భలే మంచి చౌకబేరమ్ సినిమాకు మళ్లీ మరో ట్రయిలర్ కట్ చేసి వదిలారు. ట్రయిలర్ చివర్న హీరో పార్వతీశం చేత ముందస్తు జాగ్రత్తగా అన్నట్లు ఓ డైలాగు పడేసారు. 'హీరో హీరోయిన్ వుండడానికి ఇదేమన్నా సినిమా కథా.. నువ్వూ.. నీ నాన్ సింకూ..' అంటూ. అంటే సినిమా చూసిన తరువాత ఎవరూ ఏమీ అనకుండా ముందే జాగ్రత్త పడిపోయారేమో సినిమాకు కాన్సెప్ట్ ఇచ్చిన డైరక్టర్ మారుతి. నవీద్, కీర్తన, యామిని భాస్కర్, పార్వతీశం మెయిన్ రోల్స్ లో కనిపిస్తున్నారు ఇప్పుడు వదిలిన లేటెస్ట్ ట్రయిలర్ లో.
పైగా ఒక్క పక్క దేశ రహస్యాలు, పాకిస్తాన్ అంటూనే మరోపక్క రాజు భయ్యా, సురేష్ భయ్యా. అరవింద్ భయ్యా అంటూ దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్ లను చూపిస్తూ, సినిమా మొత్తం సీరియస్ వ్యవహారం కాదని, చౌకబేరమ్ కామెడీ అని ముందే చెప్పేసారు.
కేవలం మూడు క్యారెక్టర్లతో సినిమాను, మారుతి తన ఆస్థాన టీమ్ అయిన ఉద్దవ్, బాల్ రెడ్డి అండ్ కోతో కానిచ్చారు. మొదటి ట్రయిలర్ తరువాత ఇప్పుడు రెండో ట్రయిలర్ వదిలారు. పార్వతీశం, రాజా రవీంద్ర లాంటివాళ్లు ఏ మేరకు టికెట్ లు తెగొట్టగలరు అన్నది మేకర్లకే తెలియాలి. నోటా, దేవదాస్, అరవింద సమేత లాంటి సింహాల మధ్యకు ఈ బక్క జింక పిల్లను వదలడం అంటే ఏమనుకోవాలి?
లాబ్ లో వున్న సినిమాలు వదిలేసుకోవాలన్న ఆలోచనే కనిపిస్తోంది. నిజానికి ఇలాంటి సినిమాలను కాస్త ఆఫ్ సీజన్ లో ఏ సినిమాలు లేనపుడు వదిల్తే, కాస్త జనం దృష్టిపడే అవకాశం వుంటుంది. ఇలా దిగ్గజాల మధ్య వదిలితే ఏం పడుతుంది ప్రేక్షకుల దృష్టి. మహా అయితే ఆవురావురుమంటూ వున్న చిన్నచిన్న థియేటర్ల ఆకలి తీర్చడానికి పనికి వస్తుందేమో?