ఒకప్పుడు ఆకాశమే హద్దుగా అనే వాళ్ళం. ఆకాశం అనేది హద్దు కాదు.. అది అనంతం అని తెలుసుకున్నాం. అనంత విశ్వంలోని రహస్యాల్ని ఛేదించే దిశగా మానవాళి ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. గడచిన కొన్ని దశాబ్దాలుగా అంతరిక్షానికి సంబంధించి అనేక విషయాల్ని, సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే వాస్తవాల్నీ తెలుసుకున్నాం.. తెలుసుకుంటూనే వున్నాం. అమెరికా, రష్యా.. ఇటీవలి కాలంలో చైనా మరికొన్ని దేశాలు.. అంతరిక్ష రంగంలో అద్భుత విజయాల్ని సాధిస్తున్నాయి. భారతదేశం కూడా రేసులో పోటీ పడ్తోంది. పోటీ అంటే అలా ఇలా కాదు.. ప్రపంచమే ముక్కున వేలేసుకునేలా అంతరిక్షంలో అరుదైన విజయాల్ని సొంతం చేసుకుంటోంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో). తొలి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపినప్పటినుంచి ఇప్పటిదాకా, విజయాలూ, వైఫల్యాలూ.. చాలానే చవిచూసిన ఇస్రో, విజయాలు చూసినప్పుడు ఉత్సాహంతో.. వైఫల్యాల్ని చూసినప్పుడు మరింత పట్టుదలతో అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకుపోతూనే వుంది. ఏనాడూ ఏ విషయంలో ఇస్రో వెనుకడుగు వేయకపోవడం గొప్ప విషయం.. ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ విషయం.
మిగతా దేశాలతో పోల్చితే ప్రయోగాలకు భారతదేశంలో వనరుల సమీకరణ అతి కష్టమైన విషయం. ‘కోట్లు ఖర్చు చేసి అంతరిక్షంపై ప్రయోగాలు చేయడం కన్నా.. పేదలకు తిండి పెట్టే కార్యక్రమాలు చేపట్టండి..’ అనే విమర్శలు అనేకం వచ్చిపడ్తుంటాయి. రాజకీయ ప్రయోజనాలతో కూడుకున్న విమర్శలే ఇందులో ఎక్కువ. ఆ కారణంతోనే ప్రయోగాల కోసం నిధులు కేటాయించే విషయంలోనూ ప్రభుత్వాలు అంతగా ఉత్సాహం చూపవు. వున్న వనరుల్లోంచే అత్యద్భుత విజయాల్ని సొంతం చేసుకోవడంపై ఇస్రో దృష్టిపెడుతూ వస్తోంది. తాజాగా ఇస్రో చేపట్టిన ప్రయోగం జీఎస్‌ఎల్‌వీ మార్క్3 విజయవంతమయ్యాక, ఇస్రో శాస్త్రవేత్తలు పరిమితమైన వనరులతో అపరమితమైన విజయాల్ని సాధించడం వెనుక, ‘ఇస్రో’లోని సిబ్బంది అందరి కృషీ వుందని వెల్లడించారు. మనకున్న వనరులు ఎంత పరిమితమైనవో వారే చెప్పాల్సిన పనిలేదు.. శాస్త్ర శాంకేతిక రంగాలపై పాలకులు చూపుతున్న నిర్లక్ష్యం ప్రతి ఒక్కరికీ తెలుసు. ఓట్లు తెచ్చే పథకాల రూపకల్పన మీద వున్న శ్రద్ధ, రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాధినేతలకు శాస్త్ర సాంకేతిక రంగాలపై లేదన్నది నిర్వివాదాంశం. రాజకీయాలెప్పుడూ అలానే వుంటాయనుకోండి.. అది వేరే విషయం.
ఇక, జీఎస్‌ఎల్‌వీ విషయానికొస్తే.. అనేక అవాంతరాల్ని ఎదుర్కొని, ఈ రాకెట్ ఇస్రోకి సరికొత్త విజయాల్ని అందిస్తోందిప్పుడు. భారత్ అణ్వాయుధ సామర్థ్యం పొందిన అనంతరం, అంతర్జాతీయ సమాజం అనేకానేక ఆంక్షలు విధించిన నేపథ్యంలో, ఇస్రో ఇతరదేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే విషయంలో అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంది. ఆ ఇబ్బందుల్ని అధిగమించి, సొంతంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ది చేసుకుని, అంతరిక్ష రంగంలోకి దూసుకుపోయింది. వాస్తవానికి జీఎస్‌ఎల్‌వీ ఎప్పుడో ఇస్రో అమ్ములపొదిలో అత్యంత నమ్మకమైన రాకెట్‌గా మారాల్సి వున్నా, పరిస్థితులు అనుకూలించలేదు. ఆ కారణంగానే, అత్యంత నమ్మకమైన రాకెట్‌గా ఇస్రో మన్ననలు ఇప్పటిదాకా పొందిన పీఎస్‌ఎల్‌వీ ద్వారానే ‘చంద్రయాన్’ ప్రాజెక్టుని చేపట్టగలిగాం. మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)ని కూడా పీఎస్‌ఎల్‌వీ ద్వారానే చేపట్టగలిగాం. ఇక, ఇస్రో ఎన్నో ఆశలు పెట్టుకున్న జీఎస్‌ఎల్‌వీ తాజాప్రయోగం ‘మార్క్3’ సెక్సస్ అవడంతో ఇస్రో వర్గాల్లో కొత్త ఉత్సాహం స్పష్టంగా కన్పిస్తోంది. అంతరిక్షంలో మానవుల్ని పంపేందుకు జీఎస్‌ఎల్‌వీ మార్క్3 ప్రయోగం అతి పెద్ద పునాది. అంతరిక్షంలోకి ‘క్రూ’లేని ‘మాడ్యూల్’ని పంపించి, తిరిగి దాన్ని క్షేమంగా భూమ్మీదకు తీసుకురాగలిగామంటే, మరిన్ని ప్రయోగాల అనంతరం అంతరిక్షంలోకి ఎంచక్కా మనం వెళ్ళేందుకు మార్గం సుగమం అయినట్లే కదా. ఆ ఒక్కటీ జరిగిననాడు, అంతరిక్ష రంగంలో బారతదేశం అరుదైన సంతకం చేసేసినట్లే. ఇప్పటికే ఈ రంగంలో భారత్ సాధించిన విజయాలకు అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు సైతం ‘ఫిదా’ అవుతున్నాయి.
తక్కువ వనరులు ఇస్రోకి ఇబ్బందికరమే అయినా, అదే ఇప్పుడు ఇస్రో ఘనతగా మారిపోయింది. తక్కువ ఖర్చుతో అత్యద్భుతమైన ప్రయోగాలు చేసి చూపడం ద్వారా ప్రపంచానికి పాఠాలు చెప్పే స్థాయికి ఇస్రో ఎదిగింది. అమెరికా లాంటి దేశాలతో పోల్చితే, భారతదేశంలో అంతరిక్ష ప్రయోగాలకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఈ కారణంగా వివిధ దేశాలు తమ ఉపగ్రహాల్ని ఇస్రో ద్వారా ప్రయోగించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అలా ఇప్పటికే పలు విదేశీ ఉపగ్రహాల్ని ఇస్రో అంతరిక్షంలోకి పంపిన విషయం విదితమే. తద్వారా భారతదేశానికి విదేశాల నుంచి ఆదాయం వస్తోంది. ప్రయోగాలు ఒకదాని తర్వాత ఒకటి విజయవంతమవుతుండడంతో, విదేశాలు ఇస్రోపై ఆధారపడ్తుండడంతో, ఇస్రో ప్రభుత్వం నుంచి కేటాయింపుల కోసం ఎదురుచూడకుండా, తాను ఆర్థికంగా బలోపేతమవడంతోపాటు, భారత ఆర్థిక వ్యవస్థనూ బలోపేతం చేసే స్థాయికి ఎదగనుంది.
విమర్శలకు బెదరకుండా.. వైఫల్యాలకు వెరవకుండా.. అంతరిక్షంలో అరుదైన విజయాలు నమోదు చేసుకుంటూ, సెక్సస్ రేట్ విషయంలో విదేశాలు ఆశ్చర్యపోయేలా దూసుకుపోతోన్న ఇస్రో, సమీప భవిష్యత్తులో చంద్రుడిపైనా, ఆ తర్వాత మార్స్‌పైనా భారత కీర్తి పతాకను ఎగరవేయాలి. దానికి పాలకుల నుంచీ సరైన ప్రోత్సాహం లభించాలి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన ఇస్రోకి, పాలకుల నుంచి ఇంకా సరైన సహాయ సహకారాలు అందితే, ప్రపంచంలోనే అంతరిక్ష ప్రయోగాల్లో ది బెస్ట్‌గా ‘ఇస్రో’ ఎదిగేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఆ దిశగా ప్రభుత్వాల ఆలోచనలు సాగాలని ఆశిద్దాం, ఆకాంక్షిద్దాం.
వెంకట్ ఆరికట్ల