన్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్…

ఎన్టీఆర్ బయోపిక్ మీద అప్పుడప్పుడు ఏదో వార్త కనిపిస్తుంటుంది. అది కూడా ఆ సినిమాలో వీళ్లు వుండొచ్చు. వాళ్లు వుండొచ్చు. అంతేకానీ, అసలు సినిమా వర్క్ అది ప్రీ ప్రొడక్షన్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ కానీ ఏ స్థాయిలో వుందన్నదానిమీద క్లారిటీ మాత్రంలేదు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుసగుసలు వేరుగా వున్నాయి. ఈ ప్రాజెక్టు మీద అందరికన్నా ఎక్కవగా ఆసక్తిగా వున్నది నిర్మాతల్లో ఒకరైన విష్ణుకు మాత్రమే అని తెలుస్తోంది.

మరో నిర్మాత సాయి కొర్రపాటి ప్రస్తుతం ఆయన చేస్తున్న మెగా అల్లుడు కళ్యాణ్ సినిమాతో బిజీగా వున్నారు. ఎన్టీఆర్ సినిమాకు కాస్త భారీగానే పెట్టుబడి పెట్టాలి. రిటర్న్ ఎలా వుంటుందో అప్పుడే తెలియదు. పైగా ఆయన మనమంతా, యుద్ధం శరణం సినిమాలతో ఆర్థికంగా దెబ్బతిని వున్నారు. ఇక మరో నిర్మాత బాలయ్య బాబు. ఆయన వంతు పెట్టుబడి ఆయన రెమ్యూనిరేషన్ నే అని వినికిడి.

ఇంకోపక్క డైరక్టర్ తేజ తను లేటెస్ట్ సినిమా పనుల్లో బిజీగా వున్నారు. మార్చి 12న వెంకీ సినిమా స్టార్ట్ చేస్తున్నారు. రెండు నుంచి మూడు నెలలు ఆ పనుల మీద ఫుల్ బిజీగా వుంటారు. పైగా టీజర్ ఎప్పుడైతే బాలయ్యకు నచ్చలేదో? పక్కన పెట్టి స్టిల్ వదిలారో? తేజ కూడా అంత ఆత్రంగా లేరని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదంతా ఇలావుంటే బాలయ్యతో సన్నిహితంగా వుండే, తెలుగుదేశం పార్టీని ఇష్టపడే వారు చాలామంది అసలు బయోపిక్ అవసరమా? అనే అభిప్రాయంతో వున్నట్లు తెలుస్తోంది. అయితే బాలయ్య ముందు నోరువిప్పి చెప్పలేరు. ఆయన తీస్తానంటే ఎస్ అనడం, లేదు అంటే సరే అనడం తప్ప మరోటి వుండదు.

అందుకే వాళ్లు కూడా ఎలాగైనా బాలయ్యను బయోపిక్ కన్నా ముందు మరో మామూలు సినిమాకు ఒప్పించాలని ప్రయత్నిస్తున్నట్లు బోగట్టా. మరో మామూలు సినిమా మీద బాలయ్య దృష్టి మళ్లితే, బయోపిక్ మరో ఆరునెలలు వెనక్కు వెళ్తుంది. ఈలోగా ఎన్నికల వాతావరణం వస్తే, సినిమా ఆగుతుంది అన్నది వారి ఆలోచనగా వుంది.

అయితే ఇవన్నీ ఎలావున్నా ఉగాదికి బయోపిక్ కు కొబ్బరికాయ మాత్రం లాంఛనంగా కొడతారని వినిపిస్తోంది. ఆ లాంఛనానికి ముందు, తరువాత కూడా కొన్నాళ్ల పాటు బయోపిక్ వ్యవహారం అబేయన్స్ లోనే వుంటుందని వినికిడి.