ఇద్దరూ టాప్ డైరక్టర్లే. వాళ్ల షెడ్యూళ్లు, ప్లానింగ్ లు వాళ్ల స్టయిల్ ఆఫ్ మేకింగ్ వాళ్లకు వుంటాయి. కానీ ఇప్పుడు మరో టాప్ డైరక్టర్ వల్ల మొత్తం వ్యవహారం మారుతోంది. ఇదంతా రామ్ చరణ్-ఎన్టీఆర్ ల సినిమాల వ్యవహారమే. రామ్ చరణ్ ఓ సినిమాను బోయపాటి శ్రీనివాస్ తో ఓకే చేసాడు. ఎన్టీఆర్ ఓ సినిమాను త్రివిక్రమ్ తో ఓకె చేసాడు. ఇద్దరు డైరక్టర్లు స్టార్ డైరక్టర్లే. రెండు కాంబినేషన్లు క్రేజీ కాంబినేషన్లే.
కానీ రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఓ సినిమా ఓకె చేసారు. అది రాజమౌళి సినిమా. ఇంక ఆ సినిమా లెవెల్, ఆ సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పకనక్కరలేదు. కానీ ఆ సినిమానే ఇప్పుడు ఈ రెండు సినిమాలను వెంటతరుముతోంది.
ఇద్దరు హీరోలు ఆగస్టు నుంచి తనతో వుండాలని రాజమౌళి కోరినట్లు బోగట్టా. రాజమౌళి కోరడం అంటే అది హుకుం కిందే లెక్క. సెప్టెంబర్ నుంచి సినిమా సెట్ మీదకు వెళ్తుంది. ఆగస్టు నెలంతా విజువలైజేషన్ అంటూ ఏదో చేస్తారట రాజమౌళి. ఏమయితేనేం జూలై నెలాఖరుకల్లా త్రివిక్రమ్, బోయపాటి తమ తమ సినిమాలకు గుమ్మిడికాయ కొట్టేయాల్సిందే.
బోయపాటి సినిమా ఈ నెలాఖరు నుంచి స్పీడప్ అవుతుంది. త్రివిక్రమ్ సినిమా వచ్చే నెల మూడో వారంలో ప్రారంభం అవుతుంది. అంటే బోయపాటికి అయిదు నెలలు, త్రివిక్రమ్ కు నాలుగు నెలలు టైమ్ దొరికినట్లు. మరి ఎలా పరుగులు పెడతారో? ఏమో?