లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగంధం అంటూ ఒకటి కాదు లెక్కకు మించి బయోపిక్ లు ప్రకటించేస్తున్నారు. అసలు సిసలు ఎన్టీఆర్ బయోపిక్ ఆయన కొడుకు బాలయ్య అందిస్తున్నదే. వారాహి చలన చిత్ర బ్యానర్ కు బాలయ్య, సిసిఎల్ విష్ణు కలిసి నిర్మించే ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం 'ఎన్టీఆర్' అనే టైటిల్ రిజిస్టర్ చేసారట.
అంటే ఇదే టైటిల్ అని ఫిక్సయిపోయారన్న మాట. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ సినిమా ప్రకటించేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కోసం కొత్త నటుడుని ఎంపిక చేసి, ట్రయినింగ్ కూడా ఇస్తున్నట్లు ప్రకటించేసాడు. చంద్రబాబు పాత్రలో జెడి చక్రవర్తి నటిస్తారని కూడా వార్తలు వినవచ్చాయి.
ఆటలో అరటిపండు అన్నట్లు లక్ష్మీస్ వీరగంధం అంటూ ఓ సినిమాను ప్రకటించారు. అంటే మొత్తం ఎన్టీఆర్ చరిత్రను మూడు ముక్కలు చేసేస్తున్నారన్నమాట. పుట్టిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా ఒకరు, ముఖ్యమంత్రి నుంచి వెన్నుపోటు వరకు మరొకరు, ఈ మధ్యలో ఎన్టీఆర్ రెండో భార్య మొదటి భర్త వైనం మరొకరు పంచేసుకున్నట్లు కనిపిస్తోంది.
వాస్తవానికి ఈ మూడింటిలో సినిమాకు అవసరమైన ఎమోషనల్, ఇంట్రెస్టింగ్ కంటెంట్ అంటూ వుండేది రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ కే. ఎందుకంటే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం వరకు ఆయన జీవితం దాదాపు తెరచిన పుస్తకం. అందరికీ తెలిసిన విశేషాలే. కానీ ఎన్టీఆర్ ను చంద్రబాబు అండ్ కో గద్దె దింపడం వెనుక ఏం జరిగింది అన్నది ఆ నోటా ఈ నోటా వినడం తప్ప పెద్దగా తెలియదు. పైగా అందులో సినిమాకు సరిపడా ముడిసరుకులు పుష్కలంగా వుంటాయి. కానీ ఎటొచ్చీ రామ్ గోపాల్ వర్మ మేకింగ్ మీద పెట్టే శ్రద్ధ కథ మీద, కథనం మీద కూడా పెట్టాలి.