హవ్వ.. వర్మనా? ఎన్టీఆర్ బయోపిక్ కు?

ఇదిగో ఇదే నా ఆఖరి సినిమా, వెళ్లిపోతున్నా అంటూ వంగవీటి టైమ్ లో నానా హడావుడి చేసాడు రామ్ గోపాల్ వర్మ. హమ్మయ్య, వెళ్లిపోతున్నాడేమో? అనుకుంటూ చాలా మంది ఆ ఫేర్ వెల్ ఫంక్షన్…

ఇదిగో ఇదే నా ఆఖరి సినిమా, వెళ్లిపోతున్నా అంటూ వంగవీటి టైమ్ లో నానా హడావుడి చేసాడు రామ్ గోపాల్ వర్మ. హమ్మయ్య, వెళ్లిపోతున్నాడేమో? అనుకుంటూ చాలా మంది ఆ ఫేర్ వెల్ ఫంక్షన్ కు వచ్చేసారు. బాలీవుడ్ కు వెళ్లి సర్కార్ సీక్వెల్ అంటూ ఓ పరమ డిజాస్టర్ తీసి జనాల ముందు పెట్టాడు. వర్మ భుజకీర్తుల్లా పక్కన వుండేవారికి తప్ప, మరెవరికి నచ్చిన పాపాన పోలేదు ఆ సినిమా.

ఆ తరువాత మళ్లీ టాలీవుడ్ మీద దృష్టి పెట్టాడు. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితమే వెల్లడించాం. వర్మ మళ్లీ టాలీవుడ్ మీద దృష్టి పెడుతున్నాడని. అన్నంతా అయ్యింది. ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నా అంటూ ఓ బాంబు పేల్చాడు. బాలయ్య హీరో. ఈ విషయాన్ని కొద్ది రోజుల్లో మరో ప్రకటనలో వెల్లడిస్తారు. నిర్మాత ఇంకా ఖరారు కాలేదు. 

అవేనా అర్హతలు

ఎన్టీఆర్ బయోపిక్ తీయడానికి వర్మ తన అర్హతలు అంటూ భలే గొప్ప విషయాలు చెప్పారు. 23 సార్లు అడవి రాముడు కష్టపడి చూడడం, మహానాడు ఫస్ట్ మీటింగ్ లో లక్షలాది మందిలో ఆయనా ఒకడిగా నిల్చోవడం, ఇవీ క్వాలిఫికేషన్లు. నవ్వాలో, మరేమనాలో అర్థం కావడం లేదు.

ఒక బయోపిక్ తీయాలంటే ఎంతటి సామర్థ్యం వుండాలో? వంగవీటి సినిమా విషయంలో వర్మకు వున్న సామర్థ్యం ఏపాటిదో అర్థం అయిపోయింది. అప్పుడు కూడా ఇలాగే చెప్పారు. విజయవాడ రౌడీ, రాజకీయాలు తనకు తెలిసినంతగా ఎవరికీ తెలియవని. కానీ తీసింది వేరు.

పైగా అప్పుడే, ఎన్టీఆర్ బయోపిక్ ప్రకటనతో ఓ సాంగ్ వినిపించేసారు. వర్మతీసిన సవాలక్ష సినిమాల్లో విన్న స్టయిల్ పాటే. ఆ పాట వింటే అది ఎన్టీఆర్ బయోపిక్ కోసం చేసినట్లు లేదు, రక్త చరిత్ర లాంటి ఫ్యాక్షనిస్టు సినిమా కోసం రాసినట్లు వుంది.

జనాలకు అర్థం కానిది ఒకటే. వర్మ సంగతి తెలిసీ, వర్మ సినిమాల సంగతి తెలిసీ, ఆ సినిమాల్లో తెల్ల మొహం వేసిన విషయాల సంగతి తెలిసీ, ఎన్టీఆర్ బయోపిక్ లో, అదీ వర్మ డైరక్షన్ లో నటించడానికి బాలయ్య ఎలా ఓకె అంటున్నారో అన్నది, ఎన్టీఆర్ అభిమానులకు కొరుకుడు పడడం లేదు.

అంతటి మహానుభావుడి బయోపిక్ ను టచ్ చేయకపోవడమే అన్ని విధాలా మంచిది. లేదూ అంతగా చేయాలని వుంటే, మంచి దర్శకుడు, మంచి స్క్రిప్ట్ వంటి వ్యవహారాలు చూసుకోవాలి. అంతే కానీ, ఇలాంటి 'డబ..డబ' మనే పబ్లిసిటీ స్టంట్ లాంటి వ్యవహారాలు కాదు.