దర్శకుడు సుకుమార్ పుట్టింది, పెరిగింది గోదావరి జిల్లాల్లోనే. వెస్ట్ లో పుట్టి పెరిగి, ఈస్ట్ లో ఉద్యోగం చేసి, ఆ తరువాత ఇండస్ట్రీలోకి వచ్చారు. అందుకే ఆయనకు ఆ గోదావరి జిల్లాలు, పల్టెటూళ్లు, ఇతరత్రా వ్యవహారాల మీద ఆసక్తి పోలేదు. ఇవన్నీ రంగరించి హీరో రామ్ చరణ్ తో రంగస్థలం 1985 సినిమా తయారుచేస్తున్నారు. ఈ సినిమా కోసం కొన్నాళ్లు గోదావరి జిల్లాలోనే షూటింగ్ జరిపారు.
కానీ నిరంతరాయంగా షూట్ చేయడం అక్కడ కష్టం అవుతుండడంతో ఇప్పుడు ఓ గోదావరి విలేజ్ నే హైదరాబాద్ కు తెచ్చేసారు. జూబ్లీహిల్స్ లోని ఓ మారుమూల కొండ మీద వున్న బూత్ బంగ్లా దగ్గర ఆర్ట్ డైరక్టర్ సాయంతో ఏకంగా గోదావరి విలేజ్ నే ఏర్పాటు చేసేసారట.
రోడ్లు, ఇళ్లు, పంచాయితీ ఆఫీసు ఇలా ఒకటేమిటి ఊరు ఊరునే సృష్టించేసారు. గోదావరి జిల్లా అంటే కొబ్బరి చెట్లు వుండాలి కదా? అందుకోసం కొబ్బరి చెట్లను కూడా తెచ్చి పాతించేసారట. ఇప్పుడు రంగస్థలం సెట్ కు వెళ్లి చూసిన వారు అబ్బుర పడిపోతున్నారట. అచ్చమైన గోదావరి గ్రామాన్ని చూసినట్లు వుందని అంటున్నారు.
సెట్ నే ఇంతలా అలరిస్తుంటే, సినిమాలో సీజీ వర్క్, డీఐ లాంటి సాంకేతిక సొగబులు అద్దుకుని ఇంకెలా వుంటుందో.