ఇప్పుడు సినిమా టైటిల్స్ తో వార్ నడుస్తున్నట్లుంది. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కించాలని అనుకున్న తర్వాత.. దానికోసం నానా ప్రయత్నాలు చేసి.. విఫలమై.. చికాకులు పెట్టడమే తన తొలి లక్ష్యం అన్నట్లుగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని రాంగోపాల్ వర్మ ప్రకటించారు. అయితే ఈ సినిమాకు పోటీగానా అన్నట్లుగా ఇప్పుడు మరో సినిమా టైటిల్ బయటక వచ్చింది.
నాగహృషీ ఫిలింస్ పతాకంపై నిర్మించబోతున్నట్లుగా ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ అనే టైటిల్ తో ఓ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల అయింది. ఇది సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది. (ఆదర్శగృహిణి) అనేది దీనికి ట్యాగ్ లైన్. జి. విజయకుమార్ గౌడ్ నిర్మాతగా.. కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లుగా పోస్టర్ తెలిపే వివరాలు ఉన్నాయి.
లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటే లక్ష్మీపార్వతి- ఎన్టీఆర్ ల వైవాహిక జీవితానికి సంబంధించిన చిత్రం అనే సంగతి ఎవరైనా చెబుతారు. కాకపోతే.. ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ అనే టైటిల్ లో ఉండే మతలబు నవతరం కుర్రాళ్లలో కొందరికి అర్థం కాకపోవచ్చు. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకోవడానికి ముందు, పూర్వాశ్రమంలో ఆమె తొలి భర్త పేరు వీరగంధం వెంకటసుబ్బారావు. ఆయన హరికథకుడిగా ప్రముఖుడు. ఆయనకు విడాకులు ఇచ్చి లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ ను వివాహం చేసుకుంది. తర్వాతి సంగతులు అందరికీ తెలుసు.
అయితే.. లక్ష్మీపార్వతి గురించి.. ఈ చాలామందికి తెలియని జీవితాన్ని తెలియజెప్పడానికే ఈ ‘వీరగ్రంథం’ చిత్రం రూపొందిస్తున్నారా? అనేది చర్చ. మొత్తానికి పాతకథ గుర్తుకు వచ్చేలా ఆమె పాత భర్త ఇంటిపేరుకు ‘ర’ వత్తు మాత్రం జత చేసి.. వీరగంథం కాస్తా.. వీరగ్రంథంగా మార్చి.. బాగానే ఆసక్తి క్రియేట్ చేశారనే చర్చలు సాగుతున్నాయి.
విజయకుమార్ గౌడ్ నిర్మాతే, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దర్శకుడే గానీ.. వాస్తవంలో ఇది పట్టాలెక్కే సినిమానేనా? అనే సందేహాలు కొందరిలో ఉన్నాయి. ఆ మాటకొస్తే అసలు వర్మ సినిమా మాత్రం పట్టాలెక్కుతుందా? అక్కడ కూడా పోస్టర్ తప్ప మరేంలేదుగా..? అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వర్మలాగే.. ఓ పోస్టర్ సృష్టించి.. ‘ర’ ఒత్తును కలిపి.. ఇంట్రెస్టింగ్ టైటిల్ చేశారు. అయితే ‘ఆదర్శ గృహిణి’ అనే ట్యాగ్ లైన్ గురించి కూడా చాలా చర్చలు నడుస్తున్నాయి.