ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్.. ఏదేదో ఊహించుకోకండి!

ఎవరూ ఊహించని విధంగా ప్రెస్ మీట్ ఏర్పాటుచేసింది ఆర్ఆర్ఆర్ యూనిట్. దీంతో మీడియా ప్రతినిధులు పండగ చేసుకుంటున్నారు. ఆరోజు ఎలాగైనా ఫలానా ప్రశ్న అడిగేయాలని కొందరు, ఎలాగైనా యూట్యూబ్ లైవ్ తో అదరగొట్టేయాలని మరికొందరు…

ఎవరూ ఊహించని విధంగా ప్రెస్ మీట్ ఏర్పాటుచేసింది ఆర్ఆర్ఆర్ యూనిట్. దీంతో మీడియా ప్రతినిధులు పండగ చేసుకుంటున్నారు. ఆరోజు ఎలాగైనా ఫలానా ప్రశ్న అడిగేయాలని కొందరు, ఎలాగైనా యూట్యూబ్ లైవ్ తో అదరగొట్టేయాలని మరికొందరు కలలుకంటున్నారు. కానీ ఈ మీడియా ఇంటరాక్షన్ పై ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దని అంటున్నారు సినీజనాలు. ఎందుకంటే ఇది కేవలం ఓ బిస్కెట్ మాత్రమే.

ఆర్.ఆర్.ఆర్ ప్రాజెక్టు లాంఛ్ అయినప్పట్నుంచి ఇప్పటివరకు మీడియాకు ఒక్క ఆహ్వానం లేదు. అన్నిరకాల మీడియాల్ని పూర్తిగా పక్కనపెట్టి తనపని తాను చేసుకుపోతున్నాడు రాజమౌళి. బడ్జెట్, స్టోరీలైన్ లాంటి పెద్ద పెద్ద విషయాల్ని పక్కనపెడితే.. సినిమాకు సంబంధించి వస్తున్న చిన్న చిన్న గాసిప్స్ పై కూడా వివరణ ఇవ్వడం లేదు. ఈ విషయంలో యూనిట్ పై మీడియా చాలా గుర్రుగా ఉంది. అందుకే, వాళ్లను ప్రసన్నం చేసేందుకు మాత్రమే ఈ మీడియా సమావేశం.

మహా అయితే ఆర్.ఆర్.ఆర్ ప్రాజెక్టు షూటింగ్ అప్ డేట్స్ మాత్రం ఈ ప్రెస్ మీట్ లో తెలుస్తాయి. వాటి గురించి కొత్తగా చెప్పేదేంలేదు. అందరికీ తెలిసినవే. ఇంకాస్త ముందుకెళ్తే, హీరోయిన్లపై క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అంతవరకే. అంతకుమించి ఎక్కువగా ఆశిస్తే మీడియాకు ఆశాభంగం తప్పకపోవచ్చు. కేవలం మీడియాను కూల్ చేసేందుకే ఈ ప్రెస్ మీట్.

తన సినిమాలకు సంబంధించి ప్రతి విషయాన్ని పక్కాగా ప్లాన్ చేస్తూ ప్రమోట్ చేయడం రాజమౌళికి అలవాటు. బాహుబలి విషయంలో అదే పనిచేశాడు. అలాంటి దర్శకుడు, మీడియా సమావేశంలోనే రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రల గురించి చెప్పేస్తాడని ఆశించడం భ్రమే అవుతుంది.

సినిమా కథ చెప్పేస్తాడని అనుకోవడం అత్యాశే అవుతుంది. కాబట్టి రేపటి ప్రెస్ మీట్ పై ఎంత తక్కువ అంచనాలు పెట్టుకుంటే అందరికీ అంత మంచిది. 

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!

బాబుది ఎదురుదాడే.. నిజాన్ని ఎదుర్కొనలేరు!