Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాగార్జున స్టాంప్‌ కు మరీ అంత హడావుడా?

కింగ్‌ నాగార్జునకు అరుదైన గౌరవం దక్కిందని, ఆయన బొమ్మతో పోస్టల్‌ శాఖ ఒక ప్రత్యేకమైన 5 రూపాయల స్టాంపును విడుదల చేసిందని రెండు రోజులుగా మీడియాలో వార్తలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఏకంగా అన్నపూర్ణ స్టుడియోస్‌ నాగార్జున బర్త్‌డే సందర్భంగా జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ పోస్టల్‌ స్టాంపును అక్కినేని అఖిల్‌, చైతన్య ఇద్దరూ కలసి విడుదల చేశారంటూ చాలా హడావుడి జరిగింది. 

రేపు స్టాంపు విడుదల చేయబోతున్నారంటూ ముందురోజే భారీ ప్రచారం నిర్వహించారు. తీరా అయిన తర్వాత.. మీడియాలో మస్తు హైప్‌ చేశారు. అయితే నిజానికి అంత ఉందా? నాగార్జున బొమ్మతో పోస్టల్‌ స్టాంప్‌ విడుదల అనేది జాతి గర్వించేంత గొప్ప విషయం అయిందా? అనేది ఇప్పుడు చర్చ. 

అసలు సంగతి తెలియని అభిమానులు ఎంతగానైనా మురిసిపోవచ్చు.. కానీ విషయం ఏంటంట.. నాగార్జున బొమ్మతో విడుదల చేసినది.. ప్రెవేటు పోస్టల్‌ స్టాంప్‌. ఇలాంటి పోస్టల్‌ స్టాంపులను ఈ దేశంలో ఎవరు అడిగినా ఇస్తారు. పోస్టల్‌ శాఖకు కేవలం 300 రూపాయలు కడితే చాలు.. మీ ఫోటోతో కూడా ఓ స్టాంపు వస్తుంది. కావాలంటే మీ పెంపుడుకుక్కపిల్ల ఫోటోతో కూడా పోస్టల్‌ స్టాంపు వస్తుంది. 

పోస్టల్‌ శాఖ వద్ద ముందస్తుగా ముద్రించిన టెంప్లేట్‌ స్టాంప్‌ షీట్స్‌ ఉంటాయి. వాటిలో 12 ఫోటోలకు సరిపడా ఖాళీ ఉంటుంది. మీరు 300 రూపాయలు చెల్లించి, ఓ ఫోటో ఇస్తే, దాన్ని ఆ స్థలంలో ప్రింట్‌ చేసి ఇస్తారు. 12 స్టాంపులు 5 రూపాయల విలువైనవి మీకు వస్తాయి. అంతే. దీనిని 'మై స్టాంప్‌' పథకం కింద పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ వ్యవహరిస్తుంది. పోస్టల్‌ శాఖ వద్ద ఉండే రకరకాల టెంప్లేట్స్‌లో, తాజ్‌ మహల్‌ టెంప్లేట్‌ను ఎంచుకుని నాగ్‌ బొమ్మతో వీరు స్టాంపులు చేయించుకున్నారు. 

అదేదో గిఫ్టుగా ఇచ్చుకోవడానికి సరిపోయే కంటెంట్‌ మాత్రమే తప్ప.. జాతీయ నాయకుల స్థాయిలో పోస్టల్‌ శాఖ నాగార్జునను స్టాంపు విడుదల చేయడం ద్వారా గౌరవించినట్లుగా తెలిసీ తెలియకుండా భారీ ప్రచారం ఈ వ్యవహారానికి వచ్చేసింది.

నిజానికి ఈ 'మైస్టాంప్‌' పద్ధతి కొత్త కాదు. గతంలో తిరుపతిలో మోహన్‌ బాబు బొమ్మతో కూడా స్టాంపులు వేశారు. చంద్రబాబు జన్మభూమి కార్యక్రమం పేరిట ఓసారి స్టాంపులు వచ్చాయి. కొందరు జిల్లా కలెక్టర్లు, అధికారులు అయితే.. తమకు అతిథులు వచ్చేప్పుడు వారికి వారి బొమ్మతో ఇలాంటి స్టాంపులను చేయించి స్వాగత కానుకల్లో ఒకటిగా ఇవ్వడం చాలా అలవాటుగా మార్చుకున్నారు. చాలా మంది ప్రజలు కూడా తమ తమ పిల్లల బర్త్‌డేలకు కేవలం 300 రూపాయలు ఖర్చు పెట్టి ఇలాంటి స్టాంపులు చేయించేసుకుంటూ ఉంటారు. 

ప్రెవేటు స్టాంపు విడుదలకు కూడా ఇంత పబ్లిసిటీ దక్కేట్లయితే.. సినిమా వాళ్లు ప్రతి సినిమాకూ ఆడియో విడుదల లాగే, ముందస్తుగా స్టాంపు విడుదల అంటూ ఓ కార్యక్రమం పెట్టి 300 రూపాయల ఖర్చుతో ప్రచారానికి ఎగబడతారని జనం జోకులేసుకుంటున్నారు. మైస్టాంప్‌ అనేది ప్రెవేటు స్టాంప్‌ అని... దానికి అంత హడావిడి, ఆర్భాటం అనవసరం అనీ తలపోస్తున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?