హీరో నాగార్జున అస్సలు మొహమాట పడడు. కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడేస్తాడు. పివిపి నిర్మిస్తున్న రాజుగారిగది 2 సినిమా ట్రయిలర్ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ ఇలాగే ఓ మాట చెప్పాడు. విఎఫ్ఎక్స్ వర్క్ లు పూర్తయితే తప్ప తాను డబ్బింగ్ చెప్పను అని కండిషన్ పెట్టినట్లు వెల్లడించాడు. దానికి కారణం కూడా నాగ్ నే చెప్పాడు.
ఈ విఎఫ్ఎక్స్ జనాలు ఇవ్వాళ, రేపు అంటూ వుంటారని, ఎప్పుడిస్తారో తెలియదని, తీరా హడావుడి పెడితే, ఏదో ఒకటి చేసి ఇస్తారని, దాంతో గ్రాఫిక్స్ నాసి రకంగా వున్నాయని మీడియాలో వార్తలు వస్తాయని, అందుకే అన్ని విధాలా విఎఫ్ఎక్స్ పనులు పూర్తయితే, అవి తాను చూసి, నచ్చితనే, డబ్బింగ్ చెబుతా అని కండిషన్ పెట్టా అని నాగార్జున వివరించాడు.
ఇదిలా వుంటే, ఈ సినిమాలోని 24క్రాఫ్ట్స్ వెనుక నాగ్ వున్నారని, ఆయన ఇన్ పుట్స్ వున్నాయని నిర్మాత పివిపి అంతకు ముందు చెప్పారు. బహుశా అది దృష్టిలో పెట్టుకునే కావచ్చు, నాగార్జున, సినిమా క్రెడిట్ అంతా దర్శకుడు ఓంకార్ దేనని, తనది కాదని బాల్ అవతలి కోర్టులోకి తోసేసాడు.