యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అనేది ఒకటి స్టార్ట్ చేసారు. అంతకు ముందు ప్రొడ్యూసర్స్ గిల్డ్ అనేది ఒకటి స్టార్ట్ చేసారు. దాంట్లో కోట్లకు కోట్లు కిందా మీదా అయ్యాయన్న గుసగుసలు వున్నాయి. ఆ తరువాత ఇది స్టార్ట్ అయింది.
ఆరంభంలో బాగానే వుంది. కానీ రాను రాను గిల్డ్ పెద్దల నిర్ణయాలు, వాస్తవంలో జరుగుతున్నది చూసి పలువురు సభ్యులు అసంతృప్తిగా వున్నారట. ఈ మేరకు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇంతకీ ఈ అసంతృప్తి ఎందుకుంటే గిల్డ్ సరైన దిశలో వెళ్లడం లేదని. నిర్మాతలకు లాభం జరగాలి అంటే నిర్మాణ ఖర్చు తగ్గాలి. అందులో కీలకమైనది హీరోల రెమ్యూనిరేషన్లు. గిల్డ్ దాని మీద దృష్టిపెట్టడం లేదు.
ఎంత సేపూ పబ్లిసిటీ ఖర్చు, హోర్డింగ్ లు ఇదే డిస్కషన్. ఇదంతా ఒకటికి పది సార్లు లెక్క వేసినా రెండు మూడు కోట్లు కాదని, అదే హీరోలు, పెద్ద యాక్టర్ల దగ్గర పక్కాగా రెమ్యూనిరేషన్ కట్ అమలు చేయగలిగితే పెద్ద మొత్తంలో ఆదా అవుతుందని కొందరు నిర్మాతలు అంటున్నారు.
పైగా దిల్ రాజునే పవన్ కళ్యాణ్ కు యాభై కోట్లు, వెంకటేష్ పది, పన్నెండు కోట్లు, వరుణ్ కు ఎనిమిది కోట్లు ఇస్తున్నారన్న గ్యాసిప్ లు వెలువడడం చూసి, గిల్డ్ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
నటీనటుల సంఘంతో సంప్రదింపులు జరపడం, హీరోలతో చర్చలు జరపడం కాకుండా కేవలం చిన్న చిన్న ఖర్చులు తగ్గించే వాటిపై రోజులకు రోజులు అనవసరపు చర్చలు జరుపుతున్నారని ఓ నిర్మాత అన్నారు.
కేవలం పబ్లిసిటీ తగ్గించి డబ్బులు ఆదా చేయాలన్నదే గిల్డ్ ఆలోచనగా కనిపిస్తోంది తప్ప, మరే విధంగానూ నిర్మాతకు కలిసి వచ్చేలా లేదని ఓ సభ్యుడు అనడం విశేషం.