నోటా సినిమా విడుదల మరో మూడురోజుల్లో వుంది. తమిళనాట సెన్సారు అయిపోయింది. యు సర్టిఫికెట్ వచ్చింది. ఆ విషయం అప్పుడే విజయ్ ట్వీట్ చేస్తూ, తెలుగు సెన్సారు జనాలు ఏం చేస్తారో అన్న అనుమానం వ్యక్తంచేసారు. ఈరోజు అంటే మండేనాడు తెలుగు సెన్సారు బోర్డు ముందుకు నోటా వచ్చింది. విజయ్ భయపడినంతా అయింది. బోలెడు డైలాగులు మ్యూట్ చేయాలని, సీన్లు లేపాలని సెన్సారు జనాలు కోరినట్లు తెలుస్తోంది.
దీంతో హీరో విజయ్ దేవరకొండ రంగప్రవేశం చేసారని తెలుస్తోంది. విజయ్ దాదాపు రెండుగంటల సేపు సెన్సారు అధికారులతో సినిమా వ్యవహారాలు, కథ, సన్నివేశాలు వీటన్నింటి గురించి డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఎంతయినా కొన్ని డైలాగుల విషయంలో సెన్సారు అధికారులు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమాలో మాదిరిగా ఓ గట్టి తిట్టు ఈ సినిమాలో వుందని తెలుస్తోంది. అది తీసేయాలని సెన్సారు అధికారులు కోరినట్లు తెలుస్తోంది.
అసలే సినిమా మీద ఎన్నికల నేపథ్యంలో ఫిర్యాదులు వున్నాయని, ఇప్పుడు తీరాచేసి సర్టిఫికెట్ ఇస్తే, లేనిపోని ఆందోళనలు జరిగితే తాము ఇరుకున పడతామని సెన్సారు అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఆఖరికి కొన్నిసీన్లు తీయడానికి, కొన్నిచోట్ల డైలాగులు మ్యూట్ చేయడానికి అంగీకారం కుదిరి యు/ఎ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఇవన్నీ చేసి, రేపు సినిమా మళ్లీ సబ్ మిట్ చేస్తే, అప్పుడు సర్టిఫికెట్ ఇస్తారు.