Advertisement


Home > Movies - Movie Gossip
విజయేంద్ర ఇంటర్వూ పక్కన పెట్టేసారా?

అన్ని ఇంటర్వూలు ఒకలా వుండవు. ఇవతల ఇంటర్వూ చేసిన వాళ్ల స్టామినా బాగుంటే ఒకలా వుంటాయి. అవతలి వాళ్లు కాస్త గట్టి వాళ్లు అయితే మరోలా వుంటాయి.

అయితే ఇటీవల చాలా మంది ఇంటర్వూలు చేస్తున్నారు. అందరికీ ఇంటర్వూలు చేసే స్టామినా వుండొచ్చు, వుండకపోవచ్చు. ఎవరో తెరవెనకాల వుండి ప్రశ్నలు రాసి ఇస్తే, అందమైన వాళ్ల తెరముందు వుండి ప్రశ్నలు అడిగి ఇంటర్వూలు గ్లామరస్ గా తయారుచేస్తూ వుంటారు కూడా. కానీ అవతలి వ్యక్తి ప్రశ్నకు కౌంటర్ వేస్తే ఒక్కోసారి సమాధానం ఇవ్వలేక ఇబ్బంది పడడం జరుగుతుంటుంది.

ఇటీవల ఇలా ఓ ఇంటర్వూ, బాహుబలి 2 కథకుడి కోసం భలేగా జరిగిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాహుబలి 2 కథకుడు విజయేంద్ర ప్రసాద్ తో ఇంటర్వూ చేయడానికి ఓ యూట్యూబ్ చానెల్ తరపున వెళ్లారట.

వున్నట్లుండి, మీ సినిమాలు అన్నింటి మీదా ఫలానా ప్రభావం బాగా వుంటుంది కదా? అని అడిగారట. దానికి ఆయన ఏదో ఒకటి చెప్పేయకుండా, అవునా? అలాగా? ఎలా? ఎందుకు అనుకుంటున్నారు అలా? చెప్పండి? ఆ సినిమాలో వుందా? ఈ సినిమాలో వుందా? అసలు ఏ సినిమాలో వుంది చూపించండి. అంటూ ఫుల్ గా రివర్స్ ఇంటర్వూ చేసేసారని వినికిడి. దీంతో మొత్తం మీద ఆ ఇంటర్వూ ఎలాగోలా ముగించారు. కానీ ప్రసారం చేద్దాం అంటే చాలా వరకు రివర్స్ లో వుంది వ్యవహారం. దాంతో పక్కన పెట్టేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి.