మీడియా పెద్దలను అందరినీ పిలిచి పేరంటం పెట్టారు వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్. తన పాదయాత్రకు సహకరించమని కోరడం తప్ప ఇందులో వేరు పరమార్థం వుంటుందని అనుకోవడానికి లేదు. తెలుగునాట బడా మీడియాలు మహా అయితే నాలుగైదు. ఈనాడు, జ్యోతి, సాక్షి టీవీ 9, ఎన్టీవీ, టీవీ ఫైవ్. మిగిలిన వాటిలో మీడియం రేంజ్ మీడియాలు వున్నాయి, చిన్నా చితకా వున్నాయి.
ఈనాడు రామోజీరావుతో 'రాజుగారు-కొండ' వ్యవహారం. కొండ దగ్గరకు రాజుగారే వెళ్లాలి కానీ, కొండ రాజుగారి దగ్గరకు రాదు. అందువల్ల జగన్ ముందుగానే ఆయన దగ్గరకు వెళ్లి వచ్చారు. ఇక మిగిలిన వాటిలో జ్యోతి తో జగన్ కు బద్ధవైరుధ్యం వుంది. వైకాపా కార్యక్రమాలకు జ్యోతిని దూరం పెట్టారు.
టీవీ 9 రవి ప్రకాష్ ను పిలిచారు. కానీ ఆయన రాలేదు. ఎందుకు వస్తారు? ప్రింట్ లో ఈనాడు గొప్ప అయితే, విజువల్ మీడియాలో టీవీ 9 గొప్ప. అందుకే ఆయన జగన్ దగ్గర వచ్చి వుండరు. ఎన్టీవీ చౌదరితో జగన్ కు సత్సంబంధాలు వున్నాయి. సో నో ప్రొబ్లమ్. మిగిలిన వారంతా ఓకె.
అన్నీ బాగానే వున్నాయి. మరి జ్యోతి రాధాకృష్ణను ఎందుకు దూరం పెట్టడం? జగన్ కు జ్యోతి ఎంత వ్యతిరేకమో, ఈనాడు కూడా అంతే కదా? గడచిన పదేళ్లుగా ఈనాడు జగన్ కు, వైఎస్ కు వ్యతిరేకంగా ఎన్ని వేల వార్తలు వండి వార్చిందో తెలియనిదా? అలాంటి ఈనాడుతోనే రాజీ పడినపుడు, ఇప్పటికి రెండు మూడు సార్లు రామోజీ దగ్గరకు వెళ్లి కలిసినపుడు, రాధాకృష్ణతో సమస్య ఏమిటి?
వెళ్లి కలిసినా రాధాకృష్ణ మారరు, ఆయన తేదేపా అనుకూల వైఖరి అలాగే వుంటుందని జగన్ నిర్థారణకు వచ్చారా? ఆ లెక్కన జగన్ రెండు మూడు సార్లు కలిసినంత మాత్రాన రామోజీ, ఈనాడు పాలసీలో అద్భుతమైన మార్పులను జగన్ ఊహిస్తున్నారా? ఎన్నికల వేళ తెలుస్తుంది జగన్ కు అసలు విషయం. ఇక్కడ ఈనాడుకు చంద్రబాబు ముఖ్యంకాదు. తెలుగుదేశం పార్టీ ముఖ్యం. కొన్ని బంధాలు, ప్రయోజనాలు రామోజీకి వుండి వుండొచ్చు. వాటిని జగన్ ఒకటికి పది సార్లు వెళ్లి కలిసినా మార్చడం అసాధ్యం.
కావాలంటే కాస్త కవరేజీ వస్తుంది. జగన్ కు అది చాలు అనుకోవాలి. మరి అదే విధంగా రాధాకృష్ణ తో కూడా అడ్జస్ట్ కావచ్చు కదా? ఎన్నికల వేళ ఎలా వున్నా, జగన్ అడిగితే, పాదయాత్రకు ఆ మాత్రం లోకల్ కవరేజీ రాధాకృష్ణ కూడా ఇస్తారు కదా? ఆ మాత్రం దానికి ఆయనను దూరం పెట్టడంలో ఔచిత్యం ఏమిటి?
వ్రత భంగం జరిగినపుడు ఒకసారైతేనేం రెండు సార్లు అయితేనేం? రామోజీ కోసం మెట్టుదిగినపుడు, రాధాకృష్ణ కోసం దిగితే తప్పేమిటి?