Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్నికల వేళ సినీ పరిశ్రమ ఎటువైపు..?

ఎన్నికల వేళ సినీ పరిశ్రమ ఎటువైపు..?

రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. ఎవరికి వారు ఏదో ఒక పార్టీ గూడుకింద చేరిపోతున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందినవారు కూడా అటూ ఇటూ అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. సినీ జనాలకు ఓ అలవాటుంది. గెలిచినవారి పక్కనే నిలబడతారు, లేదా గెలిచే అవకాశాలున్నవారివైపే ఉంటారు. లేదా ఎవరు గెలిస్తే వారి పక్కన వచ్చి చేరతారు. అయితే ఈసారి ఇండస్ట్రీ జనాల్లో మాత్రం ఓ క్లారిటీ వచ్చేసింది. వైసీపీ విజయం ఖాయమనే భావనకు సినీ జనాలు వచ్చేశారు.

తెలుగుదేశం పార్టీకి సినీరంగమే పునాది. అలాంటి టీడీపీలో ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ ఒక్కటే మిగిలింది. అందులోనూ కుటుంబ సభ్యుల్లో సవాలక్ష విభేదాలున్నాయి. తమ్ముడు(బాలకృష్ణ) టీడీపీలో, అక్క(పురందేశ్వరి) బీజేపీలో, అక్క కొడుకు(దగ్గుబాటి హితేష్) వైసీపీలో.. అన్న కొడుకు(ఎన్టీఆర్) మామ వైసీపీలో.. ఇలా రకరకాల వర్గాలున్నాయి. ఎంపీ గల్లా జయదేవ్ తరపున ఘట్టమనేని ఫ్యామిలీ పరోక్షంగా టీడీపీకే మద్దతు తెలుపుతోంది.

వీరు కాకుంటా టీడీపీలో ఉన్న సినీ జనాలు.. కేవలం అవకాశాల్లేకే పాలిటిక్స్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. అర్థంపర్థం లేకుండా మాట్లాడే శివాజీ, కొత్తగా నోరు చేసుకుంటున్న దివ్యవాణి టీడీపీలో కనిపిస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీకి సొంత పార్టీ జనసేన ఉంది. ఇలా ఒక్కో పెద్ద ఫ్యామిలీకి ఒక్కో పార్టీ అండ ఉంది. తాజాగా అక్కినేని ఫ్యామిలీ జగన్ కు మద్దతు తెలుపుతున్నట్టు స్పష్టమైంది. నాగార్జున-జగన్ భేటీ, ఆ తర్వాత చంద్రబాబు చిందులు.. ఇవన్నీ చూస్తుంటే నాగార్జున బాబుని పూర్తిగా పక్కనపెట్టి జగన్ కి మద్దతు తెలుపుతున్నాడని అర్థమవుతోంది.

ఇక దగ్గుబాటి ఫ్యామిలీ విషయానికొస్తే ఒకప్పుడు టీడీపీలో ఉన్న రామానాయుడు కుటుంబ సభ్యులు ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు. బహిరంగంగా వైసీపీకి జై కొట్టకపోయినా, సురేష్ బాబు నైతిక మద్దతు మాత్రం జగన్ కేనని తెలుస్తోంది. కృష్ణంరాజు బరిలో నిలిస్తే ప్రభాస్ బీజేపీ తరపున ప్రచారం చేసే అవకాశాలున్నాయి. ఇక ఇండస్ట్రీలో మిగతా వాళ్లను చూస్తే.. పోసాని కృష్ణమురళి, పృథ్వీ, కృష్ణుడు.. తాజాగా అలీ అందరూ వైఎస్ఆర్సీపీలోనే. పార్టీ కోసం వీళ్లంతా ప్రచారాన్ని భుజానికెత్తుకున్నారు.

పృథ్వీ సమక్షంలో ఇటీవల చోటామోటా నటీనటులందరూ వైసీపీ కండువాలు కప్పుకున్నారు. ఇక సీనియర్ల విషయానికొస్తే, రోజా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అటు మోహన్ బాబు కూడా వైసీపీకి దాదాపు మద్దతిచ్చినట్టే కనిపిస్తోంది. ఫీజు రీఎంబర్స్ మెంట్ పై ఈమధ్య బాబును కడిగిపారేశారు మోహన్ బాబు. జయసుధ కూడా జగన్ జట్టులోకి వచ్చేశారు.

మొత్తమ్మీద 2014 ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి సినిమా ఇండస్ట్రీ వ్యక్తులు ఎక్కువమంది వైసీపీలో కనిపిస్తున్నారు. రాజకీయ నాయకులకే కాదు, సినీ పరిశ్రమకు కూడా వైసీపీ గెలుపు ఖాయమని తెలిసిపోయిందన్నమాట.

ఓట్లను కొనడంకాదు, మాయమే చేస్తున్నారు!

నన్ను ఏమైనా చేసినా డైరెక్ట్ సినిమా అందులోనే.. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?