మోడీ హయాంలో భారతదేశానికి సంబంధించి ఏవి గరిష్ట స్థాయికి చేరాయి? అంటే.. పెట్రో ధరలు అని చెప్పవచ్చు. వరసగా రెండోసారి భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారాన్ని సంపాదించుకున్నాకా.. పెట్రోల్ ధరలను పరుగులు పెట్టిస్తోంది మోడీ ప్రభుత్వం. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు నేల చూపులు చూసినా.. ఇండియాలో మాత్రం పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇంత వరకూ ఇండియాలో నమోదు కాని రీతిలో లీటర్ పెట్రోల్ ధర రూ.90 చేరింది!
బహుశా ఇదే ఊపులో కొనసాగితే మరో నెల రోజుల్లో వంద రూపాయలను చేరేలా ఉంది ఈ ధర! అయితే తమ విధానాలు అన్నింటికీ ప్రజల ఆమోదం ఉందంటున్నారు నరేంద్రమోడీ. వరసగా అన్ని ఎన్నికల్లోనూ సానుకూల ఫలితాలు వస్తున్న విషయాన్ని మోడీ పరోక్షంగా ప్రస్తావించారు. తాము మార్చుకోవాల్సిన విధానాలు ఏవీ లేవని, అన్నింటికీ ప్రజామోదం ఉందని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. ధరల పెరుగుదల ఆందోళనలను కూడా మోడీ లెక్క చేసేలా లేరని అలా స్పష్టం అయ్యింది.
ఆ సంగతలా ఉంటే.. పెట్రోల్ ధరల పెరుగుదలను తీవ్రంగా ఆక్షేపించారు భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్య స్వామి. హిందుత్వ విధానాలను గట్టిగా సమర్థించే సుబ్రమణ్యస్వామి పెట్రోల్ ధరల పెరుగుదలను తప్పు పట్టారు. లీటర్ పెట్రోల్ ను ప్రస్తుత గణాంకాల ప్రకారం 40 రూపాయలకు ఇవ్వవచ్చని సుబ్రమణ్యస్వామి లెక్కగట్టారు!
ప్రాసెస్ చేశాకా లీటర్ పెట్రోల్ 30 రూపాయలు అవుతుందని, మరో పది రూపాయల మొత్తాలను ట్యాక్సులుగా వసూలు చేసినా.. 40 రూపాయలకు లీటర్ పెట్రోల్ అమ్మవచ్చని స్వామి ట్వీట్ చేశారు.
ఎక్కడ 40 రూపాయలు? మరెక్కడ 90 రూపాయలు? 40 రూపాయలకు లీటర్ అమ్మొచ్చని బీజేపీ ఎంపీనే చెబుతున్నారు. కానీ ఇప్పుడు దానికి రెట్టింపు ధరకు మించి అమ్ముతూ కూడా ఇంకా పెట్రో ధరలను పై పై కి తీసుకెళ్తోంది మోడీ ప్రభుత్వం.
అదేమంటే తమ విధానాలకు ప్రజల ఆమోదం ఉందని అంటున్నారు. ఆ విధానాలను సొంత పార్టీ ఎంపీనే ఇలా జనాలకు అర్థం అయ్యేలా చెబుతూ ఉన్నారు. ఏం చేసినా.. భారతీయులకు బూచిగా చూపించడానికి బీజేపీకి అనేక ఆయుధాలు ఉన్నాయి కాబట్టి.. ఇలాంటి ట్వీట్లను, ఆందోళనలను మోడీ ప్రభుత్వం అస్సలు ఖాతరు చేయకపోవచ్చు!