జనాలకు నచ్చుతాయనుకున్న హామీలన్నీ గుదిగుచ్చి పేజీలకు పేజీలు నింపేయగానే సరికాదు. గతంలో మేనిఫెస్టోలు అన్నవి అవసరార్థం మాత్రమే కానీ ఇప్పుడలా కాదు. అవే కీలకం అయిపోయాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రలో అధికారంలోకి వచ్చిన పార్టీలు ఇచ్చిన హామీలు ఇన్నీ అన్నీ కావు.
అధికారంలోకి వచ్చిన రెండో రోజు నుంచే వాటి సంగతి తేల్చండి అంటున్నాయి ప్రతిపక్షాలు. కానీ ఇక్కడే ఓ గమ్మత్తు వుంది. ఆంధ్రలో వైకాపా నాయకులు ఇలా అడుగుతుంటే, మీకు ఏం తెలుసు? ప్రపంచానికే పాఠాలు చెప్పాను నేను..టైమ్ ఇవ్వరా అంటూ రకరకాల మాటలతో చంద్రబాబు విరుచుకు పడుతున్నారు.
కానీ చిత్రంగా తెలగాణలో యర్రబిల్లి లాంటి తెలుగుదేశం నాయకులు ఇదే విషయమై అక్కడి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మేనిఫెస్టో అమలు చేయకుంటే కెసిఆర్ ప్రభుత్వాన్ని వదిలేది లేదని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు. కొద్ది రోజులు ఆగితే కెసిఆర్ నిజస్వరూపం, మోసాలు జనానికి అర్థం అవుతుందంటున్నారు. మరి ఇవే మాటలు వైకాపా జనాలు ఆంధ్రలో అంటే చంద్రబాబు ఏమంటారో?