ఈ రెండో తేదీన ఛలో, టచ్ చేసి చూడు లాంటి సినిమాలొస్తున్నాయి. అయితే వీటికంటే ఫిబ్రవరి 9న రాబోతున్న 3సినిమాలపైనే అందరి దృష్టి ఎక్కువగా ఉంది. మూడు సినిమాలు.. ముగ్గురు యంగ్ హీరోలు.. ఒకే రిలీజ్ డేట్.. గెలుపెవరిది? అనే కాన్సెప్ట్ తో ఆడియన్స్ ఇప్పటికే డిస్కషన్లు షురూ చేశారు.
ఫిబ్రవరి 9న సాయిధరమ్ తేజ్ నటించిన ఇంటిలిజెంట్, వరుణ్ తేజ్ తొలిప్రేమ, నిఖిల్ చేస్తున్న కిర్రాక్ పార్టీ సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. నిజం చెప్పాలంటే వీటిలో ప్రతి మూవీపై అంచనాలు సమానంగా ఉన్నాయి. ఒక సినిమాపై తక్కువ అంచనాలు, మరో సినిమాపై ఎక్కువ అంచనాలు లాంటి కాన్సెప్ట్ లేదు.
ఫిదాతో బ్లాక్ బస్టర్ కొట్టిన వరుణ్ తేజ్ ఈసారి తొలిప్రేమ సినిమాతో వస్తున్నాడు. ఫిదా ఎఫెక్ట్ తో తొలిప్రేమకు ఓపెనింగ్స్ కు బాగా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ మూవీలో కంటెంట్ లేకపోతే ఫిదా ప్రభావం అస్సలు పనిచేయదు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్.
ఇక ఫిబ్రవరి 9న వస్తున్న మరో హీరో సాయిధరమ్ తేజ్. వరుస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఈ హీరో ఈసారి సీనియర్ డైరక్టర్ వినాయక్ పై గంపెడాశలు పెట్టుకున్నాడు. వినాయక్ కచ్చితంగా తనకు హిట్ ఇస్తాడని నమ్ముతున్నాడు. ఖైదీ నంబర్ 150లాంటి మెగా మూవీ తర్వాత వినాయక్ చేస్తున్న ప్రాజెక్టు కావడంతో ఇంటిలిజెంట్ పై కూడా ఓ మోస్తరు అంచనాలు పెరిగాయి. దీనికి కూడా తమనే సంగీతం అందించాడు.
ఇక బరిలో నిలిచిన మూడో సినిమా కిర్రాక్ పార్టీ. ఈ సినిమాపై అందరి దృష్టి పడ్డానికి ముఖ్యంగా 2కారణాలున్నాయి. వాటిలో ఒకటి నిఖిల్ సినిమాలు సంథింగ్ స్పెషల్ గా ఉంటాయనే రిమార్క్. ఇక రెండోది ఈ సినిమాకు ఏకంగా ముగ్గురు దర్శకులు పనిచేయడం. శరణ్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతుంటే, మరో దర్శకుడు సుధీర్ వర్మ, స్క్రీన్ ప్లే సమకూర్చాడు. ఇంకో దర్శకుడు చందు మొండేటి డైలాగ్స్ అందించాడు. మరీ ముఖ్యంగా ఇది రీమేక్ ప్రాజెక్టు కావడంతో హిట్ గ్యారెంటీ అనే బజ్ నడుస్తోంది.
ఇలా అంచనాల్ని కూడా సమానంగా పంచుకొని వస్తున్న ఈ మూడు సినిమాల్లో ఏది క్లిక్ అవుతుందనే బెట్టింగ్ టాలీవుడ్ లో జోరుగా సాగుతోంది. అన్నట్టు ఈ 3 సినిమాలతో పాటు సీనియర్ మోస్ట్ మోహన్ బాబు నటించిన గాయత్రి కూడా అదే రోజు థియేటర్లలోకి వస్తోంది. యంగ్ హీరోల్లో ఎవరు గెలుస్తారనే చర్చతో పాటు, సీనియర్ మోహన్ బాబు మేజిక్ చేస్తాడేమో అనే అంచనాలు కూడా ఉన్నాయి.