గోటికి పోయేది గొడ్డలి దాకా.. రాజ్ తరుణ్

మనం ఎక్కడి నుంచి వచ్చాం అన్నది మాత్రమేకాదు, ఎక్కడికి వచ్చాం అన్నది కూడా అత్యంత కీలకం. రాజ్ తరుణ్ ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చి, ఎటువంటి బ్యాకప్ లేకుండా ఈ స్టేజ్ కు…

మనం ఎక్కడి నుంచి వచ్చాం అన్నది మాత్రమేకాదు, ఎక్కడికి వచ్చాం అన్నది కూడా అత్యంత కీలకం. రాజ్ తరుణ్ ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చి, ఎటువంటి బ్యాకప్ లేకుండా ఈ స్టేజ్ కు రావడం అన్నది మెచ్చుకోదగ్గ విషయమే. కానీ టాలీవుడ్ లో సరైన డిసిప్లిన్ అన్నది కూడా కీలకం. రాజ్ తరుణ్ దగ్గర నిజానికి అలాంటి సమస్యలు ఏమీలేవు కానీ, మద్యం సేవించడం విషయంలో అతనిపై పలు గుసగుసలు వున్నాయి.

మద్యం సేవించడంలో రాజ్ తరుణ్ కు అదుపు తక్కువ అని గుసగుసలు వున్నాయి. ఇది కూడా ఈ రోజుల్లో చాలా కామన్ విషయం. అయితే ఓ సెలబ్రిటీగా రాజ్ తరుణ్ జాగ్రత్తగా వుండాల్సిన అవసరం వుంది. నాలుగు గోడల మధ్య ఎలా వున్నా, ఎవ్వరూ అడగరు. అలాకాకుండా, ఎక్కువ మద్యం సేవించి, బయటకు వస్తే, అక్కరలేని తలకాయనొప్పులు వస్తాయి.

లేటెస్ట్ గా రాజ్ తరుణ్ చేసిన కారు యాక్సిడెంట్ వ్యవహారం ఇలాంటిదే. నిజానికి ఆ ప్రమాదంలో ఎవ్వరూ గాయపడలేదు. దానికి రాజ్ తరుణ్ తప్పు ఒప్పుకుని వుంటే మహా అయితే వేలతో పోయేది. పోలీసుల ముందు మద్యం సేవించానని అంగీకరించినా కూడా వేల ఫైన్ తో సరిపోయేది.

ఎవరో వీడియో తీసుకున్నా కూడా రాజ్ తరుణ్ ఊరుకుంటే పోయేది. మహా అయితే అది యూట్యూబ్ లోకి వచ్చి వుండేది. కొంతమంది చూసి వుండేవారు. అంతకన్నా పోయేది ఏమీకాదు. పోలీసులు కూడా అది చూసి, కేసు నమోదు చేసి వుండేవారు. ఫైన్ పడి వుండేది. అంతేతప్ప జైలు వరకు వెళ్లే అవకాశాలు తక్కువ.

కానీ అలా చేయకుండా లక్షలు అంటూ బేరం పెట్టడం, ఫోన్ లో హడావుడి చేయడం అవసరమా? రాజ్ తరుణ్ కావచ్చు, ఆయన మనుషులు కావచ్చు. ఇదంతా చేయడం అవసరమా? ప్రమాదం చేసిన తరువాత లీగల్ ప్రాసెస్ కే వెళ్లి వుంటే వేలతో సరిపోయేది. అలాకాకుండా ట్విట్టర్ లోకి వచ్చి, అనవసరపు చర్చలు సాగించడం, వీడియోలు వదిలి సందేశం ఇవ్వడం లాంటివి చేసి, ఇప్పుడు అసలు వీడియోలు బయటకు వచ్చి, నానా కంపు అయింది.

అసలు వీడియోలు వున్నాయని తెలిసినపుడు, తెరవెనుక వ్యవహారాలు సాగాయి అని తెలిసినపుడు ఇంతవరకు చేయడం అవసరమా? ఎవరో వ్యక్తి వీడియో తీసారని తెలిసిన తరువాత నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి, కారు ఓవర్ స్పీడ్ కారణంగా ప్రమాదం జరిగిందని నేరాంగీకారం చేసి వుంటే గోటితో పోయేది. ఇప్పుడు అనవసరంగా గొడ్డలి వరకు తెచ్చుకున్నాడు.

జగన్నాటకంలో మంత్రులకు సీన్‌ సితారే?