ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో సినిమా హీరోయిన్ నీతూ అగర్వాల్‌ని కర్నూలు పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఆమె తాజాగా మీడియాతో మాట్లాడింది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని నితూ అగర్వాల్ స్పష్టం చేసింది. మస్తాన్ వలీ తన భర్త అని అంటోంది నీతూ అగర్వాల్.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో, కేసు విచారణను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే స్మగ్లర్ మస్తాన్ వలీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మస్తాన్ వలీని విచారించిన పోలీసులకు, అతనితో నీతూ అగర్వాల్ సహజీవనం చేస్తోందనే విషయం తెలిసింది. కొన్ని రోజులపాటు గాలించి, నీతూ అగర్వాల్‌నీ పోలీసులు పట్టుకున్నారు.
నీతూ అగర్వాల్ బ్యాంక్ అక్కౌంట్ల ద్వారా ఎర్రచందనం స్మగ్లింగ్‌కి సంబంధించిన ఆర్థిక లావాదేవీల్ని నిర్వహించేవాడు మస్తాన్ వలీ. దాంతో, ఈ కేసులో నీతూ అగర్వాల్ ఇరుక్కుపోయిందనే చెప్పాలి. నీతూ అగర్వాల్ మాత్రం, మస్తాన్ వలీ తన భర్త అనీ, భార్యగా భర్త అడిగిన బ్యాంక్ అక్కౌంట్ మాత్రమే ఇచ్చాననీ, అంతకు మించి అతని గతం గురించీ, అతను చేస్తున్న పనుల గురించి తనకు తెలియదని చెప్పడం గమనార్హం.
ఈ గొడవతో తన సినిమా అవకాశాలకు సంబంధం వుండదనీ, నటిగా తనకు అవకాశాలు ఎప్పటికీ వస్తూనే వుంటాయనే నమ్మకంతో తాను వున్నానని నీతూ అగర్వాల్ చెబుతుండడం గమనార్హం. అన్నట్టు, మస్తాన్ వలీ అండతో సినిమా షూటింగ్‌లో నానా యాగీ చేసేదంటూ నీతూ అగర్వాల్‌తో ‘ప్రేమప్రయాణం’ సినిమాలో నటించిన నటీనటులు చెబుతుండడం కొసమెరుపు.
మొత్తమ్మీద నీతూ అగర్వాల్ చెబుతున్న మాటలు అచ్చం సినిమా స్టోరీని తలపిస్తున్నాయి. స్టోరీ అదుర్స్.. అనకుండా వుండలేకపోతున్నారు చాలామంది ఆమె వాదన మీడియా ముందుంచిన తర్వాత.