టాలీవుడ్ లోని ఓ ప్రముఖ నిర్మాత 7కోట్ల రూపాయలు జీఎస్టీ పన్నులను చెల్లించకుండా ఎగవేశారని, ఈ చెల్లింపుల వ్యవహారాలన్నింటినీ పరిశీలిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వ అదికారులు.. బుధవారం నాడు నిర్మాత కార్యాలయాల మీద దాడులు నిర్వహించారని.. వచ్చిన వార్తలు తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనాలు సృష్టించాయి. ఈ నిర్మాత మొత్తం 7కోట్ల రూపాయలు జీఎస్టీ పన్నులను కేంద్రానికి ఎగవేసిన నేపథ్యంలో దాడులు జరిగినట్లుగా ఒక దినపత్రిక సవివరమైన కథనం ప్రచురించింది.
సినీ పరిశ్రమలో కలకలం రేగుతున్నట్లుగా కూడా ప్రచురించారు. అధికారులు దాడులుచేసిన నేపథ్యంలో సదరు నిర్మాత అప్పటికప్పుడు రెండుకోట్ల రూపాయలను వారికి చెల్లించారని, మిగిలిన 5కోట్లు చెల్లించడానికి వారంరోజుల గడువు అడిగారని కూడా వార్తలో పేర్కొన్నారు. ఆలోగా చెల్లించకపోతే.. నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్లతో ప్రొసీడ్ అవుతామని వారు హెచ్చరించినట్లు కూడా వార్తలో ప్రచురించారు.
అయితే ఈ దాడుల వ్యవహారం అంతా ఉత్తుత్తి ప్రచారమే అని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన జులై తర్వాత.. నిర్మాత తీసిన చిత్రాలకు సంబంధించి వివిధ విభాగాలకు చెల్లింపుల్లో మినహాయించుకున్న జీఎస్టీని.. జమచేయలేదనేది వార్తాకథనంలోని సారాంశం. అయితే ఆరాతీస్తే.. ఈ ప్రచారం మొత్తం నిర్మాత దిల్ రాజు కు సంబంధించి అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏడుకోట్ల రూపాయల జీఎస్టీ ఎగవేతను గుర్తించగా.. బుధవారం నాటికి 2 కోట్లకు చెక్ ఇచ్చారని, మరో వారం గడువు అడిగారని తెలుస్తోంది.
దిల్ రాజుకు సంబంధించినంతవరకు ఎగవేసినట్లుగా గుర్తించిన ఏడు కోట్ల రూపాయలను చెల్లించేయడంతో వ్యవహారం ముగిసిపోదని కూడా పలువురు అంటున్నారు. నిబంధనల ప్రకారం జీఎస్టీ ఎగవేయడం అంటూ జరిగితే ఎగవేసిన మొత్తానికి అంతే మొత్తం పెనాల్టీగా విధిస్తారని.. ముందు దీనిని చెల్లించేసిన తర్వాత.. షోకాజు నోటీసు పంపి… ఆ తర్వాత.. మళ్లీ పెనాల్టీ విధిస్తారని నిపుణులు చెబుతున్నారు. అంటే దిల్ రాజుకు అదనంగా మరో ఏడుకోట్ల భారం కూడా పడబోతున్నదని పలువురు అనుకుంటున్నారు.
అయితే అసలు దాడులు అనేవే జరగలేదని.. అసలు ఇలాంటి దుష్ప్రచారం ఎక్కడినుంచి ఎలా పుట్టిందో కూడా అర్థంకావడం లేదని.. పరిశ్రమకు చెందిన కొందరు అంటున్నారు. చెల్లింపుల సమయంలో మినహాయించే జీఎస్టీ ఆటోమేటిగ్గా జీఎస్టీ ఖాతాకు వెళ్లిపోతుందని.. దానిని జమచేయకుండా ప్రత్యేకంగా కాజేసే వెసులుబాటు కూడా ఉండదని చెబుతున్నారు.
మొత్తానికి జీఎస్టీ ఎగవేతలకు సంబంధించి టాలీవుడ్ మీద మరక పడింది. ఇక భారీ చిత్రాలు , భారీ హిట్ లు వచ్చిన ప్రతిసారీ.. జీఎస్టీ అధికారులు మనల్ని ఓ కంట కనిపెడుతూ ఉంటారని తెలుసుకోవాలి.