మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు..మరో మంత్రి నారాయణ అల్లుడు సినిమా రంగంలోకి ప్రవేశిస్తాడని ఎప్పటి నుంచో వార్తలు వున్నాయి. ఈ కుర్రాడి సినిమాకు దర్శకుడిగా మారుతిని అనుకున్నారు. దానికి మారుతి కూడా సై అనక తప్పలేదు. అరవింద్, చిరంజీవి ఫ్యామిలీతో గంటాకు వున్న అనుబంధం, అదే కుటుంబంతో మారుతికి వున్న బంధం ఈ ప్రాజెక్ట్ ను సెట్ చేసాయి.
భలే భలే మగాడివోయ్ తరువాత దర్శకుడు మారుతి ఫుల్ బిజీ అయిపోయారు. వెంకటేష్ తో బాబు బంగారం చేస్తున్నారు. యువి..రామ్ చరణ్ కాంబినేషన్ ఓ సినిమా చేయాల్సి వుంది. దాని తరువాత బన్నీతో చేయాలన్న కోరిక మారుతికి వుంది. ఇదిలా వుంటే కథకుడిగా,నిర్మాతగా రాజ్ తరుణ్ తో ఓ సినిమా వుంది. దిల్ రాజు పార్టనర్ గా మరో సినిమా వుంది. ఇలా అన్ని విధాలా మారుతి బిజీ బిజీ అయిపోయారు.
మరోపక్క గంటా కుమారుడికి పెళ్లయిపోయింది. సినిమాల మీద ఆసక్తి కూడా కాస్త తగ్గిందని వినికిడి. అంతకు ముందు కాస్త ఫిజిక్ తగ్గించుకోవాలని జిమ్ విపరీతంగా చేసారు. ఇప్పుడు దృష్టి సినిమాలో నటనపై కాకుండా సినిమా నిర్మాణంపై పెట్టారని తెలుస్తోంది.
ఇప్పటికే గంటా కుటుంబసభ్యులకు వెస్ట్ గోదావరిలో సినిమా పంపిణీ వ్యాపారం వుంది. సో..ఇక సినిమా నిర్మాణం వైపు అడుగు పెట్టాలని గంటా కొడుకు భావిస్తున్నట్లు .అయితే ఈ సినిమాకు డైరక్షన్ మాత్రం మారుతినే వుండోచ్చని తెలుస్తోంది. అక్కడ మాత్రం లింక్ తెగలేదు.