శ్రద్ధా కపూర్ రేటు ఎనిమిదికోట్లు.. దిశా పటానీ ఐదుకోట్లు చెబుతోందట.. రీజనల్ సినిమాలో ఆ మాత్రం ఇస్తేనే చేస్తాం… అని వారు స్పష్టం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి బాలీవుడ్ లో మరీ బీభత్సమైన స్థాయిలో ఆఫర్లేమీ లేని వాళ్లు ఈ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నది ఏకంగా ప్రభాస్ సరసన నటించడానికి!
ఇవతల తెలుగు మీడియానేమో.. ప్రభాస్ అంటే ప్రపంచ మంతా క్రేజ్ పెరిగిపోయింది, బహుబలితో ప్రభాస్ ప్రపంచమంతా క్రేజ్ సంపాదించేసుకున్నాడు.. ఇక హీరోయిన్లయితే అతడి సరసన నటిస్తే చాలు తమ జీవితం ధన్యం అయిపోతుందని.. అంటున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్.. అంటూ ప్రభాస్ వెంటపడుతున్నారు.. ఇదంతా బాహుబలి పుణ్యమే సుమా! అని కథనాలు వండి వారుస్తోంది.
కానీ.. బాహుబలి తర్వాత కూడా ప్రభాస్ సినిమాను రీజనల్ సినిమాగానే చూస్తున్నారు బాలీవుడ్ భామామణులు. బాలీవుడ్ లో అయితే శ్రద్దాకు ఎనిమిదికోట్లు ఇచ్చే పరిస్థితి లేదు, ఇక దిశా సంగతి సరేసరి! ఆ మధ్య పూరీజగన్నాథ్ లోఫర్ లో నటించిన అమ్మాయే! ఆ తర్వాత ఆమెకు అవకాశాలు ఇచ్చే నాథుడే లేడాయె. అయినా కూడా ఐదుకోట్లట!
ఇందుమూలంగా అర్థం చేసుకోవాల్సిందేమిటంటే.. బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయి ఏ స్థాయికి పెరిగిందో తెలీదు కానీ, సదరు సినిమాలో హీరోగా నటించిన వ్యక్తి తదుపరి సినిమా విషయంలో కూడా బాలీవుడ్డోల్ల టెక్కులు తగ్గడం లేదు. బాలీవుడ్ హీరోయిన్ అయితే మేలు, ముంబై భామ అయితేనే మేలు.. మనోళ్ల తీరూ మారలేదు!