దువ్వాడ జగన్నాధమ్ సినిమా విడుదలయిపోయింది. పది రోజులు దాటేసింది. దాని వ్యవహారం చాలా వరకు ముగిసిపోయింది. కానీ దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం నిత్యం ఏదో విధంగా దాన్ని రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే ఇప్పుడు హీరో బన్నీ సోదరుడు అల్లు శిరీష్ కు చికాకు కలిగిస్తోందని వినికిడి.
‘ఎందుకు ఈయన ఇలా రచ్చ చేస్తున్నాడు’ అని తన జనాల దగ్గర కామెంట్ చేసినట్లు బోగట్టా. చూసీ చూడనట్లు వదిలేయాలి తప్ప, ఎందుకు ఇలా గోకి గోకి కెలుక్కోవడం అని పదే పదే శిరీష్ చికాకు పడుతున్నట్లు తెలుస్తోంది.
హరీష్ చేస్తున్న అతి వల్ల అందరూ తన అన్నను టార్గెట్ చేస్తున్నారని శిరీష్ ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.
ఫేక్ కలెక్షన్లు అన్నంత మాత్రాన దిల్ రాజు ఖాతాకు రావాల్సిన డబ్బులు రాకుండా పోవు, అలాగే ఎక్కువ కలెక్షన్లు వున్నాయన్నా, అక్కౌంట్ ప్రకారం రావాల్సినవే వస్తాయి. ఇక ఆ మాత్రం దానికి ఎందుకు ఊ చికాకు పడిపోవడం, నానా యాగీ చేయడం అని శిరీష్ అంటున్నట్లు తెలుస్తోంది.
కానీ శిరీష్ ఈ విషయంలో అన్నకు ఏమైనా ఓ మాట చెప్పగలడేమో కానీ, హరీష్ శంకర్ కు కాదు కదా? మరోపక్క డిజె సినిమా విషయంలో హరీష్ తరచు సోషల్ మీడియాలో చేస్తున్న హల్ చల్ గీతా ఆర్ట్స్ జనాలకు కూడా నచ్చడం లేదని వినికిడి. వారు కూడా ఈ విషయం బన్నీ,అరవింద్ దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది.