ఇదే చివరి పాఠం కావాలి

గొడుగు కర్ర నీదే..కానీ దాన్ని తిప్పడంలో నీకు వున్నహక్కులకు కూడా ఓ లిమిట్ వుంటుంది అని చిన్నప్పటి ఇంగ్లీషు పాఠం చెప్పనే చెప్పింది. వినోదానికి కూడా ఓ హద్దు వుంటుంది. కళ, కళాకారుడు, తొక్క…

గొడుగు కర్ర నీదే..కానీ దాన్ని తిప్పడంలో నీకు వున్నహక్కులకు కూడా ఓ లిమిట్ వుంటుంది అని చిన్నప్పటి ఇంగ్లీషు పాఠం చెప్పనే చెప్పింది. వినోదానికి కూడా ఓ హద్దు వుంటుంది. కళ, కళాకారుడు, తొక్క తోటకూర కబుర్లుచెప్పితే నడవదు. గతంలో ఓ సినిమాలో బ్రాహ్మణ కులాన్ని వెక్కిరింత పాలు చేస్తే, వాళ్లు ఏమీ చేయలేక అలజడి చేసి ఊరుకున్నారు. 

ఈవీవీ ప్రతి సినిమాలో ఇదే తంతువుండేది. హిందూమతాన్ని సినిమాల్లో కించపర్చడం అన్నది మన సినిమాల్లో మామూలే. ఎందుకంటే వాళ్లు ఏమీ అనరు, మహా అయితే ఓ ప్రకటన ఇచ్చి ఊరుకుంటారు. అదే మరింకే మతం జోలికైనా వెళ్తారా? చితక్కొట్టి వదిలిపెడతారు. ఆ భయం అక్కడ వుంది. ఇప్పుడు హాస్యనటుడు వేణు తప్పు చేసాడా? అసలు తప్పు ఎవరిది? అని తర్కించే ముందు, దాడి తప్పా ఒప్పా అన్నది డిస్కస్ చేసే ముందు, ఇలాంటి కార్యక్రమాలు చేసే వారికి ఓ భయం  పుట్టించారు. ఓ జాగ్రత్తకు నాంది పలికారు. ఇకపై ఇది ఓ ప్రమాద హెచ్చరికగా పనిచేయాలి.

సినిమాల వారికి బ్రాహ్మణ కులం అంటే చులకన. పురోహితుడ్ని కొట్టించడం, వాళ్ల ఆచార వ్వవహారాలను కించపర్చడం వారికి అలవాటు. ఈ సారి ఈ అలవాటును మిగిలిన కులాల మీద చేసి చూడమనండి..మాట్లాడితే కళ,,కళాకారుడు..ఎవరు ఇచ్చారు కళాకారుడికి ఇంకొకర్ని కించపరిచే  అధికారం?

సరే, ఇంతకీ వేణు ఉదంతానికి వస్తే,,ఇందులో తప్పు వేణు ఒక్కరిదేనా? ఆ కార్యక్రమానికి  ప్రొడక్షన్ వాళ్లు వుంటారు. ఓకె చేసిన టీమ్ వుంటుంది. దాన్ని పర్యవేక్షించే ఛానెల్ అధికారులు వుంటారు. అంతెందుకు అక్కడ మేం న్యాయ నిర్ణేతలం అని చెప్పుకునే రోజా, నాగబాబు వుంటారు. మరి వీరంతా ఏం చేస్తున్నట్లు? ఛీప్ ఎడిటర్ అని లేదా ఛానెల్ ఓనర్ అని అనిపించుకుంటే సరికాదు. అందులో వచ్చే కార్యక్రమాలకు బాధ్యత వహించాలి.

అయితే ఒక విషయం కూడా గమనించాలి. తప్పుకు దండించడం, చట్టం తమ చేతుల్లోకి తీసుకోవడం కూడా సరికాదు. పోలీసు కేసు పెట్టారు..ధర్నాకు దిగొచ్చు..నిరసన ప్రదర్ళన చేయచ్చు. కానీ దాడి చేయడం అన్నది సరికాదు.

ఏదైనా ఇకపై అయినా టీవీ, సినిమా కళాకారులు, రూపకర్తలు ఇది ఆఖరి పాఠంగా భావించి, ఇకపై ఎదుటివారిని కించపరిచే కార్యక్రమాలు రూపొందించడం మానేస్తారని, అందరినీ గౌరవంగా చూస్తారని ఆశిద్దాం. కానీ ఇటీవల  టీవీ కార్యక్రమాలు మరీ భ్రష్టుపట్టిపోయాయి. దిగజారుడు హాస్యం తెరనేలుతోంది. ఆలీ చేస్తున్న ఆలీ టాకీస్ లో డబుల్ మీనింగ్ లు రాజ్యమేలుతున్నాయి. వీటిని కూడా ఆ ఛానెల్ యాజమాన్యం కాస్త కంట్రొల్ లో పెడతారేమో చూడాలి.