సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది. అర్జున్ రెడ్డి మేనియా నడిచిన టైమ్ లోనే దర్శకుడు ఈ విషయాన్ని స్పష్టంచేశాడు. మహేష్ తనను వ్యక్తిగతంగా అభినందించాడని, అదే రోజున తమ మధ్య చిన్నపాటి స్టోరీ డిస్కషన్ కూడా జరిగిందని ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
మొన్నటివరకు మహేష్ కు చెప్పిన స్టోరీలైన్ ను డెవలప్ చేసే పనిలో బిజీగా ఉన్న సందీప్, ఇప్పుడా ప్రాజెక్టును కొన్నాళ్లు పక్కనపెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీనికి కారణం అర్జున్ రెడ్డి హిందీ రీమేక్. అవును.. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ ను డైరక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది సందీప్ కి. ఈ అవకాశం వచ్చిన వెంటనే నమ్రతాతో సంప్రదింపులు జరిపాడు. మహేష్ తో సినిమాకు చాలా టైమ్ పడుతుంది కాబట్టి నమ్రత కూడా ఓకే అనేసింది.
ఫిబ్రవరి నుంచి అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ సెట్స్ పైకి రానుంది. ఈ ప్రాజెక్టు సందీప్ కు పెద్ద కష్టం కాబోదు. ఎందుకంటే ఇప్పటికే డీల్ చేసిన సబ్జెక్ట్ కావడం, హిందీ వెర్షన్ కు సంబంధించి పెద్దగా మార్పుచేర్పులు లేకపోవడంతో సందీప్ కు పని ఈజీ అయిపోతుంది. ఇది కంప్లీట్ అయిన వెంటనే తిరిగి మహేష్ మూవీ ప్రాజెక్టును కంటిన్యూ చేస్తానని తెలిపాడు సందీప్.
మహేష్ సినిమాకు సంబంధించి దాదాపు 70శాతం స్క్రీన్ ప్లే పూర్తిచేశాడు సందీప్. కాకపోతే మహేష్ కు ఇంకా వినిపించలేదు. అర్జున్ రెడ్డి టైపులోనే ఇది కూడా విభిన్నమైన హీరో క్యారెక్టరైజేషన్ తో నడిచే సినిమా అని తెలుస్తోంది.