ఓటుకు నోటు కేసు మళ్ళీ వెక్కిరిస్తోంది.. బెదిరిస్తోంది.. చంద్రబాబు మేకపోతు గాంభీర్యమే ప్రదర్శించాల్సి వస్తోందిప్పుడు. 'దాని గురించి మాట్లాడటానికేముంది.?' అని చంద్రబాబు మీడియా ముందు బోల్డంత ధీమా వ్యక్తం చేస్తున్నా, ఆయన కళ్ళలో మాత్రం భయం సుస్పష్టంగా కన్పిస్తోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అధికార పార్టీల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా ఓటుకు నోటు కేసు తెరపైకొచ్చిందన్నది నిర్వివాదాంశం. తెలంగాణ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఓవరాక్షన్, చంద్రబాబు నికృష్ట రాజకీయాలు, రాజకీయంగా కేసీఆర్ దిగజారుడుతనం.. ఇవన్నీ కలగలిస్తేనే ఓటుకు నోటు కేసు. టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్ కొనేయడం, దానికి ప్రతిగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేని కొనేయాలని టీడీపీ అనుకోవడం.. ఇదంతా ఓపెన్ సీక్రెట్. అధికారం చేతిలో వుంది గనుక, టీడీపీని కేసీఆర్ అడ్డంగా బుక్ చేసేయగలిగారు. ఇది జరిగిన విషయం.
కేసులు నమోదయ్యాయి, రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్ళారు.. ఆయనతోపాటు సండ్ర వెంకట వీరయ్య జైలుని చూసొచ్చారు.. ఇప్పుడంతా బెయిల్‌పై విడుదలయ్యారు. అంతా 'కామప్' అయిపోయిందనుకున్న తరుణంలో ఓటుకు నోటు కేసు మళ్ళీ వైఎస్సార్సీపీ పుణ్యమా అని ఊపిరి పోసుకుంది. ఇక్కడే, చంద్రబాబుకి ఎక్కడో కాలింది. 'కేసులో బుక్కయిపోతానా.?' అంటూ చంద్రబాబు తెగ ఇదయిపోతున్నారట. తప్పదు మరి, ఈసారి కేసు, 'చంద్రబాబు బ్రీఫింగ్' చుట్టూనే నడుస్తోంది కదా.!
'అబ్బే, మనదాకా ఆ కేసు రాదు..' అని టీడీపీ నేతలు భరోసా ఇస్తున్నా, పాపం చంద్రబాబులో టెన్షన్ తగ్గడంలేదు. ఎలా తగుతుంది.? బ్రీఫింగ్ చేసింది ఆయనే కదా. వున్నపళంగా ఢిల్లీకి పరిగెడదామంటే, అక్కడా పరిస్థితులు ఏమంత అనుకూలంగా లేవు. పవన్‌కళ్యాణ్ వచ్చి ప్రత్యేక హోదా పేరుతో టీడీపీ – బీజేపీ మధ్య చిచ్చు పెట్టడంతో చంద్రబాబు ఢిల్లీకి మొహం చాటేయాల్సిన పరిస్థితి. 'ఏం, మీరు మీ స్థాయిలో పవన్‌కళ్యాణ్‌ని కంట్రోల్ చేయలేకపోయారా.?' అని ఇప్పటికే ఢిల్లీ నుంచి చంద్రబాబుకి తలంటు పోసేశారన్న గాసిప్ విన్పిస్తోంది.
మరి, ఇప్పుడేం చెయ్యాలి.? ఓటుకు నోటు కేసు ఏమవుతుంది.? ఇప్పుడు ఈ 'పోటు' చంద్రబాబుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు హైద్రాబాద్‌లో జరుగుతాయి. ఆ సమయంలో గనుక, ఓటుకు నోటు కేసులో నోటీసుల్లాంటివి చంద్రబాబు అందుకోవాల్సి వస్తే పరిస్థితి దుర్భరంగా మారిపోతుంది. షరామామూలుగానే ప్రతిపక్షం, అసెంబ్లీలో టీడీపీని కడిగి పారేస్తుంది కదా.!
మా చెడ్డ కష్టమే వచ్చిందిప్పుడు చంద్రబాబుకి. అద్బుతం జరిగితే తప్ప, ఈ గండం గట్టెక్కే అవకాశం కన్పించడంలేదు చంద్రబాబుకి. అరెస్టయిపోతాననే భయం లేకపోయినప్పటికీ, అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షానికి మొహం కూడా చూపించలేని పరిస్థితుల్లోకి తనను ఓటుకు నోటు కేసు నెట్టేస్తుందని చంద్రబాబు కలలో కూడా ఊహించి వుండరు.