టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరో అతడు. వరుసగా ఫ్లాప్స్ వస్తున్నా ప్రామిసింగ్ హీరో అనిపించుకుంటున్నాడు. మంచి కథ దొరికితే హిట్ కొడతాడనే గ్యారంటీ ఉంది. అలా ఓ మంచి స్థానంలో ఉన్న సదరు కుర్ర హీరోకు, ఇప్పుడు డబ్బు పిచ్చి పట్టుకుందని అంటున్నారు కొంతమంది.
తన దగ్గరకు ఏ నిర్మాత వచ్చినా కాదనడం లేదు ఈ హీరో. అడ్వాన్స్ ఇస్తే తీసుకుంటానంటున్నాడు. కథలు ఏమైనా వినిపిస్తే వింటానని కూడా చెబుతున్నాడు. ఈ విషయంలో కొత్త దర్శకుడైనా ఓకే. ఎటొచ్చి కాల్షీట్లు అడిగితే మాత్రం ససేమిరా అంటున్నాడు.
అడ్వాన్స్ గా కోటి రూపాయలు తీసుకొని కాల్షీట్లు ఇవ్వకుండా తిప్పిస్తున్న ఈ హీరో ప్రవర్తన చూసి ఓ ఎన్నారై విసుగెత్తిపోయాడు. అడ్వాన్స్ వెనక్కి అడిగితే సినిమా చేద్దాం అంటాడు. కాల్షీట్లు అడిగితే కథ బాగాలేదంటాడు. కథ ఓకే అయితే, ఆ దర్శకుడితో కష్టం అంటాడు. ఇలా సాగుతోంది ఈ హీరో వ్యవహారం.
ఇండస్ట్రీలో దాదాపు ప్రతి హీరో దగ్గర అడ్వాన్సులుంటాయి. ఈ విషయంలో చిన్న హీరో, పెద్ద హీరో అనే తేడా లేదు. అలా తీసుకున్న అడ్వాన్స్ వెనక్కి ఇవ్వడానికి హీరోలెవ్వరూ ఇష్టపడరు. ఈ విషయంలో కూడా చిన్న-పెద్ద తేడా లేదు. అయితే ఇలా తిప్పించుకోవడం మాత్రం చాలా తక్కువ. అక్కడే ఈ మిడ్-రేంజ్ హీరో విమర్శల పాలవుతున్నాడు. ముందు అడ్వాన్స్ తీసుకుందాం, తర్వాత సినిమా సంగతి ఆలోచిద్దాం అనే ఈ మైండ్ సెట్ కరెక్ట్ కాదేమో.