బెల్లంకొండ సురేష్ తెలివిగా, వున్నది ఒకటే జిందగీ విడుదల ముందు మడతపేచీ ప్లాన్ చేసి, తన పాత బాకీ కోటి రూపాయలు వసూలు చేసుకున్నాడని గ్యాసిప్ గుప్పుమంది. ఈ గ్యాసిప్ పక్కా గ్యాసిప్ బెల్లంకొండ వర్గీయులు అంటున్నారు. ప్రస్తుతం వెస్ట్, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో ఫ్యామిలీతో గుళ్లు గోపురాలు సందర్శిస్తున్న బెల్లంకొండ సురేష్ ఈ వార్త ను ఖండిస్తున్నట్లు తెలుస్తోంది.
తనకు, రామ్ కు అడ్వాన్స్ వ్యవహారం కందిరీగ సినిమా నాటిదని, ఆ తరువాతనే అది సెటిల్ అయిపోయిందన్నది సురేష్ కామెంట్ గా వినిపిస్తోంది. అయితే గతంలోనే సెటిల్ అయిపోతే, రెండేళ్ల క్రితం చాంబర్ కు తన సమస్యలు వివరించినపుడు ఈ బాకీని కూడా ఎలా పేర్కోన్నాడని ఇండస్ట్రీ వర్గాలు కొన్ని పేర్కొంటున్నాయి. అందవల్ల బెల్లంకొండ ఏదో విధంగా బాకీ వసూలు చేసుకునే వుంటాడని, అందులో అనుమానం పడక్కరలేదని ఇండస్ట్రీలోని కొన్ని వర్గాల బోగట్టా.
కానీ తను అసలు నాలుగు రోజులుగా ఊళ్లోనే లేనని, ప్రస్తుతం తాను కొన్ని మొక్కుబడులు చెల్లించేందుకు అంతర్వేది, అయినవిల్లి తదితర పుణ్య క్షేత్రాల సందర్శనలో వున్నానని బెల్లంకొండ చెప్పాడట. అయినవిల్లి గణపతికి మూడు వేల కొబ్బరికాయల మొక్కు చెల్లించేందుకు బెల్లంకోండ వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో ఇదే ఆలయానికి ఆర్చి నిర్మాణం, అలాగే పది వేల కొబ్బరికాయల మొక్కు తీర్చుకున్నాడట ఆయన. ఈ వార్తల గురించి స్రవంతి రవికిషోర్ తో మాట్లాడతానని బెల్లంకొండ అంటున్నట్లు తెలుస్తోంది.
మరి ఈ గ్యాసిప్ పొగ వెనుక నిప్పు ఏముందో? ఏది నిజమో? ఏది అబద్ధమో?