జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ తన పార్టీ పెట్టిన కొత్తలో చాలా కబుర్లు చెప్పేవారు. జంపింగ్ జపాంగ్ లకు, సాదా సీదా రాజకీయ నాయకులకు తన పార్టీలో చోటులేదని, అంతా కొత్త వాళ్లు, యువకులు, సచ్ఛీలురు ఇలాంటి వాళ్లకే చాన్స్ అని చెప్పేవారు. రాను రాను మిగిలిన పార్టీలోని జనాలకు జనసేన ఆశ్రయం ఇవ్వడం ప్రారంభించింది. అక్కడితో ఆగలేదు టికెట్ లు కూడా ఇవ్వడం ప్రారంభించింది.
ఇలాంటి నేపథ్యలో ప్రజారాజ్యం, వైకాపాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న తోట చంద్రశేఖర్ కు గుంటూరు టికెట్ ను ప్రకటించేసారు పవన్ కళ్యాణ్. అయితే అలా ప్రకటించడానికి ఒకటి రెండురోజుల ముందు విశాఖలో మంచి నీతివాక్యాలు చెప్పారు. 'మంత్రి గంటా శ్రీనివాసరావు అంటే నాకు ఇష్టమే. కానీ ఆయనకు జనసేనలో చోటివ్వలేను. ఎందుకంటే ఆయన చాలా పార్టీలు మారారు' దాదాపుగా ఇలా అర్థం వచ్చేలా పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
ఇప్పుడు తోట చంద్రశేఖర్ వైనం చూద్దాం. ఆయన ప్రజారాజ్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తరువాత వైకాపాలోకి వెళ్లారు. ఇప్పుడు జనసేన. మరి ఈయన గొప్పతనం ఏమిటి? గంటా సంగతి ఏమిటి? గంటా తెలుగుదేశంలో పుట్టి ప్రజారాజ్యంలోకి వచ్చారు. మరి చిరంజీవి ఎందుకు తీసుకున్నారు. రావద్దని చెప్పవచ్చుగా?
పోనీ ప్రజారాజ్యంలోంచి కాంగ్రెస్ లోకి ఎవరు తీసుకెళ్లారు చిరంజీవినే కదా? ఆ తరువాత గంటా తన స్వంత పార్టీలోకి వెళ్లారు కానీ వైకాపాలోకి కాదు కదా? ఈ లెక్కన పవన్ కు తోట చంద్రశేఖర్ కన్నా, గంటా శ్రీనివాసరావు ఏ విధంగా తక్కువ పవన్ కళ్యాణ్ దృష్టిలో? తోట కూడా గంటా మాదిరిగా పార్టీలు మారారు, నియోజకవర్గాలు మారారు.
గంటా కూడా బేషరతుగా పార్టీలోకి వచ్చేసి, పవన్ కోసం కోట్లు పెట్టుబడి పెడితే ఓకే అనేసేవారేమో? కానీ గంటా ఇప్పుడు పూర్తిగా రాజకీయ పరిణితి, ఆయనకు అంటూ ఒక అనుచరవర్గం కలిగి వున్నారు. అందువల్ల పవన్ ను ఆయన పెద్దగా లెక్క చేయకపోవచ్చు.
పైగా పవన్ ఆఖరికి తాను వున్న తెలుగుదేశం పార్టీకే మద్దతుగా నిలుస్తారని గంటా ధీమా కావచ్చు. లేదా గంటాను తాను జనసేనలోకి లాక్కుంటే చంద్రబాబు ఫీలవుతారని పవన్ భావన కావచ్చు. ఇవన్నీ దాచిపెట్టి, ఈ నిజాయతీ కబుర్లు ఎందుకో?